జైలర్‌ 2 : ఇది రజనీ, నెల్సన్‌ కూడా ఊహించి ఉండరేమో!

జైలర్‌ 2 కు మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా కొన్ని రివ్యూల్లో సెకండ్‌ హాఫ్‌ పూర్తిగా పడుకోబెట్టినట్లుగా ఉందని చెప్పారు.

Update: 2026-10-24 16:30 GMT

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, నెల్సన్‌ దిలీప్ కుమార్‌ కాంబోలో వచ్చిన 'జైలర్‌' సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో మొదటి నుంచి కూడా 'జైలర్‌ 2' పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జైలర్ 2 ను దర్శకుడు నెల్సన్‌ రూపొందించాడు. తన మార్క్‌ కామెడీ మిస్ కాకుండా, రజనీకాంత్‌ మార్క్‌ మేనరిజం మిస్ కాకుండా, స్టైల్‌ కంటిన్యూ చేస్తూ జైలర్‌ 2 ను తెరపైకి తీసుకు వచ్చాడు. నెల్సన్‌ తీసిన సినిమాను అనిరుధ్‌ ఎక్కడికో తీసుకు వెళ్లాడు. రజనీకాంత్‌ సినిమాకు మ్యూజిక్‌ అంటేనే అనిరుధ్‌ శివాలెత్తి పోతాడు. జైలర్ 2 కి కూడా అదే జరిగింది. అనిరుధ్‌ మ్యూజిక్ వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులు సైతం అక్కడ సీన్‌ ను చూడకుండా మ్యూజిక్‌ను వింటూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేయడం జరిగిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జైలర్‌ 2 వరల్డ్‌ వైడ్‌ కలెక్షన్స్‌...

జైలర్‌ 2 కు మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా కొన్ని రివ్యూల్లో సెకండ్‌ హాఫ్‌ పూర్తిగా పడుకోబెట్టినట్లుగా ఉందని చెప్పారు. ఫస్ట్‌ హాఫ్‌లోనూ అదే రొటీన్‌ కామెడీ ఉందని కొందరు రివ్యూలు ఇచ్చారు. అయినా కూడా ప్రేక్షకులు జైలర్‌ 2 ను చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. అందుకే చాలా తక్కువ సమయంలోనే రూ.500 కోట్ల మార్క్‌ను జైలర్‌ 2 సినిమా దాటింది. దసరా సెలవులు కలిసి రావడంతో దేశ వ్యాప్తంగా సినిమాకు రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవర్సీస్‌లోనూ సినిమా సునాయాసంగా మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. దాంతో విడుదలైన మొదటి వారంలోనే దాదాపుగా రూ.600 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఇప్పటి వరకు జైలర్ 2 ఏకంగా రూ.628 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. దీంతో ఇప్పటి వరకు ఇండియన్‌ బాక్సాఫీస్ ఆల్‌ టైం రికార్డ్‌ వసూళ్లు సాధించిన టాప్‌ 20 జాబితాలో జైలర్‌ 2 కూడా చోటు దక్కించుకుంది.

రజనీకాంత్‌, నెల్సన్‌ దిలీప్‌...

రెండో వారం మొదలు కాకుండానే ఎన్నో రికార్డ్‌లు సొంతం చేసుకున్న జైలర్‌ 2 రన్‌ పూర్తి అయ్యేప్పటికీ మరింత పెద్ద నెంబర్‌ నమోదు చేస్తుందని బాక్సాఫీస్ వర్గాల వారు భావించారు. కానీ దసరా సెలవులు పూర్తి కావడంతో వీక్ డేస్‌ లో ఒక్కసారిగా వసూళ్లు తగ్గాయి. మళ్లీ వీకెండ్‌ వరకు కాస్త జాగ్రత్తగా సినిమాను కాపాడుకుంటే మరో పాతిక కోట్ల వరకు బాక్సాఫీస్‌ వద్ద నమోదు చేసినా ఆశ్చర్యం లేదు. చిత్ర యూనిట్‌ సభ్యుల తాజా అంచనా ప్రకారం సినిమా లాంగ్‌ రన్‌ లో దాదాపుగా రూ.700 కోట్ల వసూళ్ల వద్ద ఆగే అవకాశాలు ఉన్నాయి. అయితే సినిమా విడుదలకు ముందు మాత్రం ఈ స్థాయి వసూళ్లను హీరో రజనీకాంత్‌ కానీ, దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కానీ, నిర్మాత కళానిధి మారన్‌ కానీ ఊహించి ఉండరు అని ఒక తమిళ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. అయిదు వందల కోట్ల వరకు జైలర్‌ 2 చేరుతుందని వారు ఆశించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

జైలర్‌ 2 బాక్సాఫీస్ రిపోర్ట్‌...

రజనీకాంత్‌ మార్కెట్‌ భారీగా ఉంది, కానీ సినిమా హిట్‌ అయితేనే భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. హిట్‌ కాకుంటే ఎంత మార్కెట్‌ ఉన్నా కనీసం వసూళ్లు కూడా దక్కని సందర్భాలు ఉన్నాయి. రజనీ గత చిత్రాల విషయంలో అదే జరిగింది. కనుక జైలర్‌ 2 సినిమాకు రూ.500 కోట్ల వసూళ్లు అనేది చాలా పెద్ద మొత్తం అని కూడా కొందరు తమిళ సినీ వర్గాల వారు అనుకున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ సమయంలో ఇదే చర్చ వచ్చినట్లు సమాచారం అందుతోంది. అయితే కంటెంట్‌ పై నమ్మకంతో కళానిధి మారన్‌ భారీ మొత్తానికే ఈ సినిమాను అమ్మడానికి రెడీ అయ్యాడని, లేదంటే సొంత రిలీజ్‌ చేయాలని భావించాడని ఒక తమిళ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.

మొత్తానికి మేకర్స్ ఆశించినట్లుగా రూ.500 కోట్ల కంటే మరో వంద నుంచి నూటా యాబై కోట్ల రూపాయలు అధనంగానే జైలర్‌ 2 రాబట్టింది. ఈ సినిమాలోని భారీ తారాగణం వల్ల మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అనేది కొందరి మాట. రజనీకాంత్‌ మాత్రమే కాకుండా ఈ సినిమాలో హృతిక్ రోషన్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, ఎస్‌ జే సూర్య, విద్యా బాలన్‌, జాకీష్రాఫ్‌ వంటి హేమాహేమీలు నటించిన విషయం తెల్సిందే. వారందరినీ స్క్రీన్‌ పై చూడాలనే ఆశతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టి ఉంటారు. వారందరికీ తగ్గట్లుగా కాస్త మ్యాటర్‌ కూడా సినిమాలో ఉంది కనుక ఈ స్థాయి వసూళ్లు వచ్చాయి అనేది కొందరి విశ్లేషణ.

Tags:    

Similar News