ఎన్నికల వేళ మల్టీస్టారర్ ప్రెండ్ షిప్!
సినిమా-రాజకీయం రెండు వేర్వేరు రంగాలు. రెండింటిని కలిపి మాట్లాడటానికి లేదు. సినిమా వాళ్లు రాజకీయాల్లో ఉన్నా? సినిమాల్లోకి మాత్రం రాజకీయాలను తీసుకురావొద్దంటారు.;
సినిమా-రాజకీయం రెండు వేర్వేరు రంగాలు. రెండింటిని కలిపి మాట్లాడటానికి లేదు. సినిమా వాళ్లు రాజకీయాల్లో ఉన్నా? సినిమాల్లోకి మాత్రం రాజకీయాలను తీసుకురావొద్దంటారు. కానీ ఇది సాధ్యమేనా? అని చాలా సందర్భాల్లో చాలా మందికి అనిపిస్తుంది. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లెంతో మంది ఉన్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల పరిస్థితిని పరిశీలిస్తే సినిమా-రాజకీయం ఒకేలా అనిపిస్తాయి. తమ అభిమాన స్టార్ రాజకీయాల్లోకి వెళ్తే చిన్న చిన్న నటులు వాళ్లకు మద్దతుగా రోడ్డెక్కి ప్రచారం చేస్తారు. సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే ప్రకటనలు చేస్తుంటారు.
ఇలాంటివి చూస్తున్నప్పుడు సినిమా-రాజకీయం ఎలా వేరవుతుందనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు కోలీవుడ్ లో కూడా కనిపిస్తుంటాయి. అక్కడ పరిస్థితులు తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. తమిళ హీరో విజయ్ రాజకీయ పార్టీ స్థాపించిన క్రమం తెలిసిందే. దీంతో అతడికి కోలీవుడ్ నుంచి ఎంత మంది స్టార్లు మద్దతుగా నిలుస్తారు? అన్న దానిపై రకరకాల చర్చలు జరిగాయి. కానీ ఎవరూ ఓపెన్ గా ముందుకొచ్చి మద్ద తివ్వలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఓ సందర్భంలో విజయ్ తీరునే పబ్లిక్ గా తప్పుబట్టే ప్రయత్నం చేసారు.
విజయ్ ఓ బహిరంగ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసి అధికార పక్షానికి తన మద్దతును ప్రకటించారు. విశ్వనటుడు కమల్ హాసన్ మాత్రం న్యూట్రల్ గా ఉన్నారు. విజయ్ రాజకీయ జీవితానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు జరగున్నాయి. విజయ్ ఎలాంటి పొత్తు లేకుండా బరిలోకి దిగుతున్నాడు. ఎలాగైనా అధికారంలో ఉన్న డీఎంకెని గద్దె దించి, డీఎంకె వారసత్వ కొమ్ములు వంచాలని చూస్తున్నాడు. విజయ్ ఎలాంటి బహిరంగ సభ నిర్వహించిన భారీ ఎత్తున తరలి వస్తున్నారు.
ఆ వేవ్ చూస్తుంటే? విజయ్ అధికారం చేజిక్కించుకుంటాడు అన్న నమ్మకం బలపడుతోంది. సరిగ్గా ఇదే సమ యంలో విజయ్ పై పొలిటికల్ ఎటాకింగ్ మొదలైంది. విజయ్ నటించిన `జన నాగయన్` రిలీజ్ కు బ్యాకెండ్ లో అడుగడుగునా అధికార పార్టీ అడ్డు తగులుతుందనే ఆరోపణలున్నాయి. రిలీజ్ పై రాజకీయ కుట్ర జరుగుతుందని విజయ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని డీఎంకే ఆడుతోన్న పొలిటికల్ గేమ్ గా భావిస్తున్నారు. ఇటీవలే రజనీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ఇంకా డైరెక్టర్ ఫైనల్ అవ్వలేదు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్- రాజ్ కమల్ ఫిల్మ్స్ సంయు క్తంగా నిర్మిస్తున్నాయి. రెడ్ జెయింట్ సంస్థ అన్నది తమిళనాడు ఉప ముఖ్యమంత్రి , హీరో ఉదయ్ నిధి స్టాలిన్ స్థాపించిన నిర్మాణ, పంపిణీ సంస్థ. ఈ సినిమా నిర్మాణంలో రెడ్ జెయింట్ భాగమవ్వడం వెనుక పొలిటికల్ గేమ్ ఉందా? అన్న సందేహాలు కోలీవుడ్ మీడియాలో వ్యక్తమవు తున్నాయి. గతంలో ఇదే సంస్థ కొంత మంది కోలీవుడ్ హీరోల చిత్రాల రిలీజ్ కు ఆటంకాలు కల్పించిందనే ఆరోపణలున్నాయి. అక్కడ స్టార్ హీరోలు నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా ఈ సంస్థ ద్వారానే జరిగేట్టు గేమ్ ఆడిందనే ఆరోపణ లున్నాయి. తాజాగా విజయ్ ఎన్నికల పోటీ బరిలో నిలిచిన వేళ ఇద్దరు బిగ్ స్టార్స్ నటిస్తోన్న సినిమా నిర్మాణంలో భాగమవ్వడం ఆసక్తికరంగా మారింది.