గ్లామర్ రంగంలో మతతత్వ రగడ దేనికి సంకేతం?
నిజానికి బాలీవుడ్ లో మతతత్వ ధోరణుల గురించి రెహమాన్ లాంటి దిగ్గజం సంచలన వ్యాఖ్యలు చేసాక గొడవ ముదిరిపాకాన పడింది.;
ప్రజాస్వామ్య దేశంలో కులమతాల పిచ్చి గురించి ఎంత చెప్పినా తక్కువే. భిన్నత్వంలో ఏకత్వం అవసరమని భారతీయ రాజ్యాంగం భావించింది. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు పరిణామాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీపరిశ్రమలో కులమతాల పిచ్చి, వర్గపోరాటాల గురించి ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంటుంది. ఒక రకంగా ఉన్నత విద్యావంతులు కూడా దీనికి అతీతులు కాదని నిరూపణ అవుతోంది.
కొన్నేళ్లుగా బాలీవుడ్ లో ఖాన్‌ల త్రయానికి వ్యతిరేకంగా ఒక వర్గం లేదా మతతత్వ వాదుల ఎటాక్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఖాన్ అనే పేరు చాలా ఆటంకాలకు కారణమైందని ఆ ముగ్గురూ ఆరోపించిన సందర్భాలున్నాయి. అమీర్ ఖాన్ `మహాభారతం` లాంటి హిందూ పురాణేతిహాసాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించి మిడిల్ డ్రాప్ అవ్వడం ఎనక థియరీలను ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. మహాభారతం ప్రాజెక్ట్ ని ఖాన్ నిలిపి వేయడం వెనక ఇలాంటి కారణాలు ఉన్నాయని కథనాలొచ్చాయి. దీపిక పదుకొనే నటించిన పద్మావత్ షూటింగ్ సమయంలో రాజ్ పుత్ లను సినిమాలో తక్కువ చేసి చూపిస్తున్నారని సెట్లలో కొన్ని హిందూ మూకలు దాడులకు పాల్పడటం కూడా సంచలనం అయింది.
ఇదిలా ఉంటే ఇటీవల స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ వర్సెస్ కంగనా రనౌత్ ఎపిసోడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారింది. ఆ ఇద్దరి మధ్యా కొత్త మాటల యుద్ధం చర్చగా మారింది. ఆ ఇద్దరి మధ్యా వార్ లోకి ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా చేరారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను ఉద్దేశించి కంగనా చేసిన వ్యాఖ్యలపై విలక్షణ నటుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కంగన ఒంటెద్దు పోకడను విమర్శిస్తూ ప్రకాష్ రాజ్ తీవ్రంగా ప్రతిదాడి చేసారు.
అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? అన్నది వెతికితే, ఇటీవల ఏఆర్ రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. హిందీ చిత్ర పరిశ్రమలో మతతత్వ ధోరణులు పెరిగాయని, అందుకే తనకు పరిశ్రమలో అవకాశాలు తగ్గాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే `ఛావా` సినిమా సంఘంలో మనుషులను విభజించేదిగా, తరతమ భేధాల్ని పెంచేదిగా ఉందని కూడా రెహహాన్ వ్యాఖ్యానించడం హాట్ టాపిగ్గా మారింది.
అయితే ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ వివాదాస్పద క్వీన్ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. దాని ప్రకారం.. రెహమాన్ కంటే ఎక్కువ పక్షపాతం, ద్వేషం ఉన్న వ్యక్తిని తాను చూడలేదని అన్నారు. తన సినిమా ఎమర్జెన్సీకి సంగీతం అందించాలని కోరగా, కనీసం తనను కలిసేందుకు కూడా నిరాకరించాడని, అది ప్రొపగండా సినిమా అని దూరం పెట్టాడని కూడా కంగన ఆరోపించారు. అంతేకాదు రెహమాన్ భారతదేశ వ్యతిరేకి అని కూడా తీవ్రంగా విమర్శించారు.
అయితే కంగన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఇప్పుడు కౌంటర్ వేసారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (6 ఫిబ్రవరి 2026)లో ప్రసంగించిన ప్రకాష్ రాజ్ కంగనాపై ఒక రేంజులో విరుచుకుపడ్డారు. ఏ.ఆర్.రెహమాన్‌పై కంగన మొరుగుడు (బార్కింగ్) మొదలైందని ఘాటైన పదజాలంతో విమర్శించారు. స్వరమాంత్రికుడు రెహమాన్ మా తుజే సలామ్, జై హో వంటి పాటలు ఇచ్చి రెండు ఆస్కార్లు తెచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన తన మనసులో ఉన్న నిజం చెబితే దేశ వ్యతిరేకి అనే ముద్ర వేస్తారా? అని ప్రశ్నించారు. కేవలం తన సినిమాకు పని చేయలేదన్న కోపంతో ఒక గొప్ప కళాకారుడిని తక్కువ చేయడం సరికాదని, కంగనా తన `ఎమర్జెన్సీ` సినిమాని క్లాసిక్ అనుకుంటోందని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు.
నిజానికి బాలీవుడ్ లో మతతత్వ ధోరణుల గురించి రెహమాన్ లాంటి దిగ్గజం సంచలన వ్యాఖ్యలు చేసాక గొడవ ముదిరిపాకాన పడింది. కానీ అప్పటికే ఈ ధోరణులు పరిశ్రమలో ఉన్న మాట వాస్తవం. అవి అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తున్నాయి. ఇటీవల వివాదం ముదురుతుండటంతో ఏఆర్ రెహమాన్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదని.. సంగీతం ద్వారా ప్రజలను ఏకం చేయడమే తన లక్ష్యమని.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
ప్రకాష్ రాజ్ - కంగనా మధ్య ఇలాంటి వివాదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ రాజకీయ, సామాజిక అంశాలపై వీరిద్దరూ సోషల్ మీడియాలో తలపడ్డారు. ఒకరినొకరు దూషించుకున్నారు.