మూడేళ్ల త‌ర్వాత రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా

సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ ఈ సినిమాకు ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఇండియాలో ఈ మూవీ రిలీజ‌వ‌లేదు.;

Update: 2026-02-04 17:13 GMT

ప్ర‌ముఖ బాలీవుడ్ యాక్ట‌ర్, డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ నుంచి ఏదైనా సినిమా వ‌స్తుందంటే అది ఎన్నో వివాదాలు లేదా ప‌లుమార్లు వాయిదాల త‌ర్వాతే రిలీజ‌వుతుంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఈ విష‌యం ప్రూవ్ అవ‌గా, అత‌ని కెన్నెడీ మూవీ ప‌రిస్థితి కూడా అదే అయింది. వాస్త‌వానికి కెన్నెడీ అనే సినిమా 2023 నాటి సినిమా. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఆ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు.

మూడేళ్ల కింద‌టే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో స్క్రీనింగ్

అయితే ఇప్పుడీ మూవీ ఎట్ట‌కేల‌కు రిలీజ్ కు నోచుకున్న‌ట్టు తెలుస్తోంది. కెన్నెడీ మూవీ ఆఖ‌రికి ఓటీటీలో రిలీజ్ అవ‌డానికి సిద్ధ‌మైంది. ఈ అనౌన్స్‌మెంట్ ఫ్యాన్స్ కు ఎంతో ఊర‌ట‌నిస్తోంది. స‌న్నీలియోన్, రాహుల్ భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కెన్నెడీ సినిమా మూడేళ్ల కింద‌టే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో స్క్రీనింగ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

తెలియ‌ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం

సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ ఈ సినిమాకు ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఇండియాలో ఈ మూవీ రిలీజ‌వ‌లేదు. అయితే కెన్నెడీ మూవీ రిలీజ్ లేట‌వ‌డానికి గ‌ల కార‌ణాలు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్టంగా వెల్ల‌డి కాలేదు. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ తో పాటూ మ‌రికొన్ని ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో కూడా ప్ర‌ద‌ర్శించ‌బ‌డింది కానీ సినిమా థియేట‌ర్ల‌లోకి మాత్రం రాలేదు.

అయితే ఇప్పుడీ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ‌వుతుంద‌ని తెలిసి చాలా మంది ఆడియ‌న్స్ కెన్నెడీని బిగ్ స్క్రీన్ పై చూసే అవ‌కాశం కోల్పోయినందుకు నిరాశ ప‌డుతున్నారు. కాగా ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 20న జీ5లో ప్ర‌సారం కానుంద‌ని, అనురాగ్ క‌శ్యప్ చిత్ర టీజ‌ర్ ను షేర్ చేస్తూ క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఈ సినిమా విష‌యంలో చిత్ర యూనిట్ వ్య‌వ‌హ‌రించిన స‌హ‌నానికి అనురాగ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయితే చాలా ఏళ్ల‌కు ఈ సినిమా ఓటీటీలో రిలీజ‌వుతుంద‌ని కొంద‌రు ఆనందం వ్య‌క్తం చేస్తుంటే మ‌రికొంద‌రు మాత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఈ సినిమాను ఎడిట్ చేస్తారేమో అని ఆందోళన చెందుతున్నారు. షూటింగ్ పూర్తైన త‌ర్వాత చాలా ఏళ్ల‌కు ఓటీటీ రిలీజ్ కు నోచుకున్న కెన్నెడీ ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News