పెద్ది తరువాత.. మళ్లీ అదే సమస్యనా?
ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల మధ్య గ్యాప్ పెరుగుతుండటం పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోందని టాక్ వినిపిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మరోసారి థియేటర్ల పరిస్థితిపై చర్చ మొదలైంది. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టుల పేరుతో స్టార్ హీరోల చిత్రాలు విడుదలకు ఎక్కువ సమయం తీసుకుంటుండటం వల్ల థియేటర్లకు సరిపడా కంటెంట్ అందడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల మధ్య గ్యాప్ పెరుగుతుండటం పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోందని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు మళ్లీ సందడి తీసుకొచ్చింది. చాలా రోజుల తర్వాత భారీ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం, అనేక సెంటర్స్ లో సందడి కనిపించడం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊరటనిచ్చే అంశంగా మారింది. అయితే ఆ సినిమా తర్వాత వెంటనే మరో పెద్ద చిత్రం విడుదలకు సిద్ధంగా లేకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది.
గతంలో స్టార్ హీరోలు తక్కువ వ్యవధిలోనే సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ చిత్రాలు విడుదల చేయడం సాధారణంగా కనిపించేది. దీంతో థియేటర్లకు నాన్ స్టాప్ గా ప్రేక్షకుల రాక కొనసాగేది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సినిమా కోసం రెండేళ్ల, మూడేళ్ల వరకు సమయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. భారీ నిర్మాణ వ్యయం, పాన్ ఇండియా మార్కెట్ వంటి కారణాలతో మూవీ ప్రొడక్షన్ టైమ్ పెరిగింది.
అయితే ఆ మార్పు థియేటర్లపై ఒత్తిడి పెంచుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు విడుదలయ్యే సమయంలో మాత్రమే ప్రేక్షకుల రద్దీ కనిపిస్తుండగా, మిగతా రోజుల్లో అనేక థియేటర్లు ప్రేక్షకుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
సినిమా పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు వంటి అనేక వ్యవస్థలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. థియేటర్లకు క్రమం తప్పకుండా ప్రేక్షకులు రావాలంటే నాన్ స్టాప్ గా సినిమాలు విడుదల కావాల్సిందే. అందులోనూ స్టార్ హీరోల చిత్రాలు మార్కెట్ కు మెయిన్ స్ట్రెంత్ గా నిలుస్తాయి. అలాంటి చిత్రాలు ఎక్కువ గ్యాప్ తో వస్తే మొత్తం వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పాలి..
పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ గా పెట్టుకోవడం తప్పు కాదని, అయితే దాని పేరుతో మరీ గ్యాప్ ఎక్కువ కాకూడదనే వాదన కూడా వినిపిస్తోంది. మంచి కథతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా రూపొందించి, దాన్ని ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేసినా పాన్ ఇండియా రేంజ్ లో ఆదరణ పొందే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఓటీటీల నుంచి పోటీ ఉన్న సమయంలో థియేటర్లను నిలబెట్టుకోవాలంటే కంటెంట్ ఫ్లో ఆగకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు వేగంగా సినిమాలు పూర్తి చేసి తరచూ ప్రేక్షకుల ముందుకు వస్తే థియేటర్లకు ఊపు వస్తుందని భావిస్తున్నారు. లేకపోతే ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.