RSS శతాబ్ది వేడుక‌ల్లో స‌ల్మాన్ - ర‌ణ‌బీర్ పాల్గొన‌డానికి కార‌ణం?

సినిమా తార‌లు రాజ‌కీయ నాయ‌కుల కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌డం లేదా మ‌తత‌త్వ సంస్థ‌ల ప్ర‌చారాల్లో పాల్గొన‌డం కొన్నిసార్లు ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది.;

Update: 2026-02-08 07:52 GMT

సినిమా తార‌లు రాజ‌కీయ నాయ‌కుల కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌డం లేదా మ‌తత‌త్వ సంస్థ‌ల ప్ర‌చారాల్లో పాల్గొన‌డం కొన్నిసార్లు ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. అయితే మ‌రికొన్నిసార్లు ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు అటెండ‌వ్వ‌డం వ్యాపార‌వాణిజ్యంలో వంద‌ల కోట్ల ప్రాఫిట్ కి కూడా కార‌ణం కావొచ్చ‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

దీనికి కార‌ణం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ (RSS) శతాబ్ది వేడుకలలో ప్ర‌త్య‌క్ష‌మైన ఇద్ద‌రు స్టార్ హీరోలు చాలా కోణాల‌లో చ‌ర్చ‌కు తావిచ్చారు. ఆ ఇద్ద‌రూ మ‌రెవ‌రో కాదు.. ఒక‌రు స‌ల్మాన్ ఖాన్, మ‌రొక‌రు ర‌ణ‌బీర్ క‌పూర్. ఇద్ద‌రూ బాలీవుడ్ అగ్ర న‌టులు. అందువ‌ల్ల‌ ప్ర‌త్యేకించి ఆర్.ఎస్.ఎస్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం వెన‌క ఏదైనా ముఖ్య‌మైన కార‌ణం ఉందా? అని ప్ర‌జ‌లు ఆరా తీస్తున్నారు.

తాజా విశ్లేష‌ణ‌ల ప్ర‌కారం.. ఆ ఇద్ద‌రూ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్)లో ఉన్న త‌మ స్నేహాల కార‌ణంగా ఈవెంట్ కి అటెండ‌యిన మాట వాస్త‌వం. పైగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది చాలా సెంటిమెంట్ తో ముడిప‌డిన ఈవెంట్. ముంబైలోని నెహ్రూ సెంటర్ ఆడిటోరియంలో ఫిబ్రవరి 7, 8 తేదీల్లో `ఆర్.ఎస్‌.ఎస్ వందేళ్ల ప్ర‌యాణం- న్యూ ఆరిజోన్స్` అనే థీమ్‌తో రెండు రోజుల లెక్చర్ సిరీస్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రసంగించారు. సంఘం ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం సమాజంలో సానుకూల మార్పు కోసం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఆస‌క్తికరంగా ఆర్.ఎస్.ఎస్ అంటే హిందూ భావ‌జాలంతో ప్ర‌త్య‌ర్థి మ‌తానికి వ్య‌తిరేకంగా ఉంటుంద‌ని ప్ర‌చారం ఉంది. దానికి విరుద్ధంగా స‌ల్మాన్ ఖాన్ ఈ కార్య‌క్ర‌మానికి అటెండ్వ‌డం చ‌ర్చ‌గా మారింది. అయితే ఈ వేడుక‌లో ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్ త‌మ సంఘం ఎవ‌రికీ వ్య‌తిరేకం కాద‌ని వ్యాఖ్యానించ‌డం ద్వారా హిందూ- ముస్లిమ్ భాయి భాయి అనే అంశాన్ని ప్ర‌స్థావించిన‌ట్టు అయింది.

