మూవీ రివ్యూ : శ్రీనివాస మంగాపురం
తెలుగు సినీ రంగంలోకి మరో వారసుడు అడుగుపెట్టాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. రమేష్ బాబు తనయుడైన ఆ కుర్రాడే జైకృష్ణ ఘట్టమనేని.
‘శ్రీనివాస మంగాపురం’ మూవీ రివ్యూ
నటీనటులు: ఘట్టమనేని జైకృష్ణ- రాషా తడాని- మోహన్ బాబు- కిక్ శ్యామ్- వాసుకి- అజయ్- మహేంద్రన్- శ్రీతేజ్- నరేష్- బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి
నిర్మాత: పి.కిరణ్
రచన-దర్శకత్వం: అజయ్ భూపతి
తెలుగు సినీ రంగంలోకి మరో వారసుడు అడుగుపెట్టాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. రమేష్ బాబు తనయుడైన ఆ కుర్రాడే జైకృష్ణ ఘట్టమనేని. ‘ఆర్ఎక్స్’.. ‘మంగళవారం’ చిత్రాలతో మెప్పించిన యువ దర్శకుడు అజయ్ భూపతి.. జైకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం.. శ్రీనివాస మంగాపురం. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా జైకృష్ణకు కోరుకున్న విజయాన్నిచ్చేలా ఉందా? తెలుసుకుందాం పదండి.
కథ:
శ్రీను (జైకృష్ణ) కొత్తగా తిరుపతిలో అడుగు పెట్టిన కుర్రాడు. అతను సిటీలో ఉన్న చాలా పెద్ద వ్యక్తుల్లో ఒకడైన పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) కూతురైన మంగ (రషా తడాని)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అదే పనిగా తన వెంట పడుతున్న శ్రీనును మంగ మొదట పట్టించుకోదు. తర్వాత అతను చేసిన ఒక సాయం వల్ల ఫ్రెండుగా అంగీకరిస్తుంది. తర్వాత మంగకు శ్రీను ప్రపోజ్ చేయగా.. ఆమె తిరస్కరిస్తుంది. తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అవడంతో.. ఆ వివాహమే చేసుకోవాలనుకుంటుంది. కానీ శ్రీను.. పట్టువదలడు. అసలు అతను తిరుపతికి వచ్చిందే మంగకోసమని తెలుస్తుంది. ఇంతకీ శ్రీను ఎవరు.. తన కథేంటి.. మంగతో తనకున్న కనెక్షన్ ఏంటి.. అతను కోరుకున్నట్లుగా మంగను దక్కించుకున్నాడా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
చాలామంది దర్శకులు మొదట్లో బలమైన ముద్ర వేసి.. ఒక దశ దాటాక గాడి తప్పుతుంటారు. ఆ గాడి తప్పడానికి ముందు వరకు హిట్టు సినిమా తీసినా, ఫ్లాప్ తీసినా.. ఒక ముద్ర ఉంటుంది. ఐతే ‘ఆర్ఎక్స్ 100’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి మాత్రం రెండో సినిమా ‘మహాసముద్రం’లో తన మార్కును కనీస స్థాయిలో కూడా చూపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో అతను వన్ ఫిల్మ్ వండర్ అనుకున్నారంతా. కానీ మూడో చిత్రం ‘మంగళవారం’ చూశాక అజయ్ భూపతి మామూలోడు కాదనిపించింది. ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న కొత్త వారసుడు జైకృష్ణను ఇలాంటి దర్శకుడి చేతిలో పెట్టారంటే తన అరంగేట్రం అదిరిపోతుందని అనుకున్నారంతా. కానీ ఈ కలయికలో వచ్చిన ‘శ్రీనివాస మంగాపురం’ ప్రోమోలు చూస్తే ఏ ప్రత్యేకతా కనిపించలేదు. ఐతే అజయ్ నేరుగా వెండితెర మీదే మెరుపులు మెరిపిస్తాడేమో అని ఆశిస్తే.. ‘మహాసముద్రం’ తరహాలోనే ఏమాత్రం తన మార్కు లేని సినిమాను అందించాడీ దర్శకుడు. కొత్త హీరో చూపించిన స్పార్కును అజయ్ భూపతి చూపించకపోవడంతో ‘శ్రీనివాస మంగాపురం’ సాధారణ చిత్రంగా మిగిలిపోయింది.
