కంటెంట్ తో పని లేకుండా కలెక్షన్స్
ముఖ్యంగా విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ సినిమాకు ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది.
ఏదైనా సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధిస్తే అందులో కథ లేదా మేకింగ్ బాగుందని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా చుట్టూ ఉన్న పరిస్థితులు, రిలీజ్ టైమ్ కలిసిరావడం వల్ల కూడా వసూళ్లు భారీగా వస్తుంటాయి. ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తగ్గకపోవడం వెనుక కొన్ని ప్రత్యేకమైన కారణాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం తమిళనాడులో వేరే పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో ఏవీ లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఆడియన్స్ కు థియేటర్ కి వెళ్తే వేరే ఆప్షన్స్ లేవు. దాంతో సోలోగా వచ్చిన ఈ సినిమాకు స్క్రీన్స్ అన్నీ దక్కాయి. దీనికి తోడు విజయ్ కి ఇదే చివరి సినిమా కావడం, ఇకపై ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుండటం కూడా కలెక్షన్లకు బాగా కలిసొచ్చింది.
ముఖ్యంగా విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ సినిమాకు ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఒక పక్క రాష్ట్రానికి సీఎంగా ఉంటూనే ఆయన నటించిన చివరి చిత్రం థియేటర్లలోకి రావడంతో ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న స్టార్ హీరో స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాడో చూడాలనే క్యూరియాసిటీ జనాలను థియేటర్ల వైపు నడిపిస్తోంది.
ఇలాంటి కొన్ని అంశాలు అనుకూలంగా మారడం వల్లే ఫస్ట్ వీక్ లో కలెక్షన్స్ ఈ రేంజ్ లో వచ్చాయని చెప్పవచ్చు. సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా, ఈ రిలీజ్ టైమింగ్స్, కాంపిటీషన్ లేకపోవడం కలగలిపి కలెక్షన్ల గ్రాఫ్ పడిపోకుండా కాపాడాయి. ఇలాంటి ప్లస్ పాయింట్స్ అన్నీ ఒకేసారి సెట్ అవ్వడం వల్ల టాక్ తో పనిలేకుండా బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లిక్ అయిపోయింది.
మరోవైపు విజయ్ రెమ్యునరేషన్ గురించి వస్తున్న వార్తలకు కూడా ఈ కలెక్షన్స్ ఒక క్లారిటీ ఇచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా కోసం ఆయన దాదాపు రెండు వందల కోట్ల పారితోషికం తీసుకున్నారనే టాక్ చాలా రోజులుగా నడుస్తోంది. ఒక హీరోకి అంత పెద్ద అమౌంట్ ఇవ్వడం రిస్క్ అని చాలామంది అనుకున్నారు. కానీ సినిమా కథ మీద నెగిటివిటీ ఉన్నా కూడా, కేవలం ఆయన క్రేజ్ తోనే ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం చూస్తుంటే ఆ గాసిప్స్ లో నిజం ఉందేమో అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందనేది పక్కన పెడితే, ప్రస్తుతానికి మాత్రం తమిళ ఇండస్ట్రీలో విజయ్ స్టార్ డమ్ కి ఉన్న పవర్ ఏంటో ఈ వసూళ్లు క్లియర్ గా చూపిస్తున్నాయి.