మ‌రింత డెప్త్ తో వివ‌రాల్లోకి వెళితే.. స‌ల్మాన్ భాయ్ ఈ కార్య‌క్ర‌మానికి అటెండ‌వ్వ‌డం యాథృచ్ఛికం కాదు. ఇటీవ‌ల మ‌నోభావాలు దెబ్బ తిన్నాయంటూ చాలా హిందూ సంస్థ‌లు ఖాన్ ల‌ను వెంబ‌డిస్తున్నాయి. ఖాన్ ల త్ర‌యంలోని ముగ్గురూ ఏ సినిమా తీసినా అందులో హిందువుల‌ను కించ‌ప‌రిచే అంశాలు ఉంటే వెంట‌నే అవి సెన్సార్ విష‌యంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. అయితే ఆర్.ఎస్.ఎస్ లాంటి హిందూ సంస్థ‌తో లేదా భాజ‌పా-ఎన్డీయేతో స‌న్నిహిత సంబంధాలు మెయింటెయిన్ చేయ‌డం ఇప్పుడు స‌ల్మాన్, ర‌ణ‌బీర్ లాంటి స్టార్ల‌కు చాలా అవ‌స‌రం. అందువ‌ల్ల కూడా వారు త‌మ మ‌ధ్య స్నేహం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఆర్.ఎస్.ఎస్. శ‌తాబ్ధి కార్య‌క్ర‌మంలో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, హేమ మాలిని, పూనమ్ థిల్లాన్, నితేష్ తివారీ (రామాయణ దర్శకుడు), ఓం రౌత్ (ఆదిపురుష్ దర్శకుడు), సుభాష్ ఘై, మోహిత్ సూరి, విక్రమ్ మల్హోత్రా, మహావీర్ జైన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్‌సి) ఛైర్మన్, గీత రచయిత ప్రసూన్ జోషి సల్మాన్ ఖాన్ పక్కనే కూర్చుని ప్రసంగాలను శ్రద్ధగా వినడం కనిపించింది.

ఈ వేడుక‌లో ర‌ణ‌బీర్ కోర మీసాల‌తో క‌నిపించ‌డంతో దీనిపైనా చ‌ర్చ సాగింది. ఇది సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న `ల‌వ్ అండ్ వార్` కోసమని తెలుస్తోంది. ఇక శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో వేదిక వెలుపల రణబీర్ కపూర్- నితేష్ తివారీ ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ జోడీ ప్ర‌స్తుతం రామాయ‌ణం సినిమాని వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో రణబీర్ క‌పూర్ హిందూ దేవుడు అయిన‌ శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. అందువ‌ల్ల శ‌తాబ్ధి వేడుక‌ల పేరుతో నాయ‌కుల‌తో ర‌ణ‌బీర్ క‌ల‌యిక సినిమాకు అన్నివిధాలా క‌లిసొస్తుంద‌ని న‌మ్ముతున్నారు.

అలాగే స‌ల్మాన్ ఖాన్ ఇప్పుడు దేశ‌భ‌క్తుడిగా న‌టిస్తున్నాడు. అత‌డు న‌టిస్తున్న ది బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్.. ఇండియా- చైనా బార్డ‌ర్ లో జ‌రిగిన ఒక నిజ ఘ‌ట‌న ఆధారంగా రూపొందుతోంది. ఇలాంటి సినిమాకు హిందూ దేశంలో మ‌ద్ధ‌తు త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. దానికి తోడు త‌న సినిమాని ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుద‌ల‌వ్వాలంటే రాజ‌కీయ పార్టీల అండ‌దండ‌లు కూడా అవ‌స‌ర‌మ‌ని స‌ల్మాన్ భావిస్తూ ఉండొచ్చ‌ని కూడా విశ్లేషిస్తున్నారు. శ‌తాబ్ధి ఉత్స‌వాల‌ కార్యక్రమం కేవలం రాజకీయంతో ముడిప‌డిన‌దే కాదు.. సంస్కృతి, కళలు, సామాజిక దృక్పథంపై చర్చించే వేదికగా నిలవ‌డంతో ఇందులో పాల్గొన్న స్టార్లు అంద‌రూ త‌మ బాణీని వినిపించార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ర‌ణ‌బీర్ క‌పూర్ -రామాయ‌ణం, స‌ల్మాన్ ఖాన్ `ది బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్` రెండు సినిమాల‌పైనా పాజిటివ్ బ‌జ్ న‌డుస్తోంది. ఈ సినిమాలు హిందూ దేశంలో సెంటిమెంట్ దృష్ట్యా పెద్ద విజ‌యం సాధిస్తాయ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News