భారతదేశంలో అత్యంత చర్చనీయాంశమైన హిట్ అండ్ రన్ కేసులు
మలయాళ వెటరన్ నటుడు మణియన్ పిళ్లై రాజు ఫిబ్రవరి 5 రాత్రి తిరువనంతపురంలో జరిగిన `హిట్ అండ్ రన్` కేసులో అరెస్ట్ అయ్యారు.;
మలయాళ వెటరన్ నటుడు మణియన్ పిళ్లై రాజు ఫిబ్రవరి 5 రాత్రి తిరువనంతపురంలో జరిగిన `హిట్ అండ్ రన్` కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక బైక్‌ను ఢీకొనగా, ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆపకుండా వెళ్ళిపోవడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. భారతదేశంలో సెలబ్రిటీలు `హిట్ అండ్ రన్` కేసుల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిగిన కొన్ని సంచలన కేసుల వివరాలు పరిశీలిస్తే...
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించంది. ఈ కేసు భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్ అండ్ రన్ కేసుగా రికార్డులకెక్కింది. 28 సెప్టెంబర్ 2002 రాత్రి ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూజర్ కారు ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో సల్మాన్ తాగి డ్రైవ్ చేస్తున్నాడని ఆయన బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ సాక్ష్యం ఇచ్చారు. అయితే 13 ఏళ్ల తర్వాత సల్మాన్ డ్రైవర్ అశోక్ సింగ్ తానే కారు నడిపానని కోర్టులో చెప్పారు. 2015లో సెషన్స్ కోర్టు 5 ఏళ్ల శిక్ష విధించినా.. అదే ఏడాది బాంబే హైకోర్టు సాక్ష్యాలు సరిగ్గా లేవని ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసింది.
టాలీవుడ్ లోను..
తెలుగు సినీపరిశ్రమలోను కొందరు నటులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పాపులర్ మాస్ హీరో సోదరుడి పేరు అప్పట్లో వినిపించింది. 2017లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించకముందు గతంలో అతివేగంగా డ్రైవ్ చేసి ప్రమాదాలకు కారణమయ్యారనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. ఒక టాలీవుడ్ యువహీరో గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డారు. అయితే ఇది `హిట్ అండ్ రన్` కాకపోయినా, సెలబ్రిటీల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై చర్చకు దారితీసింది. కొందరు వర్ధమాన నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు రాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడటం, గొడవలకు దిగడం వంటి సంఘటనలపై వార్తలు వస్తూనే ఉన్నాయి.
తమిళ చిత్రసీమలోను..
కోలీవుడ్ లోను హిట్ అండ్ రన్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన సెలబ్రిటీ కేసులు ఉన్నాయి. 2000 సంవత్సరంలో చెన్నైలో నటుడు ఆనంద్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఒక పోలీస్ ఆఫీసర్‌ను ఢీకొన్నారు. ఆ అధికారి తర్వాత మరణించారు. ఈ కేసులో ఆనంద్ జైలు శిక్ష అనుభవించి, తర్వాత బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి సెటిల్ చేసుకున్నారు.
ఇతర పరిశ్రమల్లో...
కన్నడ, మలయాళ రంగాలలో పరిశీలిస్తే కన్నడ నటి దివ్య సురేష్ హిట్ అండ్ రన్ కేసులో నాడు బుక్కయ్యారు. అక్టోబర్ 2025లో బెంగళూరులో ఒక బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా వెళ్ళిపోయిన కేసులో ఈ నటి చిక్కుకున్నారు. ఫ్లైట్ అందుకోవాలనే కంగారులో ఆపలేదని ఆమె తర్వాత వివరణ ఇచ్చారు.
ఇప్పుడు మలయాళ నటుడు మణియన్ పిళ్లై రాజు హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయ్యారు. తాజా కేసులో ఈయన కారు నంబర్ ప్లేట్ ప్రమాద స్థలంలో పడిపోవడంతో పోలీసులు గుర్తుపట్టారు. తాను భయం వల్ల ఆపలేదని ఆయన అంగీకరించారు.
హిట్ అండ్ రన్ కేసుల్లో ఇరుక్కున్న ఇతర ప్రముఖుల వివరాలను పరిశీలిస్తే.. బాలీవుడ్ నటుడు దలీప్ తాహిల్ 2018లో తాగి డ్రైవ్ చేస్తూ ఒక ఆటోను ఢీకొట్టి పారిపోవడానికి ప్రయత్నించినందుకు 2 నెలల జైలు శిక్ష పడింది. సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన సంజీవ్ నందా స్టార్ కిడ్ కాకపోయినా అతడు బీఎండబ్ల్యూతో ఆరుగురిని తొక్కించి పారిపోయాడు. 1999లో ఈ కేసు సంచలనమైంది. అతడికి ఐదేళ్ల శిక్ష పడింది. మరో ప్రముఖుడి కొడుకు పునీత్ ఇస్సార్ కుమారుడు ముంబైలో రోడ్డు ప్రమాదానికి కారణమై పారిపోయారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
నిజానికి ఎవరూ మనుషులను గుద్ది పారిపోవాలని అనుకోరు. కొన్నిసార్లు పరిస్థితులు అలా క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించడం, ప్రమాదం జరిగిన తర్వాత జనం దాడి చేస్తారనే భయం కారణంగా పారిపోతుంటారు. అయితే చట్టం ఎవరినీ విడిచిపెట్టదు. సెలబ్రిటీలకు ఇది మినహాయింపు కాదు.