సెన్సార్‌షిప్‌లో మార్పులు.. నేటితరం ఔత్సాహిక ఫిలింమేకర్స్ తెలుసుకోవాల్సినవి!
| సినిమా, ఓటీటీ కంటెంట్ వీక్షణకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది. థియేటర్ సినిమాలకు యు/ఏ 7+, 13+, 16+ వంటి వయస్సు ఆధారిత సర్టిఫికెట్లు ప్రవేశపెట్టింది. ఓటీటీలకు కంటెంట్ రేటింగ్, పేరెంటల్ లాక్, వయస్సు నిర్ధారణ తప్పనిసరి చేసింది. టీవీలో ప్రసారం చేయాలనుకునే A సర్టిఫికెట్ సినిమాలను ఎడిట్ చేసి తిరిగి సర్టిఫికేషన్ పొందే అవకాశం కల్పించింది.
భారతీయ వినోద పరిశ్రమలో ప్రేక్షకుల వీక్షణ అనుభవాన్ని - కంటెంట్ నియంత్రణను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) వినూత్న మార్పులను అమలులోకి తీసుకువచ్చాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ, తల్లిదండ్రుల బాధ్యత, సృజనాత్మక స్వేచ్ఛను సమతుల్యం చేస్తూ థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలకు, ఓటీటీ లలో ప్రసారమయ్యే కంటెంట్‌కు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించారు. సెన్సార్ షిప్ విషయంలో మారుతున్న నియమనిబంధనల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు సినీఔత్సాహికులు అందరికీ ఉంది.
ముఖ్యంగా థియేట్రికల్ సినిమాల విషయానికి వస్తే.. సెన్సార్ బోర్డు గతంలో ఉన్న యుఏ (తల్లిదండ్రుల సమక్షంలో చూడవలసిన) వర్గాన్ని విస్తరిస్తూ కొత్త వయస్సు ఆధారిత వర్గీకరణను ప్రవేశపెట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఉండే తరహాలోనే యు/ఏ 7+ (7 ఏళ్లు పైబడిన పిల్లలకు), యు/ఏ 13+ (13 ఏళ్లు పైబడిన వారికి), యు/ఏ 16+ (16 ఏళ్లు పైబడిన వారికి) అనే మూడు నూతన కేటగిరీలను తీసుకువచ్చారు. వీటితో పాటు సాధారణ యు (యూనివర్సల్), A (అడల్ట్) సర్టిఫికెట్లు యథావిధిగా కొనసాగుతాయి. ఈ స్పష్టమైన విభజన వల్ల తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎలాంటి కంటెంట్ చూడవచ్చో సులువుగా అవగాహన వస్తుంది.
టెలివిజన్ (శాటిలైట్ టీవీ) ప్రసారాల విషయంలోనూ కీలకమైన సవరణలు అమలులోకి వచ్చాయి. నియమాల ప్రకారం A (అడల్ట్) సర్టిఫికేట్ పొందిన సినిమాలు నేరుగా బుల్లితెరపై ప్రసారం కాకూడదు. అయితే నిర్మాతల ఆర్థిక ప్రయోజనాలు- బుల్లితెర వీక్షకులను దృష్టిలో ఉంచుకుని.. అడల్ట్ సినిమాల్లోని అభ్యంతరకర దృశ్యాలను ప్రత్యేకంగా ఎడిట్ చేసి తిరిగి యు లేదా యు/ఏ సర్టిఫికేషన్ కోసం సమర్పించే వెసులుబాటును కల్పించారు. దీనివల్ల నిర్మాతలకు టీవీ శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే రాబడికి రక్షణ లభించింది.
ఇక ఓటీటీ, డిజిటల్.. సోషల్ మీడియా వేదికల కోసం కేంద్ర ప్రభుత్వం `ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ రూల్స్ 2021) ను అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు థియేటర్ల లాగా ముందస్తు సెన్సార్షిప్ను ఎదుర్కోకపోయినా.. తమ కంటెంట్‌ను U, యు/ఏ 7+, యు/ఏ 13+, యు/ఏ 16+, A కేటగిరీలుగా స్వయంగా వర్గీకరించాలి. యు/ఏ13+ అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న కంటెంట్‌కు పేరెంటల్ లాక్స్ (పాస్వర్డ్) సౌకర్యం ఇవ్వడంతో పాటు.. A రేటింగ్ కంటెంట్‌కు వయస్సు నిర్ధారణ ప్రక్రియను నిర్వహించాలి. అలాగే సినిమా ప్రారంభంలోనే హింస, నగ్నత్వం లేదా భాషపై కంటెంట్ డిస్క్రిప్టర్లను ప్రదర్శించాలి.
ఈ ఐటీ నిబంధనల కింద దేశ సార్వభౌమత్వానికి, శాంతిభద్రతలకు, మతపరమైన భావోద్వేగాలకు భంగం వాటిల్లకుండా కంటెంట్ రూపొందించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఫిర్యాదుల పరిష్కారానికి మూడు అంచెల వ్యవస్థను (లెవెల్-1: ప్లాట్‌ఫామ్ గ్రీవెన్స్ ఆఫీసర్, లేవెల్-2: రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని స్వీయ-నియంత్రణ మండలి, లెవెల్-3: ప్రభుత్వ అంతర్-శాఖల కమిటీ) ఏర్పాటు చేశారు. ఈ పక్కా మార్గదర్శకాల వల్ల ఓటీటీలలో సృజనాత్మక స్వేచ్ఛ దెబ్బతినకుండా.. అత్యంత బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రసార వాతావరణం ఏర్పడింది. సవరించిన కొత్త సినిమాటోగ్రాఫ్ చట్టంలో ఇవన్నీ పొందుపరిచిన విషయం నేటితరం ఔత్సాహిక నిర్మాతలు గ్రహించాలి.