750 సినిమాలతో కోట సంపాదన ఎంతో 150 సినిమాలతో ప్రదీప్ రావత్ అంతేగా!
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇటీవల బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ ముంబైలో తుదిశ్వాస విడవడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇటీవల బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ ముంబైలో తుదిశ్వాస విడవడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించి విలన్‌గా తనదైన ముద్ర వేసిన ఆయన, గత కొంతకాలంగా క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత ప్రదీప్ రావత్ సాధించిన విజయం.. సంపాదించిన ఆస్తుల వివరాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
కళాకారుడికి, నటనకు ఎల్లలు, సరిహద్దులు లేవని ప్రదీప్ రావత్ తన సినీ ప్రయాణంతో నిరూపించారు. గతంలో తెలుగు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు లాంటి వారు పరభాషా నటుల రాక వల్ల స్థానిక నటులకు అవకాశాలు తగ్గుతున్నాయని ఆరోపించినా... ప్రదీప్ రావత్ మాత్రం పొరుగు భాష నుంచి వచ్చి టాలీవుడ్‌లో డజన్ల కొద్దీ చిత్రాల్లో నటించి తెలుగింటి నటుడిగా గుర్తింపు పొందారు. తన విలక్షణ నటనతో దక్షిణ భారతదేశంలోనూ విశేష ఆదరణ దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు, ప్రదీప్ రావత్‌ల కెరీర్, వారి ఆస్తుల విలువను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 750కి పైగా చిత్రాల్లో నటించిన దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు ఆస్తుల విలువ సుమారు 80 కోట్లు కాగా, ప్రదీప్ రావత్ కేవలం 150 సినిమాల్లో నటించే సుమారు 40 నుండి 41 కోట్ల నికర ఆస్తిని ఆర్జించారు. కోటాతో పోలిస్తే చాలా తక్కువ సినిమాలతోనే అందులో సగం ఆస్తిని సంపాదించడం నిజంగా అతడి ఆదరణకు నిదర్శనంగా చూడాలి. కోట లాంటి దిగ్గజ నటుల ముందే ఆయన కెరీర్ ఎదుగుదల అసాధారణమైనది.
మీడియా కథనాల ప్రకారం.. ప్రదీప్ రావత్ తన సినిమాల కోసం రోజుకు 2 లక్షల నుండి 3 లక్షల వరకు పారితోషికం తీసుకునేవారని సమాచారం. ఇతర భాషల్లో నటిస్తూ కేవలం 150 చిత్రాలతోనే 41 కోట్ల ఆస్తిని పోగేయడం అనేది ఆషామాషీ విషయం కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే ఆయనకు భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రదీప్ రావత్ నటించిన చివరి కన్నడ చిత్రం `త్రిశూలం` త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. పరభాషా నటుడిగా టాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించి అత్యధిక పారితోషికంతో పాటు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను సంపాదించిన ఆయన ప్రయాణం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విలన్‌గా ఎన్నో ఐకానిక్ పాత్రల్లో మెప్పించిన ప్రదీప్ రావత్ మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.