లోకేష్ కనగరాజ్‌ని అనిరుథ్ అలా అనేశాడేంటీ?
ఈ మధ్య డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.;
ఈ మధ్య డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు మెగా ఫోన్ పక్కన పెట్టి కెమెరా ముందు కొచ్చేసి మేకప్ వేసుకుని యాక్షన్ మోడ్‌లో కంటిన్యూ అవుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్స్ జీవి ప్రకాష్, విజయ్ ఆంటోనీ, హిప్ ఆప్ తమిళ వంటి వారు హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. మంచి మార్కెట్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తూ ఏడాదికి రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. విజయ్ ఆంటోనీ మాత్రం `బిచ్చగాడు` తరువాత తన రేంజ్ పెరగడంతో భారీ బడ్జెట్ మూవీస్ చేస్తూ కొత్త తరహా సినిమాలతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. ఇటీవల యంగ్ డైరెక్టర్స్ ప్రదీప్ రంగనాథన్, అభిషన్ జీవింత్ హీరోలుగ మారడం తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ `లవ్ టుడే` మూవీతో హీరోగా ప్రయాణం మొదలు పెట్టాడు. తొలి ప్రయత్నంలోనే వంద కోట్లు రాబట్టడంతో ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్లకు, యంగ్ డైరెక్టర్లకు హాట్ ఫేవరేట్ అయిపోయాడు.
రూ.25 కోట్లు ఇచ్చినా ప్రదీప్ డేట్స్ లభించని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రదీప్ డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం తనతో సినిమాలు చేయాలని స్టార్ ప్రొడ్యూసర్లు వెంటపడుతున్నారు. ఇటీవలే హీరోగా మారిన `టూరిస్ట్ ఫ్యామిలీ` ఫేమ్ అభిషన్ జీవింత్ `విత్ లవ్`తో ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. వీరి తరహాలోనే దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. `డీసీ` పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. వామిక గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. దేవదాస్ పార్వతీ చంద్రముఖి కాన్సెప్ట్‌తో ఎక్స్‌ట్రీమ్ వాయిలెన్స్ నేపథ్యంలో దీన్ని అరుణ్ మాథేశ్వరన్ రూపొందిస్తున్నాడు. సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకురానుంది. క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాలతో దర్శకుడిగా పాపులారిటీని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్ హీరోగా అదే తరహా సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు.
అయితే లోకేష్ కనగరాజ్‌పై మ్యూజిక్ సంచలనం అనిరుధ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తను డైరెక్ట్ చేసిన సినిమాకు మ్యూజిక్ చేస్తాను కానీ తను హీరోగా నటించిన సినిమాకు మ్యూజిక్ చేయమంటే చేయనని తేల్చి చెప్పాడు. అంతే కాకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందా? అంటే అలాంటి ఆలోచన తనకు అస్సలు లేదని, సంగీత ప్రపంచంలో తాను సాధించాల్సింది ఎంతో ఉందని, మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగడానికే అధిక ప్రధాన్యత ఇస్తానని క్లారిటీ ఇచ్చాడు.