మహేష్ బాబు ‘శ్రీనివాస మంగాపురం’ చూసి ఆరు లవ్ ఎమోజీలు పంపాడంటూ గర్వంగా చెప్పుకున్నాడు అజయ్ భూపతి. నిజంగా ఈ సినిమా మహేష్ బాబుకు నచ్చి ఉంటే ఆయన టేస్టును సందేహించాల్సి ఉంటుంది. విడుదలకు సిద్ధమైన సినిమా విషయంలో ఏమీ చేయలేక మొహమాటంతోనే మహేష్ ఆ ప్రేమను చూపించి ఉండాలి. ఎందుకంటే రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో ఎక్కడా రవ్వంత కొత్తదనం లేదు. ఏమాత్రం ఎమోషన్ వర్కవుట్ కాలేదు. భలే ఉందే అనిపించిన సన్నివేశం ఇందులో ఒక్కటీ లేదు. ఏ పాత్రా ఆకట్టుకోలేదు. అసలు క్యారెక్టర్ రోల్స్ చేయడమే మానేసిన మోహన్ బాబు లేక లేక ఈ సినిమా చేశాడంటే.. ఆయన చేసిన వెంకటప్ప నాయుడు క్యారెక్టర్లో అయినా ఏదైనా విశేషం ఉంటుందేమో అని ఆశిస్తే.. అదీ తీవ్రంగా నిరాశపరుస్తుంది. విపరీతమైన బిల్డప్ తో మోహన్ బాబును పరిచయం చేసిన తొలి సన్నివేశమే తేలిపోయాక ఈ సినిమాలో ఏదీ వర్కవుట్ అయ్యేలా లేదని అర్థమైపోతుంది. ఇక జైకృష్ణ-రాషా తడానిల కెమిస్ట్రీ కూడా పండకపోవడం.. వారి మధ్య ప్రేమకథ టెంప్లేట్ లవ్ స్టోరీలనే తలపించడంతో ‘శ్రీనివాస మంగాపురం’ ఎక్కడా నెక్స్ట్ గేర్లోకి వెళ్లలేకపోయింది. ఇటు ప్రేమకథా పండక.. అటు యాక్షన్ ఘట్టాలూ ఇంపాక్ట్ వేయక ఈ సినిమా ప్రేక్షకులను నీరసించిపోయేలా చేస్తుంది.
‘శ్రీనివాస మంగాపురం’ స్టోరీ లైన్ కొత్తది కాదు కానీ.. కొంచెం ఆసక్తి రేకెత్తించేదే. ‘హాయ్ నాన్న’ను గుర్తుకు చేసే మూల కథకు సరైన స్క్రీన్ ప్లే తోడై ఉంటే ఇంట్రెస్టింగ్ గా ఉండేదే. ఆర్ఎక్స్ 100.. మంగళవారం చిత్రాల్లో కథనం.. టేకింగ్ పరంగా మెరుపులు మెరిపించిన అజయ్ భూపతి.. ఇక్కడా ఆ స్టైల్లో కథను చెప్పే ప్రయత్నం చేసి ఉంటే.. ‘శ్రీనివాస మంగాపురం’ స్పెషల్ ఫిలిమే అయ్యుండేది. కానీ అతను చాలా మామూలుగా సినిమాను నడిపించేశాడు. ఆరంభ సన్నివేశాలతోనే రొటీన్ ఫీల్ తీసుకొచ్చే ఈ సినిమా.. ఏదో ఒక దశలో పుంజుకుంటుందని ఆశిస్తాం. సగం సినిమా వరకు కథలో ఏ కదలికా లేక.. రొటీన్ పాటలు-ఫైట్లతో విసుగు పుడుతుంది. అప్పటిదాకా కథ పెద్దగా రివీల్ కాకపోవడం.. మోహన్ బాబు కూడా రంగప్రవేశం చేయకపోవడంతో ద్వితీయార్ధం మీద ఆశలు కలుగుతాయి. కానీ మోహన్ బాబు పాత్ర వచ్చాక కూడా పెద్దగా కదలిక లేకపోవడం.. ఫ్లాష్ బ్యాక్ కూడా రొటీన్ గా సాగిపోవడంతో సినిమా గ్రాఫ్ పెరగదు. హీరో హీరోయిన్లు భారమైన డైలాగులు చెబుతుంటారు కానీ.. ఆ పాత్రలతో కనెక్ట్ కానపుడు వారి ప్రేమను ఎలా ఫీలవుతాం? ముఖ్యంగా హీరోయిన్ పాత్ర- అందులో నటించిన ఆర్టిస్టుతో కనెక్ట్ కాకపోతే ప్రేమకథ పండడం చాలా కష్టం. ‘శ్రీనివాస మంగాపురం’లో సరిగ్గా అదే జరిగింది. జైకృష్ణ తన పెర్ఫామెన్సుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా.. దర్శకుడు అజయ్ భూపతి మాత్రం కథాకథనాలతో అతడికి ఇవ్వాల్సిన పుష్ ఇవ్వలేకపోయాడు. జైకృష్ణ పెర్ఫామెన్స్.. కొన్ని మాస్-యాక్షన్ సీన్లు.. సంగీతం.. నిర్మాణ విలువలను మినహాయిస్తే ‘శ్రీనివాస మంగాపురం’లో విశేషాలేమీ లేవు.
