కంగన తప్పుకోలేదు తప్పించారా?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్‌గా డిజిటల్ స్క్రీన్‌పై సంచలనం సృష్టించిన రియాలిటీ షో 'లాక్ అప్'.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్‌గా డిజిటల్ స్క్రీన్‌పై సంచలనం సృష్టించిన రియాలిటీ షో `లాక్ అప్`. మొదటి సీజన్ భారీ విజయం సాధించడంతో ఓటీటీ ప్రియులంతా రెండో సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే `లాక్ అప్ సీజన్ 2` కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని రకాల ప్రక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈ షోకు హోస్ట్ గా కంగన బాధ్యతలు వహించలేదు. ఆమె స్థానంలో కొత్త హోస్ట్ లను బరిలోకి దించారు. అయితే హోస్టింగ్ బాధ్యతల నుంచి కంగన తనకు తానుగా తప్పుకుందా? తప్పించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కంగనా రనౌత్ ఈ షో నుండి స్వచ్ఛందంగా తప్పుకోలేదని.. ఆమెకు సమాచారం కూడా ఇవ్వకుండా మేకర్స్ హోస్ట్ బాధ్యతల నుంచి తప్పించారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఒక సూపర్ హిట్ రియాలిటీ షో విజయవంతం అయితే? అదే హోస్ట్‌ను కొనసాగించడం అనేది ఇండస్ట్రీ ట్రెండ్. కానీ షో నిర్మాత ఏక్తా కపూర్ - సదరు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ యాజమాన్యం ఈసారి భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం కంగనా అభిప్రాయాన్ని ..ఆమె కాల్‌షీట్లను పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండానే మేకర్స్ అంతర్గతంగా వేరే స్టార్లను హోస్ట్‌గా ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది.
ఈ హఠాత్ పరిణామం కంగనా రనౌత్ టీమ్‌కు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అంటున్నారు. ఈ నాటకీయ పరిణామాల వెనుక బలమైన కారణాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం కంగనా రనౌత్ నటిగా, దర్శకురాలిగా మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ అత్యంత బిజీగా గడుపు తున్నారు. ఆమె నటిస్తోన్న సినిమా షూటింగ్ లు ఏక ధాటిగా జరగడం లేదు. కంగన బిజీని బట్టి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రియాలిటీ షోకు అవసరమైన బల్క్ డేట్స్ ఇవ్వడం ఆమెకు కష్టతరంగా మారిందని అంచనా వేస్తున్నారు. ఈ డేట్స్ సమస్యను ముందే ఊహించిన మేకర్స్ కంగనతో చర్చలు జరపడానికి సమయం లేక ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే వాదనా బలంగానే వినిపిస్తోంది.
పరిశ్రమలో వినిపిస్తున్న మరో కీలకమైన అంశం ఏంటంటే? ఒక సెలబ్రిటీ ఇమేజ్ - వారి రాజకీయ అనుబంధాలు కొన్నిసార్లు కార్పొరేట్ బ్రాండ్లకు ఇబ్బందిగా మారొచ్చు. కంగనా రనౌత్ బోల్డ్ .. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. సీజన్ 1 సమయంలో ఆ కాంట్రవర్సీలే షోకి ప్లస్ అయ్యాయి. కానీ ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కొత్త గైడ్‌లైన్స్ దృష్ట్యా మేకర్స్ సేఫ్ జోన్‌లోకి వెళ్లాలని భావించే ఇలా పక్కన బెట్టి ఉండొచ్చు అన్నది మరో వెర్ఫన్. అందుకే కంగనకు ముందస్తు సంకేతాలు ఇవ్వకుండానే ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.