100 పేద కుటుంబాలకు ఈ హీరో దేవుడు
అన్నార్తులకు అన్నం పెట్టే మనసు ఉండాలే కానీ పేదరికం కూడా దీనికి అడ్డు కాదు. తనకు ఉన్నదాంట్లోనే పది మందికి సాయం చేసే గుణం చాలా ముఖ్యం.;
అన్నార్తులకు అన్నం పెట్టే మనసు ఉండాలే కానీ పేదరికం కూడా దీనికి అడ్డు కాదు. తనకు ఉన్నదాంట్లోనే పది మందికి సాయం చేసే గుణం చాలా ముఖ్యం. కనీస తిండికి లేని దుస్థితిలో కష్టాల్ని ఎదుర్కొంటున్నా నిరుపేదగా జీవితాన్ని ఈడ్చిన ఒక సాధారణ నటుడు ఈరోజు 100 పేద కుటుంబాల్ని పోషిస్తున్నాడు. వీధుల్లో భిక్షగాళ్ల పాలిట దేవుడు అయ్యాడు. అతడు సినిమాల్లో నటించి పెద్ద స్టార్ అయ్యాడు. విలన్‌గా, సహాయ నటుడిగా, హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో ఉన్నాడు. బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ పరిశ్రమ ఏదైనా అన్ని చోట్లా అతడికి స్నేహితులు ఉన్నారు. అతడి ఒదిగి ఉండే స్వభావం, స్నేహ స్వభావానికి ఎలాంటి వారైనా ఆకర్షితులవుతారు.
ఇప్పుడు అతడు పూట గడవని 100 కుటుంబాల్ని పోషిస్తున్నాడు. వీధుల్లో యాచకులందరికీ అతడి ఫోన్ నంబర్ తెలుసు. తమకు అన్నం కావాలంటే అతడికి ఫోన్ చేసి అడుగుతారు. ఈరోజు గొప్ప స్థాయికి ఎదిగాక కూడా అతడు మారలేదు. తనకు లేని రోజుల్లోనే సేవామార్గాన్ని విడువలేదు. ఇప్పటికీ దానిని కొనసాగిస్తున్నాడు. నటుడిగా వచ్చే సంపాదనలో అతడు సగం డబ్బును ఇలా దానధర్మాలు, సేవామార్గంలో ఖర్చు చేస్తున్నాడు. అయితే తాను చేసే సహాయాన్ని బయటికి చెప్పుకునేందుకు ఇష్టపడని ఈ నటుడి సేవా గుణం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఇంతకీ ఎవరు ఈ ప్రముఖ నటుడు? అంటే.. జాకీ ష్రాఫ్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ప్రముఖ స్టార్లకు అత్యంత సన్నిహిత మిత్రుడు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్, వెంకటేష్, సుహాసిని, సుమలత ఇలా ఎయిటీన్ క్లాస్ స్టార్లందరికీ ఆప్తుడు. అతడు ముంబై టు హైదరాబాద్ తన స్నేహాలను ఏనాడూ విడిచి పెట్టలేదు.
జాకీ ష్రాఫ్ చాలా సంవత్సరాలుగా కనీస మాత్రంగా 100 నిరుపేద కుటుంబాలను పోషిస్తున్నాడు. వీధిలో ఉన్న ప్రతి బిచ్చగాడి దగ్గర అతడి ఫోన్ నంబర్ ఉంటుంది. ముంబైలో పేదలకు రోజూ ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నాడు. అతడి దయాగుణం అతడిని దేవుడిగా మలిచింది. పేదరికంలో, డబ్బుల్లేని స్థితిలో జీవించిన ఈ స్టార్ కి ఆకలి కష్టం ఏంటో తెలుసు. అందుకే సేవామార్గాన్ని ఏనాడూ విడువలేదు. జాకీ ష్రాఫ్ తనకు ఏమీ లేని కాలం నుండి పేదలకు సహాయం చేస్తూ, వారికి ఆహారం పెడుతున్నాడు. కానీ దీని గురించి ఏనాడూ ప్రచారం చేసుకోడు.