షాకిస్తున్న టాప్-10 సినిమాల ఓటీటీ డీల్స్
భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల క్రేజ్ ఇప్పుడు కేవలం థియేటర్ల వసూళ్లకే పరిమితం కావడం లేదు.;
భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల క్రేజ్ ఇప్పుడు కేవలం థియేటర్ల వసూళ్లకే పరిమితం కావడం లేదు. సినిమా సెట్స్ పై ఉండగానే ఓటీటీ సంస్థలు వందల కోట్లు కుమ్మరించి డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. సౌత్ నుంచి నార్త్ వరకు అగ్ర హీరోల తదుపరి సినిమాల ఓటీటీ ఒప్పందాలు కళ్లు చెదిరే రేంజులో సాగాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, షారూఖ్ వంటి స్టార్ల సినిమాలకు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి సంస్థలు రికార్డు స్థాయి ధరలను ఆఫర్ చేస్తున్నాయి.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` ఓటీటీ డీల్ గురించి చాలా చర్చ సాగుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సుమారు రూ. 80 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. పవన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఓటీటీ డీల్స్ లో ఒకటిగా నిలవడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ `విశ్వంభర` కూడా భారీ స్థాయిలోనే ట్రేడ్ అవుతోంది. ఈ సినిమా హక్కుల కోసం జియో హాట్‌స్టార్ దాదాపు రూ. 60 నుండి 80 కోట్లు వెచ్చించనున్నట్లు అంచనా.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటిస్తున్న `సలార్ 2` అన్ని భాషల డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ. 162 కోట్లకు దక్కించుకుందని ప్రచారం సాగుతుండగా... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `స్పిరిట్` మూవీకి అప్పుడే రూ. 150 కోట్ల మేర ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్- కమల్ హాసన్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ భారీ మల్టీస్టారర్ సీక్వెల్ మూవీ `కల్కి 2898 ఏడి` ఓటీటీ డీల్ 150 కోట్లు పైగా పలుకుతుందని ఒక అంచనా. అలాగే ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న `డ్రాగన్` చిత్రానికి కూడా నెట్‌ఫ్లిక్స్ రూ. 125 కోట్లు ఆఫర్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. షూటింగ్ ప్రారంభ దశలోనే ఉన్నా ఈ కాంబోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ స్థాయి రేటు పలుకుతోంది. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు ఇంకా చిత్రీకరణల దశలో ఉండగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఫైనల్ డీల్ గురించి చిత్రబృందం వెల్లడించాల్సి ఉంటుంది.
టైర్-2 హీరోలలో అడివి శేష్ `గూఢచారి 2`.. నిఖిల్ `స్వయంభు` చిత్రాలు కూడా మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ గూఢచారి సీక్వెల్ కోసం రూ. 30-40 కోట్లు కేటాయించనుందని కథనాలు రాగా, నిఖిల్ సినిమాకు రూ. 25-30 కోట్లు వెచ్చిస్తోందని సమాచారం. కన్నడ స్టార్ యష్ నటిస్తున్న `టాక్సిక్` తెలుగు డబ్బింగ్ హక్కులు ఓటీటీ హక్కులతో కలిపి నెట్‌ఫ్లిక్స్ రూ. 150 కోట్ల భారీ డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. కేవలం సౌత్ సినిమాలే కాదు.. బాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రాలు కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
ఈ జాబితాలో అన్నిటికంటే టాప్‌లో నిలిచింది షారుఖ్ ఖాన్ నటిస్తున్న `కింగ్`. ఈ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 250 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే రణబీర్ కపూర్ `రామాయణ పార్ట్ 1` హక్కులను ప్రైమ్ వీడియో రూ. 200 కోట్లకు పైగా ధరతో సొంతం చేసుకుంది. హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ ఈ సినిమాలకు ఉన్న క్రేజ్ వల్లే ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పెద్ద సినిమాలు విడుదలైన 8 వారాల వరకు ఓటీటీలోకి రాకూడదనే రూల్ ఉన్నా కానీ, ఈ ఒప్పందాల విలువ తగ్గకపోవడం విశేషం.
మొత్తానికి థియేట్రికల్ వసూళ్లతో సంబంధం లేకుండా.. డిజిటల్ రైట్స్ రూపంలోనే నిర్మాతలు తమ బడ్జెట్‌లో సగానికి పైగా వెనక్కి తెచ్చుకుంటున్నారు. అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలీదు కానీ.. ఓటీటీ ప్రపంచంలో మాత్రం ఇప్పటికే `బ్లాక్ బస్టర్` డీల్స్ కుదిరాయని చెప్పవచ్చు. ఈ భారీ ఒప్పందాలు సదరు సినిమాలపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.