నాన్న నా కూతురిని ఎత్తుకోవడం చూడాలి: మనోజ్
ఇదిలా ఉంటే, ఇప్పుడు మంచు మనోజ్ తన తాజా చిత్రం `భైరవం` విడుదల ప్రమోషన్స్ లో ఎంతో ఎమోషనల్ గా స్పందిస్తున్నారు.;
ఇటీవల మంచు కుటుంబంలో అన్నదమ్ముల వివాదం గురించి తెలిసిందే. అయితే ఈ గొడవలోకి తన తండ్రిని లాగాల్సొచ్చిందని పదే పదే మంచు మనోజ్ ఆవేదన చెందుతూనే ఉన్నారు. ఇది అన్నదమ్ముల గొడవ మాత్రమేనని అతడు చెబుతూ వస్తున్నాడు. అయితే ఈ గొడవల్లో మనోజ్ విషయంలో మంచు మోహన్ బాబు ఎంతో ఆవేదన చెందిన సందర్భాలు ఉన్నాయి. తీవ్ర ఘర్షణ సమయంలో, గుండెలపై తన్నావు! అని కూడా ఆయన ఒకానొక సందర్భంలో ఆవేదన చెందిన వీడియో వైరల్ అయింది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు మంచు మనోజ్ తన తాజా చిత్రం `భైరవం` విడుదల ప్రమోషన్స్ లో ఎంతో ఎమోషనల్ గా స్పందిస్తున్నారు. తన కుటుంబం మొత్తం కలిసి కూచుని భోజనం చేయాలని, తనవారిని కౌగిలించుకుని ప్రేమగా మాట్లాడుకునే రోజు రావాలని కోరుకున్నారు. అంతేకాదు తన తండ్రి తన పాపను ఎత్తుకుంటే చూడాలనుందని ఎమోషనల్ అయ్యారు మనోజ్. తండ్రిపై తనకు ఎలాంటి కోపం లేదని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నారు.
తన తల్లిని కలవాలన్నా, మాట్లాడాలన్నా కొన్ని కండీషన్లు పెట్టారని, అమ్మను ఇంటి బయటే కలవాలని కండిషన్ పెట్టారని, ఏం మాట్లాడాలో కూడా కండీషన్స్ అప్లయ్ అన్నారని, ఇలాంటి పరిస్థితి ఏ కొడుక్కీ రాకూడదని కూడా మనోజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ గొడవల కారణంగా తనకు ఎంతో ఇష్టమైన అక్కను దూరం పెట్టానని మనోజ్ అన్నారు. తన సోదరి ఏర్పాటు చేసిన `టీచ్ ఫర్ ఏ ఛేంజ్` కార్యక్రమానికి హాజరవుతానో లేదో అనుకున్నాను... కానీ తన కోసమే హాజరయ్యానని చెప్పారు.
ఇక తన భార్య పిల్లల కారణంగా, తన బాధ్యత పెరిగిందని, తనపై కత్తి కట్టిన వారి వల్ల తాను కూడా అలా మారాల్సి వచ్చిందని కూడా మనోజ్ అన్నారు. తన కుటుంబం కోసం తాను కూడా కత్తి ఎత్తాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఇప్పటివరకూ తాను కానీ తన భార్య మౌనిక కానీ ఆస్తులు అడగలేదని కూడా మనోజ్ తెలిపారు. మౌనిక తన తల్లిదండ్రులను కోల్పోయి దుఃఖంలో ఉందని, ఎన్నో సమస్యల్లో ఉందని, తనను ఆ స్థితిలో చూడలేకపోయానని మనోజ్ అన్నారు. మౌనికను ఈ గొడవల్లోకి అన్యాయంగా లాగొద్దని కూడా అభ్యర్థించారు.
మనోజ్ మాటల్లో ఉద్వేగంతో పాటు నిజాయితీ కనిపించాయి. అతడు తిరిగి తన కుటుంబాన్ని కలవాలని కోరుకుంటున్నాడు.