క్లీన్ స్టూడియో, క్లీన్ మైండ్… తమన్ డిసిప్లిన్ స్టోరీ
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వర్క్‌స్పేస్‌ను చూస్తే, అది కేవలం ఒక రికార్డింగ్ స్టూడియో కాదనే విషయం స్పష్టమవుతుంది.
సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా టాలెంట్, టెక్నాలజీ, హిట్ సాంగ్స్ గురించే డిస్కషన్ జరుగుతుంది. కానీ ఒక మంచి మ్యూజిక్ ను క్రియేట్ చేసే వాతావరణం గురించి మాత్రం చాలా తక్కువగా మాట్లాడుతారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వర్క్‌స్పేస్‌ను చూస్తే, అది కేవలం ఒక రికార్డింగ్ స్టూడియో కాదనే విషయం స్పష్టమవుతుంది. ఆయన దృష్టిలో అది ఒక క్రియేటివ్ టెంపుల్. ఫోకస్, క్రమశిక్షణ, ప్రశాంతత కలిసి వర్క్ చేసే ప్లేస్.
తమన్ స్టూడియోలో ప్రతి ఫ్లోర్‌కు ప్రత్యేకమైన పేరు ఉండటం కూడా ఒక క్రియేటివ్ ఆలోచనే. వైబ్, జామ్ లాంటి పేర్లను కేవలం డిజైన్ కోసమే పెట్టడం కాకుండా, ప్రతీ ఫ్లోర్‌కు ఒక డిఫరెంట్ మూడ్, ఒక స్పెషల్ ఎనర్జీ, సరికొత్త క్రియేటివ్ ఐడెంటిటీ ఉండాలనే ఆలోచనకు ప్రతీకల్లా కనిపిస్తాయి. తమన్ స్టూడియో చూస్తే పని చేసే వాతావరణం కూడా మ్యూజిక్ క్రియేషన్ లో భాగమే అనే భావన కలుగుతుంది.
అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ విషయం మరోటి ఉంది. ఆ స్టూడియోలో ఆల్కహాల్‌కు, సిగరెట్‌కు అసలు ఎంట్రీ ఉండదు. స్మోకింగ్ చేయాలనుకునే వారు కచ్ఛితంగా బయటకు వెళ్లాల్సిందేనట. ఈ విషయంలో తానసలు రాజీ పడనని తమన్ స్వయంగా చెప్పడం విశేషం. చాలామంది హిట్ సాంగ్స్ వెనుక ఏదో స్పెషల్ మూడ్ ఉంటుందని అనుకుంటారు. కానీ తమన్ దృష్టిలో ఆ మూడ్ అనేది మందు, సిగిరెట్ లాంటి అలవాట్ల వల్ల రాదని, మంచి మ్యూజిక్ ను క్రియేట్ చేసిన క్షణంలో వచ్చే ఆనందమే అసలైన హై అని అంటున్నారు. క్రియేటివిటీకి ఎలాంటి మత్తు అవసరం లేదని తమన్ కామెంట్స్ సూచిస్తున్నాయి.
క్లీన్ ఎన్విరాన్‌మెంట్, క్లీన్ మైండ్, క్లీన్ క్రియేటివిటీ అనే భావన నేటి క్రియేటివ్ ప్రొఫెషనల్స్‌కు కూడా వర్తిస్తుంది. చుట్టూ ఉండే వాతావరణం మన ఆలోచనలపై ప్రభావం చూపుతుందని సైకాలజిస్టులు కూడా చెబుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక స్టూడియోను పూర్తిగా శుభ్రంగా, ప్రశాంతంగా, డిస్ట్రాక్షన్స్ లేకుండా మెయిన్‌టెయిన్ చేయడం ఒక వర్క్ కల్చర్ స్టేట్‌మెంట్‌గా మారుతుంది.
ఒక మంచి బీజీఎం లేదా పాట కోసం గంటల తరబడి పనిచేసే టీమ్‌కు అవసరమైనది స్వేచ్ఛ మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా అని తమన తన మాటల ద్వారా చెప్తున్నారు. అందుకే తమన్ స్టూడియోను చూస్తే, అది ఒక మ్యూజిక్ స్టూడియోగానే కాకుండా, డిసిప్లిన్‌తో క్రియేటివిటీని కాపాడే వర్క్‌స్పేస్ అనే భావన బలంగా కనిపిస్తుంది. టాలీవుడ్‌లో తమన్ స్టూడియో ఒక స్పెషల్ వర్క్ కల్చర్ కు ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.