ఎన్టీఆర్ సాధించిన ఘనతలెన్నో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్. టాలీవుడ్ లో ఈ పేరు ఓ సెన్సేషన్. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును పెట్టుకోవడమే కాకుండా ఆయన పేరుని నిలబెట్టడానికి ప్రతీ క్షణం ప్రయత్నించే నటుడు.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్. టాలీవుడ్ లో ఈ పేరు ఓ సెన్సేషన్. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును పెట్టుకోవడమే కాకుండా ఆయన పేరుని నిలబెట్టడానికి ప్రతీ క్షణం ప్రయత్నించే నటుడు జూ. ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ చిన్న రోల్ చేసి సీనియర్ ఎన్టీఆర్ కంట్లో పడి, ఈ అబ్బాయి మంచి నటుడు అవుతాడని సీనియర్ ఎన్టీఆర్ దీవెనలు అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత 14వ ఏట గుణ శేఖర్ దర్శకత్వంలో బాల రామాయణం సినిమా చేశాడు.
నిన్ను చూడాలని సినిమాతో హీరోగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత రామోజీరావు సిఫారసుతో రాజమౌళితో కలిసి స్టూడెంట్ నెం.1 అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో తనలోని టాలెంట్ ను మొత్తం బయటపెట్టిన ఎన్టీఆర్, తనను తాను మంచి హీరో మెటీరియల్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ మాస్ హీరో అని కెరీర్ కొత్తల్లోనే తెలిసేలా చేశాడు. చాలా చిన్న ఏజ్ లోనే ఆది, సింహాద్రి సినిమాలను చేసి అతనిలోని మాస్ ను బయటకు తీసి రికార్డులు సృష్టించాడు. అలా 20 ఏళ్లు వచ్చే సరికే ఎన్టీఆర్ కు క్రేజ్ విపరీతంగా పెరిగింది.
2011లో లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తారక్ కు ఇప్పుడు ఇద్దరు కొడుకులు. అభయ్ రామ్, భార్గవ్ రామ్. కుటుంబం అంటే ప్రాణమిచ్చే ఎన్టీఆర్ ఎన్నోసార్లు తన ఫ్యామిలీనే తనకు బలమని చెప్పిన సందర్భాలున్నాయి. అయితే కెరీర్లో ఎంత సక్సెస్ అయినప్పటికీ హరికృష్ణ రెండో భార్య సంతానమనే కారణంతో నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ను ముందునుంచి కాస్త దూరం పెడుతూనే వచ్చింది.
కానీ ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ ను దగ్గరకు తీసుకుంది. అందుకే 2009 ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి ఎంతోమంది జనాన్ని ఆకట్టుకున్నాడు. ప్రచారం టైమ్ లో ఎన్టీఆర్ స్పీచులు విని ఆశ్చర్యపోని వాళ్లు లేరంటే అతిశయోక్తి లేదు. తాత స్వర్గీయ నందమూరి తారక రామారావును తలపించేలా 25 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ బహిరంగంగా స్పీచులు చెప్పడం అందరినీ అబ్బురపరిచాయి. ప్రచారం చేసి తిరిగి వస్తుండగా ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ అవడంతో తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్ దాన్నుంచి కోలుకోవడానికి చాలానే టైమ్ పట్టింది.
ఆ తర్వాత 2010లో అదుర్స్ అనే సినిమాతో తనలోని కామెడీ యాంగిల్ ను బయటపెట్టి ఆ సినిమాతో ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించాడు. అచ్చు బ్రాహ్మణుడిలా కనిపించి, ఆ పంచెకట్టు, ఆ వేషధారణ, భాష అన్నింటిలోనూ ఎంతో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఇప్పటికీ టాలీవుడ్ లోని టాప్ 10 కామెడీ సినిమాల్లో అదుర్స్ సినిమా కచ్ఛితంగా ఒకటిగా నిలుస్తుందంటే దానికి కారణం అందులో ఎన్టీఆర్ నటించిన విధానమే.
మధ్యలో కొన్ని వరుస ఫ్లాపులు వచ్చినప్పటికీ నటుడిగా మాత్రం ఎన్టీఆర్ ఎప్పుడూ ఓడిపోయింది లేదు. కానీ టెంపర్ సినిమా తర్వాత నుంచి మాత్రం ఎన్టీఆర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. టెంపర్ తర్వాత నుంచి ఎన్టీఆర్ తన స్క్రిప్ట్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ వరుస హిట్లు అందుకుంటూ వెళ్తున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో తన క్రేజ్ ను, మార్కెట్ ను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు.
అప్పటివరకు దేశానికే పరిచయమైన ఎన్టీఆర్ యాక్టింగ్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందింది. ఎన్టీఆర్ కు జపాన్ లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే జపాన్ కు కూడా వెళ్లి తన సినిమాను ప్రమోట్ చేసి వస్తుంటాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో తిరుగులేని మార్కెట్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు వార్2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నువ్వా నేనా అంటూ పోటీ పడి నటించనున్నాడు.
ఎన్టీఆర్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి దేవర సినిమా చాలు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర ఓ నార్మల్ సబ్జెక్ట్. ఎన్టీఆర్ కాకుండా వేరే ఏ హీరో చేసినా ఆ సినిమా వర్కవుట్ అయేది కాదనేది వాస్తవం. దేవరకు ఫస్ట్ షో నుంచే మిక్డ్స్ రివ్యూలు వచ్చాయి. అయినా ఎన్టీఆర్ తన స్టామినాతో ఆ సినిమాతో రూ.500 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేశాడంటే తారక్ రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న ఎన్టీఆర్ కు ఇవాల్టితో 42 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు తుపాకి.కామ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.