నటీనటులు:
జైకృష్ణలో స్టార్ అవ్వగల లక్షణాలున్నాయి. కుర్రాడు ఒడ్డూ పొడవూ బాగున్నాడు. పెర్ఫామెన్స్ కూడా డీసెంటుగా సాగింది. నేరుగా స్టార్ అయిపోవాలని చూడకుండా.. బిల్డప్పుల్లేని సింపుల్ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. హీరోయిజం చూపించే సన్నివేశాల్లో రాణించాడు. ఎమోషనల్ సీన్లలో నటన ఓకే. హీరోయిన్ రాషా తడాని మాత్రం సినిమాకు మైనస్ అయింది. తెలుగింటి అమ్మాయి అనిపించేలా లేకపోవడం వల్ల తన పాత్ర పండలేదు. లుక్స్ పరంగా రాషా చాలా యావరేజ్ అనిపిస్తుంది. తన నటన కూడా గొప్పగా ఏమీ లేదు. జయకృష్ణతో ఆమెకు జోడీ కుదరలేదు. మోహన్ బాబు నటన బాలేదు అనడానికి లేదు కానీ.. ఆయన్ని దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. గెటప్ బాగున్నా.. పాత్రలో బలం లేకపోవడంతో మోహన్ బాబు సినిమాకు బలం కాలేకపోయారు. వాసుకి కీలక పాత్రలో రాణించింది. నరేష్ పాత్ర మొదట్లో గమ్మత్తుగా అనిపిస్తుంది కానీ.. తర్వాత దాన్ని తేల్చి పడేశారు. కిక్ శ్యామ్.. అజయ్.. వడ్లమాని శ్రీనివాస్.. బ్రహ్మాజీ.. వీళ్లెవ్వరూ ప్రత్యేకతను చాటుకోలేకపోయారు.
సాంకేతిక వర్గం:
కొత్త హీరో సినిమాను మంచి క్వాలిటీతో తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. జి.వి.ప్రకాష్ కుమార్ పాటలు.. బీజీఎం బాగున్నాయి. అతను సినిమా కోసం మంచి ఎఫర్ట్ పెట్టాడు. జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ ఆద్యంతం బాగున్నాయి. కానీ అన్ని వనరులూ బాగానే సమకూరినా.. రైటర్ కమ్ డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. భిన్నంగా ఏదో ప్రయత్నిస్తాడు.. సర్ప్రైజ్ చేస్తాడు అని తన మీద అంచనాలు పెట్టుకునే ప్రేక్షకులను అతను తీవ్ర నిరాశకు గురి చేశాడు. కొత్త హీరోతో తన స్టయిల్లో ట్రెండీ సినిమా తీస్తాడని ఆశిస్తే.. తనకున్న ఇమేజ్ కు భిన్నంగా అతను రొటీన్ సినిమా తీశాడు. స్క్రిప్టులో కానీ.. టేకింగ్ లో కానీ అతను ఎక్కడా తన ప్రత్యేకతను చాటుకోలేకపోయాడు.
చివరగా: శ్రీనివాస మంగాపురం.. రొటీన్ లవ్ స్టోరీ
రేటింగ్- 2.25/5