ఈ స్టార్ హీరోతో రాజ్ అండ్ డీకే భారీ ప్రయోగం
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు.;
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు. `ది ఫ్యామిలీ మ్యాన్`, `ఫర్జీ` వంటి సంచలన వెబ్ సిరీస్‌లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు రాజ్ & డీకే మొదటిసారి సల్మాన్ ఖాన్ తో కలిసి పని చేస్తున్నారు. ఆయనను ఒక సూపర్‌హీరోగా వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. పక్కా మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సల్మాన్ ఈసారి హై కాన్సెప్ట్ సూపర్‌హీరో కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం.. ఈ సినిమా హాలీవుడ్ హిట్ మూవీ `హ్యాన్‌కాక్` (విల్ స్మిత్ నటించిన చిత్రం) తరహాలో ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో సల్మాన్ ఒక విభిన్నమైన సూపర్‌హీరో పాత్రను పోషించనున్నారు. ప్రపంచాన్ని కాపాడి కాపాడి అలసిపోయిన ఒక సూపర్‌హీరో ఇక తన మాస్క్‌ను పక్కన పెట్టి ప్రశాంతంగా రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటాడు. కానీ పరిస్థితులు అతడిని ప్రశాంతంగా ఉండనివ్వవు. మళ్ళీ మళ్ళీ పోరాటాల్లోకి లాగుతూ ఒక పెద్ద యుద్ధానికి దారితీసే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
సల్మాన్ ఖాన్ ఈ కాన్సెప్ట్‌ను విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో సల్మాన్ ఒక కీలకమైన షరతు విధించారు. భారీ బడ్జెట్‌తో రిస్క్ చేయడం కంటే.. సరైన బడ్జెట్ పరిమితుల్లోనే ఈ సినిమాను రూపొందించాలని ఆయన దర్శకులకు సూచించారు. ప్రస్తుతం రాజ్ & డీకే సల్మాన్ బాడీ లాంగ్వేజ్‌కు ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఏప్రిల్ 2026లో వీరు సల్మాన్‌కు పూర్తి స్థాయి నెరేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ భారీ ప్రాజెక్టును టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, రీల్ లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించబోతుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ - సల్మాన్ ఖాన్ - రాజ్ & డీకే.. ఇలా ముగ్గురు దిగ్గజాలు కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబర్ 2026 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సూపర్‌హీరో జోనర్ లో వచ్చే ఈ హై-వోల్టేజ్ కామెడీ డ్రామా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం `బ్యాటిల్ ఆఫ్ గాల్వన్` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 16 బీహార్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించి చైనా సైనికులతో వీరోచితంగా పోరాడిన కల్నల్ బి. సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ నటిస్తున్నారు. ఈ యుద్ధ నేపథ్య డ్రామా 17 ఏప్రిల్ 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సల్మాన్ పూర్తి స్థాయిలో రాజ్ అండ్ డీకే సూపర్‌హీరో ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నారు.
మొత్తానికి వరుస యాక్షన్ సినిమాలతో అలరిస్తున్న సల్మాన్ ఖాన్ రిటైర్మెంట్ ముందు సూపర్‌హీరో పాత్రతో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. రాజ్ అండ్ డీకే మార్క్ చతురత - హ్యూమర్.. సల్మాన్ ఖాన్ స్వ్యాగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.