స్టార్ హీరోల మల్టీ-ప్రాజెక్ట్ వ్యూహం: బడ్జెట్ నియంత్రణ సాధ్యమేనా?
ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసిన అగ్ర హీరోలు ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కోసం ఏళ్ల తరబడి సమయం కేటాయిస్తున్నారు.
ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసిన అగ్ర హీరోలు ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కోసం ఏళ్ల తరబడి సమయం కేటాయిస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, బన్నీ ఇలా స్టార్ హీరోలందరి భారీ చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు షూటింగ్ దశలోనే ఉంటున్నాయి. ఈ దీర్ఘకాలిక ప్రయాణం వల్ల నిర్మాణంపై ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాలుగేళ్లగా సినిమాలు చేయడం లో స్పీడ్ పెంచారు. ఒకేసారి రెండు..మూడు సినిమా షూటింగ్ లకు హాజరవ్వడంతో ఆ లోటును చాలా వరకూ భర్తీ చేస్తున్నారు.
తాజాగా ఇదే ఫార్ములాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 'రాకా' సెట్స్ లో ఉండగానే...పాన్ ఇండియా డైరెక్టర్లతో తదుపరి చిత్రాలకు సంబంధించి చేస్తోన్న డిస్కషన్ చూస్తుంటేనే అర్దమవుతుంది. ఈ పద్ధతి ద్వారా హీరోలు గ్యాప్‌ను భర్తీ చేయడమే కాకుండా పరిశ్రమలో వేగాన్ని నిలబెట్టే ఛాన్స్ ఉంది . అయితే ఒకేసారి రెండు మూడు ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడం ద్వారా నిజంగానే బడ్జెట్ అదుపులో ఉంటుందా? లేదా? అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమా ఆలస్యమైన కొద్దీ వడ్డీ భారం, క్రూ సభ్యుల జీతభత్యాలు, ప్రొడక్షన్ కాస్ట్ గణనీయంగా పెరుగుతాయి.
పారలల్ షెడ్యూల్స్ వేయడం వల్ల ఆర్టిస్టుల డేట్స్ సక్రమంగా సర్దుబాటు అయితే రోజువారీ ఖర్చులు ఆప్టిమైజ్ అవుతాయి. ఒకే సెటప్‌లో లేదా ఒకే షెడ్యూల్ ప్లానింగ్‌లో రెండు సినిమాలకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయడం ద్వారా ఓవర్ హెడ్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యూహంలో కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులు కూడా లేకపోలేదు. ఏకకాలంలో రెండు భారీ బడ్జెట్ చిత్రాలపై పనిచేయడం వల్ల హీరోల శారీరక, మానసిక శ్రమ విపరీతంగా పెరుగుతుంది. అలాగే గెటప్స్ మార్చడం, ఒకేసారి రెండు భిన్నమైన దర్శకుల విజన్‌కు అనుగుణంగా ప్రయాణించడం వల్ల నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.ఒకవేళ షూటింగ్ అనుకోకుండా ఆలస్యమైనా? దాని ప్రభావం రెండో ప్రాజెక్ట్ మీద పడి బడ్జెట్ తలకిందులయ్యే రిస్క్ కూడా లేకపోలేదు.
అయితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ నిరంతరం కళకళలాడుతూ ఉండటానికి మాత్రం మల్టీ-ప్రాజెక్ట్ అప్రోచ్ ఎంతో దోహదపడుతుంది. ఏడాదికో సినిమా థియేటర్లలోకి వస్తే ప్రేక్షకుల్లో క్రేజ్ నిలకడగా ఉండటమే కాకుండా డిజిటల్ ..శాటిలైట్ హక్కుల వ్యాపారం కూడా నిర్మాతలకు అనుకూలంగా మారుతుంది. హీరోల క్రేజ్‌ను క్యాష్ చేసు కునేందుకు మార్కెట్‌లో నిరంతరం డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ సర్క్యులేషన్ వేగవంతం అవుతుంది.
అంతిమంగా చూస్తే సరైన ప్రణాళిక, పక్కా షెడ్యూల్ మేనేజ్‌మెంట్ ఉంటే ఒకేసారి బహుళ ప్రాజెక్ట్‌లను సెట్స్‌పైకి తీసుకెళ్లడం ద్వారా బడ్జెట్‌ను సమర్థవంతంగా నియంత్రిచొచ్చు. ఇది నిర్మాతల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా హీరోల కెరీర్‌కు కూడా సరికొత్త ఊపునిస్తుంది. పద్ధతి సరిగ్గా లేకపోతే తికమక తప్పదు కానీ తెలివిగా మలచుకుంటే మాత్రం టాలీవుడ్‌కు సరికొత్త విజయాల బాట అవుతుంది.