హిందీ స్టార్లకు నెక్ట్స్ లెవ‌ల్.. తెలుగు ట్యాలెంట్‌ కిక్కు!

తెలుగు సినిమా సత్తా ఇప్పుడు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. మన దర్శకుల మేధస్సు, మేకింగ్ స్టైల్ బాలీవుడ్ బడా స్టార్ల కెరీర్‌లను మలుపు తిప్పుతోంది.;

Update: 2026-03-06 03:57 GMT

తెలుగు సినిమా సత్తా ఇప్పుడు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. మన దర్శకుల మేధస్సు, మేకింగ్ స్టైల్ బాలీవుడ్ బడా స్టార్ల కెరీర్‌లను మలుపు తిప్పుతోంది. పొరుగు భాషల సూపర్ స్టార్లకు సైతం మన తెలుగు టాలెంట్ `నెక్స్ట్ లెవల్` చూపిస్తూ.. వారి భవితవ్యాన్ని మార్చేస్తోంది. ఒకప్పుడు సౌత్ సినిమాలను రీమేక్ చేసిన హిందీ పరిశ్రమ ఇప్పుడు ఏకంగా మన దర్శకుల కోసమే క్యూ కడుతోంది.

ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా సృష్టించిన `యానిమల్` ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ ఒక్క సినిమాతో రణబీర్ కపూర్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు చాక్లెట్ బాయ్‌గా ఉన్న రణబీర్‌ను ఒక వైల్డ్ స్టార్‌గా ఆవిష్కరించాడు సందీప్. కేవలం రణబీర్ మాత్రమే కాదు.. విలన్‌గా బాబీ డియోల్.. నేషనల్ క్రష్‌గా త్రిప్తి దిమ్రీ కెరీర్‌లకు ఈ సినిమా కొత్త ఊపిరి పోసింది. రణబీర్ మార్కెట్ ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్‌ను తాకే స్థాయికి చేరిందంటే అది మన తెలుగు దర్శకుడి మ్యాజిక్కే. అంత‌కుముందు క‌బీర్ సింగ్ చిత్రంతో షాహిద్ కపూర్ కెరీర్ గ్రాఫ్ ని సందీప్ వంగా అమాంతం మార్చేసిన సంగ‌తి తెలిసిందే.

ఓటీటీ రంగంలో కూడా తెలుగు టాలెంట్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ది గ్రేట్ రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె) ప‌క్కా తెలుగు కుర్రాళ్లు. తమ `ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్‌తో మనోజ్ బాజ్‌పాయ్ వంటి నటులకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రసాదించారు. బాలీవుడ్‌లో వెనకబడిపోయిన ఎందరో నటులకు వీరి సిరీస్‌లు కొత్త లైఫ్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈ ద్వయం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్ ని మార్చే డీల్ తో ముందుకు వెళుతున్నారు. స‌ల్మాన్ కోసం ఒక భారీ సూపర్ హీరో సినిమాను సిద్ధం చేస్తున్నారు. సల్మాన్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక నెక్స్ట్ లెవల్ స్టార్‌గా ఆవిష్కరించేందుకు వీరు చేస్తున్న ప్రయత్నం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ స‌ల్మాన్ కెరీర్ వేరు.. నెక్ట్స్ అత‌డి కెరీర్ వేరుగా మార‌బోతోంది.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఓజీ` (OG) సినిమాతో తెలుగు దర్శకుడు సుజీత్.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీని ఒక పవర్‌ఫుల్ విలన్‌గా పరిచయం చేశాడు. సౌత్ ఇండియన్ స్క్రీన్‌పై ఇమ్రాన్ హష్మీకి ఇది మంచి పేరు ఇచ్చింది. ఈ సినిమా కార‌ణంగా ఆయనకు దక్షిణాదిలో ప‌లు ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ లవర్ బాయ్‌గా ఉన్న ఇమ్రాన్.. ఇప్పుడు టాలెంటెడ్ విలన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళుతున్నాడు. బాలీవుడ్ క్రేజీ సినిమాల్లో న‌టిస్తూనే, ఇరుగు పొరుగు భాష‌ల‌పై ఇమ్రాన్ దృష్టి సారిస్తున్నాడు.

కేవలం వీరే కాదు.. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన RRR సినిమాతో అజయ్ దేవగన్, ఆలియా భట్ వంటి స్టార్లకు గ్లోబల్ రీచ్ ఇచ్చారు. అలాగే సుకుమార్ `పుష్ప` ఫ్రాంఛైజీతోనార్త్ ఇండియాలో అల్లు అర్జున్ క్రేజ్‌ను స్కై హైకి తీసుకెళ్లడమే కాకుండా.. అక్కడి ప్రేక్షకులకు తెలుగు మేకింగ్ పవర్ ఏంటో చూపించారు. వెంకీ అట్లూరీ వంటి యువ దర్శకులు కూడా ధనుష్ వంటి స్టార్లతో ద్విభాషా చిత్రాలు చేస్తూ పొరుగు స్టార్ల‌కు మంచి హిట్లివ్వ‌గ‌ల‌మ‌ని నిరూపించారు.

ప్రస్తుతం తెలుగు ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసిన ఇరుగు పొరుగు స్టార్ల కెరీర్ గ్రోత్ కి తిరుగే లేదు. తెలుగు దర్శకులతో పనిచేసిన తర్వాత వారి మార్కెట్ వాల్యూ పెరగడమే కాకుండా, నటన పరంగా కూడా వారికి వైవిధ్యమైన పాత్రలు లభిస్తున్నాయి. బాలీవుడ్ మేకర్స్ కూడా ఇప్పుడు మన డైరెక్టర్ల విజన్ కోసం.. వారి కథల కోసం వేచి చూస్తున్నారు. మొత్తానికి తెలుగు టాలెంట్ ఇప్పుడు భారతీయ సినిమాని దిశానిర్దేశం చేస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News