లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!
| ఈ సినిమా షూటింగ్ సమయంలో డల్హౌసీలో వాతావరణం అత్యంత శీతల వాతావరణం కారణంగా గడ్డ కట్టుకుపోయింది.
బాద్షా షారుఖ్ ఖాన్ ఆన్-స్క్రీన్ హీరో మాత్రమే కాదు. నిజ జీవితంలోనూ తోటి నటీనటులకు ఆపద్బాంధవుడని నిరూపించే అరుదైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సీనియర్ నటి మీతా వశిష్ట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం `దిల్ సే` షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ షారుఖ్ తన ప్రాణాలను ఎలా? కాపాడారో గుర్తు చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 1998లో విడుదలైన `దిల్ సే` చిత్రంలో షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించగా, మీతా వశిష్ట్ కీలకమైన మిలిటెంట్ గ్రూప్ సభ్యురాలిగా కనిపించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో డల్హౌసీలో వాతావరణం అత్యంత శీతల వాతావరణం కారణంగా గడ్డ కట్టుకుపోయింది. అక్కడి ప్రమాదకరమైన కొండ ప్రాంతంలో సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం తారసపడిందని తెలిపారు.ఆ సన్నివేశం షూటింగ్ సమయంలో నటీనటులకు ఇచ్చిన బూట్లకు ప్లాస్టిక్ సోల్స్ ఉండటం వల్ల కింద నేల స్పర్శ సరిగ్గా తెలియలేదని మీతా వశిష్ట్ చెప్పారు. మణిరత్నం వెనక్కి వెళ్లండి అని సూచించడంతో మీతా చిన్న చిన్న అడుగులు వేస్తూ నెమ్మదిగా వెనక్కి నడుచుకుంటూ వెళ్లారు.
అయితే ఒక్కసారిగా తాను కిందకు జారిపోతున్న అనుభూతి కలగడంతో ఆకాశం వైపు చూశానని తాను నిలబడింది నిటారైన లోయ అంచున అని అప్పుడే గ్రహించినట్లు తెలిపారు. చేతిలో ఏకే-47 తుపాకీ బరువుతో పాటు, జారుడుగా ఉన్న కొండ అంచు కావడంతో నిజంగానే లోయలోకి పడిపోయే ప్రమాదం ఏర్పడింది. వెనుక వైపు నుంచి అడు గులు వేస్తూ సరిగ్గా అంచు వరకు వెళ్లిన ఆమె ఒక్క క్షణంలో కిందికి జారిపోతుండగా షారుఖ్ ఖాన్ అప్రమత్తత ఆమె ప్రాణాలను కాపాడింది.
షారుఖ్ అద్భుతమైన రిఫ్లెక్స్‌లతో క్షణాల వ్యవధిలో మీతా జాకెట్ ముందు భాగాన్ని గట్టిగా పట్టుకుని పైకి లాగారని
మీతా గుర్తు చేసుకున్నారు. షారుఖ్ ఆ సమయంలో చూపిన వేగవంతమైన స్పందన లేకపోతే తీవ్రమైన ప్రమాదం జరిగి ఉండేదని తెలిపారు. భారీ తుపాకీ బరువు.. నిటారైన కొండచరియలు ఉన్న ప్రదేశంలో కింద పడిపోతే ఎవరూ కాపాడలేకపోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు షారుఖ్ ప్రాణాలను కాపాడిన నిజమైన దేవదూతలా నిలిచారని కొనియాడారు. ఈ సినిమా సమయంలోనే షారుఖ్ చూపించిన మరో మంచి గుణాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.
యాక్షన్ సీన్స్ లో భాగంగా మీతా చేతిలో ఉన్న రాయి పొరపాటున షారుఖ్ తలకు తగిలి చిన్న గాయమైనా? షారుక్ కోపగించుకోకుండా మీతాను ఆప్యాయంగా చూసుకున్నారన్నారు. సహ నటుల పట్ల షారుక్ రక్షణ వలయం.. ప్రేమ ఎప్పటికీ మరువలేనివన్నారు. ఈ సంఘటన షారుఖ్ లో దయను..ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మానవత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. వెండి తెరపైనే కాదు నిజ జీవితంలోనూ షారుక్ రియల్ హీరో అని నిరూపించిన ఉదంతం నెట్టింట వైరల్ అవుతోంది.