దిశా పటానీ ఇంటిపై గ్యాంగ్ స్టర్స్ కాల్పులు
ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ `రోమియో` షూటింగ్ లో పాల్గొంటోంది. ఇంతలోనే ఇప్పుడు దిశా పటానీ ఇంటిపై కాల్పుల కలకలం సంచలనంగా మారింది.;
దిశా పటానీ సుమారు దశాబ్ధం పాటు నటనా కెరీర్ ని పూర్తి చేసుకోబోతోంది. లోఫర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దిశా, హిందీ లో ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ, యోధ, రాధే- యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్, భారత్ లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవలే ప్రభాస్ సరసన `కల్కి 2898 AD` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ సూర్య సరసన కంగువ లాంటి భారీ చిత్రంలోను నటించింది.
ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ `రోమియో` షూటింగ్ లో పాల్గొంటోంది. ఇంతలోనే ఇప్పుడు దిశా పటానీ ఇంటిపై కాల్పుల కలకలం సంచలనంగా మారింది. యూపీ నగరం బరేలీలోని దిశా నివాసంపై కాల్పులకు గ్యాంగ్‌స్టర్లు బాధ్యత వహించడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. ఘటన అనంతరం గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటన సోషల్ మీడియాలో విడుదలైంది. ఈ దిగ్భ్రాంతికర ఘటన గురించి దిశా పటానీ ఇప్పటికీ స్పందించలేదు.
యూపీలోని బరేలీలో విల్లా నం.40 పై కాల్పులు జరిపామని దుండగులు అంగీకరించారు. ఆమె మన గౌరవనీయులైన సాధువులను ప్రేమానంద్ జీ మహారాజ్, అనిరుద్ధాచార్య జీ మహారాజ్ ని అవమానించింది అని కూడా నోట్ లో పేర్కొన్నారు. ఆమె మన సనాతన ధర్మాన్ని కించపరచడానికి ప్రయత్నించింది. మన దేవతలను అవమానించడాన్ని మేం సహించలేము. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇకపైనా ఎవరైనా మన మతంపై అగౌరవం చూపిస్తే, వారి ఇంట్లో ఎవరూ ప్రాణాలతో ఉండరు. ఈ సందేశం ఆమె కోసమే కాదు, సినీ పరిశ్రమలోని అందరు కళాకారులకు, వారితో సంబంధం ఉన్నవారికి కూడా. భవిష్యత్తులో మన మతం, సాధువులకు వ్యతిరేకంగా ఎవరైనా ఇలాంటి అవమానకరమైన చర్యకు పాల్పడితే దాని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి`` అని హెచ్చరించారు. మతాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడూ వెనక్కి తగ్గము. మతాన్ని సమాజాన్ని సంరక్షించడం ప్రథమ కర్తవ్యం అని కూడా లేఖలో రాసారు.
ఇటీవల బాలీవుడ్ ప్రముఖులపై ఊహించని దాడులతో పరిస్థితి అయోమయంగా మారింది. సెలబ్రిటీలకు ముంబై పోలీసులు కాపలా కాయలేక నానా హైరానా పడుతున్నారు. ఇంతకుముందు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ లు సల్మాన్ ఖాన్, కపిల్ శర్మ వంటి వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడంతో ముంబై పోలీసులు హైఅలెర్ట్ అయ్యారు. సిద్ధూ మూసేవాలా హత్య, సల్మాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖ్ హత్య సంచలనంగా మారాయి. పలువురు కమెడియన్లను మార్గం మళ్లించి కిడ్నాప్ చేసిన ఘటనలను కలకలం రేపాయి. ఇటీవల కపిల్ శర్మ కెనడా కేఫ్ పై గ్యాంగ్ స్టర్ల దాడులు సంచలనంగా మారాయి. ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ పై కాల్పుల ఘటన కంటి మీద కునుకుపట్టనీకుండా చేస్తోంది.