కే-పాప్ స్టార్ యాడ్‌పై రేసిజమ్ వివాదం!

ప్రముఖ ఫుట్‌వేర్ బ్రాండ్ కన్వర్స్ నూత‌న ప్రకటనలో వర్ణవివక్షను ప్రోత్సహించే అంశాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో బహిరంగంగా క్షమాపణలు తెలియజేసింది.

Update: 2026-09-21 07:17 GMT

ప్రముఖ ఫుట్‌వేర్ బ్రాండ్ కన్వర్స్ నూత‌న ప్రకటనలో వర్ణవివక్షను ప్రోత్సహించే అంశాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో బహిరంగంగా క్షమాపణలు తెలియజేసింది. కే-పాప్ స్టార్ కరీనా నటించిన ఇన్స్టాగ్రామ్ ప్రకటనపై నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ప్రకటనను అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి సంస్థ తక్షణమే తొలగించింది. వివాదానికి కారణమైన ఇన్స్టాగ్రామ్ ఫోటోలో కరీనా స్కర్ట్ ధరించి చేతిలో చక్ 70 ఎక్స్ స్పీకర్లను పట్టుకుని కనిపించారు. అయితే ఆ ఫోటోలో పడిన కాంతి వల్ల ఆమె స్కర్ట్‌పై ఏర్పడిన తెల్లటి త్రిభుజాకారపు నీడ వర్ణ వివక్ష పూరిత కూ క్లక్స్ క్లాన్ టోపీని పోలి ఉందనే విమర్శలు వెల్లు వెత్తాయి.

అలాగే క‌రీనా స్నీకర్లను పట్టుకున్న తీరు, లించింగ్‌కు గురైన బాధితుల వేలాడే కాళ్లను గుర్తుచేసేలా ఉందంటూ పలువురు నెటిజన్లు, సామాజిక వేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో నైకీ అనుబంధ సంస్థ అయిన కన్వర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. `మేము క్షమాపణలు కోరుతున్నాం. ఈ చిత్రం ఎందుకు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందో అర్థం చేసుకోగలము. మేము చేసింది పొరపాటని అంగీకరిస్తున్నాం. ఈ ప్రకటనను అన్ని వేదికల నుంచి తొలగించాం. ఇలా జరగాల్సింది కాదు. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాము` అని సంస్థ స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో ఫోటో వైరల్ కావడంతో కన్వర్స్ ఉత్పత్తులను బహిష్కరించాలని నెటిజన్లు పిలుపునిచ్చారు. మార్కెటింగ్, లీగల్ టీమ్‌ల పర్యవేక్షణ దాటి ఇలాంటి ప్రకటన ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించిన పౌర హక్కుల లాయర్ లీ మెరిట్ ప్రకటన విడుదలయ్యాక క్షమాపణ చెప్పడం సరికాదని విమర్శించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని కొందరు కన్వర్స్ సంస్థకు మద్దతుగా నిలిచారు.

ఫ్యాషన్ , రీటైల్ రంగానికి చెందిన ప్రముఖ బ్రాండ్లు జాతి, వర్ణ వివక్ష అంశాలలో విమర్శలు ఎదుర్కొని క్షమాపణలు చెప్పడం మొదటిసారి కాదు. గత నెలలోనే రీటైలర్ టార్గెట్ కూడా వర్ణవివక్ష రూపాలను పోలి ఉందనే విమర్శలొచ్చాయి. పిల్లల హ్యాలొవీన్ కాస్ట్యూమ్‌ను విక్రయాల నుంచి ఉపసంహరించుకుంది. ప్రచార చిత్రాల రూపకల్పనలో కార్పొరేట్ సంస్థల నిర్లక్ష్యానికి వరుస ఘటనలు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. 1908లో అమెరికాలోని మెసాచుసెట్స్‌లో స్థాపించబడిన కన్వర్స్ సంస్థ 1917లో బాస్కెట్‌బాల్ క్రీడాకారుల కోసం పరిచయం చేసిన `చక్ టేలర్ ఆల్ స్టార్` స్నీకర్లతో ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందింది. దశాబ్దాల చరిత్ర కలిగిన బ్రాండ్ ప్రకటన విషయంలో ఎదురైన వివాదం నుంచి బయటపడేందుకు చర్యలు చేపడుతోంది.

Tags:    

Similar News