క్రమంగా ఇబ్బందికరంగా మారింది.. పెళ్ళిళ్లలో డ్యాన్సులపై సైఫ్!
భారతదేశపు ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ధనవంతులకు కొదవేమీ లేదు. బిలియనీర్లు ట్రిలియనీర్లు ఉన్నారు.;
భారతదేశపు ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ధనవంతులకు కొదవేమీ లేదు. బిలియనీర్లు ట్రిలియనీర్లు ఉన్నారు. నిరంతరం ధనికుల ఇళ్లలో పెళ్లిళ్లు పేరంటాలు, ఇతర వేడుకల కోసం వందల కోట్లు ఖర్చు చేయడం చూస్తున్నాం. ఇటీవల నేత్ర మంతెన-వంశీ గాదిరాజు పెళ్లితో పాటు, అంతకుముందు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లి కోసం వందల కోట్లు ఖర్చు చేయగా ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇలాంటి పెళ్లి వేడుకలలో సెలబ్రిటీలు డ్యాన్సులు చేయడం, అతిథులు, ప్రజలను ఆనందింపజేసినందుకు కోట్లాది రూపాయల ప్యాకేజీలను అందుకోవడం కూడా చర్చగా మారింది.
అయితే ఇలాంటి ప్యాకేజీల కోసం పాకులాడుతూ ఇప్పటికీ కింగ్ ఖాన్ షారూఖ్, సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ లాంటి స్టార్లు ధనవంతుల పెళ్లిళ్లలో డ్యాన్సులు చేస్తున్నారు. ఒక్కో పెర్ఫామెన్స్ కోసం భారీ ప్యాకేజీలు అందుకుంటున్నారు. ఇటీవల అంబానీల పెళ్లితో పాటు, మంతెన పెళ్లిలోను బాలీవుడ్ స్టార్ హీరోలు డ్యాన్సులు చేసి అహూతులను అలరించారు.
అయితే ఈ కల్చర్ కి బాలీవుడ్ ప్రముఖ స్టార్లలో ఒకరైన సైఫ్ అలీఖాన్ ఎందుకు దూరంగా ఉన్నారు?.. ఈ ప్రశ్నకు ఇప్పుడు అతడి నుంచి సమాధానం వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటివి సరదాగా ఉండేవి కానీ కాలక్రమంలో ప్రతిదీ మారిపోయిందని అన్నాడు. తన కుటుంబ నేపథ్యం కారణంగా సామాజిక అంచనాలు, పరిమితులు ఏర్పడ్డాయని, అందువల్ల ముంబైలో ధనికుల ఇళ్లలో పెళ్లిళ్లకు డ్యాన్సులు చేయడాన్ని విరమించానని సైఫ్ ఖాన్ తెలిపారు. సైఫ్ ఖాన్ పటౌడీ సంస్థాన అధినేత.. అతడు రాజవంశీకుడు. అందువల్ల మరో పటౌడీ ఖాన్ భారీ పెళ్లి వేడుకను నిర్వహిస్తే తాను డబ్బు కోసం డ్యాన్సులు చేయలేడు. అయితే సైఫ్ కి ఉన్న ఇలాంటి ఇమేజ్ సమస్య షారూఖ్ కి కానీ, రణ్ వీర్ కి కానీ లేదు. షారూఖ్ రాజవంశీకుడు కాదు.. కష్టంతో ఎదిగినవాడు.. అందుకే ఇప్పటికీ అతడు పెళ్లిళ్లలో వచ్చే భారీ ప్యాకేజీలను అస్సలు వదులుకోడు. సులువుగా వచ్చేదానిని తెలివిగా ఒడిసిపడతాడు. కొన్ని గంటలలోనే కోట్లు కొల్లగొడతాడు. ఇక రణ్ వీర్ సింగ్ సైతం ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి గొప్ప స్థాయికి ఎదిగాడు. అతడు బిలియనీర్ల పెళ్లిళ్లను వదులుకోవాల్సిన అవసరం లేదు. అది అతడికి అసౌకర్యాన్ని ఇవ్వదు.
ఇక సైఫ్ మ్యాటర్ కి వస్తే, అతడు ఎప్పుడూ ఒదిగి ఉండే హీరో. తన నేపథ్యం గురించి అస్సలు గుర్తుంచుకోడు. అందరినీ గౌరవిస్తూ, అందరితో గౌరవం అందుకునే నటుడు సైఫ్ ఖాన్. చాలా మంది బాలీవుడ్ తారలు క్రమం తప్పకుండా గ్రాండ్ హై ప్రొఫైల్ వివాహాలలో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ దీనికి దూరంగా ఉన్నాడు.
కెరీర్ ప్రారంభంలో తనకు ఇలాంటివి ఓకే అయినా కానీ, కాలక్రమంలో అంతగా నచ్చలేదని సైఫ్ తెలిపాడు. కాలం గడిచేకొద్దీ వయసు, నేపథ్యం, సామాజిక వాతావరణం ప్రతిదీ ప్రభావితం చేస్తాయని, ఒకప్పుడు సరదాగా అనిపించేది క్రమంగా ఇబ్బందికరంగా అనిపించడం ప్రారంభించిందని తెలిపాడు. ఓసారి పెళ్లిలో డ్యాన్స్ చేసి వెళ్లిపోతుంటే, తన దగ్గర బంధువు ఒకరు పిలిచి నీ రేంజ్ ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? అని ప్రశ్నించాడు. అది తనను చాలా ప్రభావితం చేసిందని సైఫ్ తెలిపాడు. ఫ్యామిలీ నేపథ్యంపై అంచనాలు, తమ సామాజిక వర్గంలో చర్చ వంటివి తనను ఇలాంటివి చేయకుండా ఆపాయని కూడా అంగీకరించారు సైఫ్ జీ. స్టేజీపై డ్యాన్సులు చేస్తున్నప్పుడు మనకు వ్యక్తిగతంగా తెలిసిన వారు ఉన్నప్పుడు అది ఇబ్బందికరం అని తెలిపాడు.
అలాగే వివాహాల్లో డ్యాన్సులు లేదా షోలు చేయడం నటుడి ఇమేజ్‌ను తగ్గించదని కూడా సైఫ్ నమ్ముతాడు. అయితే నటులు డబ్బు కోసం సినిమా ప్రాజెక్టులను ఎంచుకోకుండా జాగ్రత్త వహించాలని, వృత్తిపరమైన పని - ఆర్థిక నిర్ణయాల మధ్య స్పష్టమైన గీత ఉండాలని అభిప్రాయపడ్డాడు. సైఫ్ అలీ ఖాన్ ఒకప్పుడు విదేశీ పెళ్లిళ్లలో డ్యాన్సులు చేయడాన్ని ఆనందించానని, దానిని ఆహ్లాదకరమైన మేనేజ్ చేసానని తెలిపాడు. కెరీర్ ప్రారంభంలో అలాంటి ప్రదర్శనలు సర్వసాధారణం.. ఆనందించవచ్చు... కానీ, అవి ఇప్పుడు సరైనది అనిపించడం లేదు అని తెలిపాడు. అయితే పెళ్లిళ్లలో డ్యాన్సులు చేయాలా వద్దా? అనేది స్టార్ల వ్యక్తిగత ఆసక్తిని బట్టి ఉంటుందని, ఎవరినీ తాను విమర్శించనని, వారందరినీ గౌరవిస్తానని సైఫ్ అన్నారు. సైఫ్ ఖాన్ ఇటీవల ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ తో పాటు కనిపించాడు.