నాకు సంబంధం లేదు.. రకుల్ ఫైర్
రకుల్ ప్రీత్ సింగ్‌పై గత కొన్ని రోజులుగా ఐటీ సోదాలకు సంబంధించిన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
రకుల్ ప్రీత్ సింగ్‌పై గత కొన్ని రోజులుగా ఐటీ సోదాలకు సంబంధించిన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ సెర్చ్‌లతో ఆమె పేరును కూడా కలిపి కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు వాటిపైనే రకుల్ స్పందించారు. “ఆ సెర్చ్ నాకు సంబంధించినది కాదు” అని క్లారిటీతో చెప్పారు. సోషల్ మీడియాలో తమను తాము రిపోర్టర్లుగా చెప్పుకునే వాళ్లు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు కూడా నిజాలు చెక్ చేయకుండా వార్తలను సంచలనంగా మార్చాయని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
తాను ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చానని, ఇండస్ట్రీలో తనకు ఎలాంటి గాడ్‌ఫాదర్ లేరని రకుల్ గుర్తు చేశారు. తన కెరీర్ మొత్తం కష్టంతోనే నిర్మించుకున్నానని చెప్పారు. 20 ఏళ్ల వయసు నుంచే పన్నులు చెల్లిస్తున్నానని, చట్టాన్ని పాటించే పౌరురాలిగా ఉన్నానని అన్నారు. ఇన్ని సంవత్సరాలుగా సంపాదించిన పేరును ఒక నిర్ధారణ లేని వార్తతో కలపడం తనకు బాధ కలిగించిందనేలా వివరణ ఇచ్చారు.
విదేశీ డబ్బు లావాదేవీల విషయంలో కూడా రకుల్ క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగతంగా కానీ, ఏ ప్రొడక్షన్ హౌస్ తరఫున కానీ అక్రమ విదేశీ రెమిటెన్స్‌లో తనకు సంబంధం లేదని చెప్పారు. దేశంలోనో, విదేశాల్లోనో ఎవరి తరఫున బినామీ ఆస్తులు కూడా తన వద్ద లేవని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆర్థిక ఆరోపణలను ఒక్కొక్కటిగా ఖండిస్తూ, వాటికి ఆధారం లేదని చెప్పారు.
ఖరీదైన బహుమతుల గురించి వచ్చిన ప్రచారంపైనా ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు ఎవరూ తనకు ఎలాంటి ఆస్తి గిఫ్ట్ చేయలేదని చెప్పారు. ఖరీదైన గిఫ్ట్స్ తీసుకోవడం తన సిద్ధాంతాలకు విరుద్ధమని కూడా రాశారు. ఈ విషయాలను తన పేరుతో కలిపి ప్రచారం చేయడం వల్ల వ్యక్తిగత ప్రతిష్ఠ, పని రెండింటిపైనా ప్రభావం పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియాపై కూడా రకుల్ గట్టిగానే స్పందించారు. మీడియా సంస్థలను నడిపే వాళ్లకు వ్యాపార ఒత్తిళ్లు ఉంటాయని తాను అర్థం చేసుకుంటానని చెప్పారు. కానీ ఆ ఒత్తిడి కోసం ఫ్యాక్ట్స్ పక్కన పెట్టడం సరైంది కాదన్నారు. ఇతరుల పేరు, పని, జీవనోపాధిపై ప్రభావం పడే వార్తలు రాస్తున్నప్పుడు నిజాలు చెక్ చేయాల్సిందేనని అన్నారు. తనపై వచ్చిన కథనాలు ఆ హద్దు దాటాయని ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనపై తప్పుడు, దురుద్దేశపూరిత, ఊహాగానాలతో కథనాలు ప్రచురించిన వారు వాటిని వెనక్కి తీసుకుని వాస్తవాలు చెప్పాలని రకుల్ కోరారు. లీగల్ యాక్షన్ గురించి ఆమె ఈ పోస్టులో చెప్పలేదు. కానీ తనకు సంబంధం లేని ఐటీ సెర్చ్‌ను తన పేరుతో కలపడం ఆపాలని అడిగారు.