స్టార్ హీరోకి బెయిల్.. హైకోర్టు విచక్షణను తప్పు పట్టిన సుప్రీం!
అయితే ఈ బెయిల్ సముచితమైనది కాదు! అంటూ కర్నాటక ప్రభుత్వం సుప్రీంలో పిల్ వేసింది. హైకోర్ట్ నిర్ణయం సరైనది కాదనేది ప్రభుత్వ ఆరోపణ.;
కర్నాటకలో అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయిన ఘటన సంచలనమైన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా నలుగుతున్న ఈ కేసులో దర్శన్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత చాలా ప్రయత్నాల అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు.
అయితే ఈ బెయిల్ సముచితమైనది కాదు! అంటూ కర్నాటక ప్రభుత్వం సుప్రీంలో పిల్ వేసింది. హైకోర్ట్ నిర్ణయం సరైనది కాదనేది ప్రభుత్వ ఆరోపణ. దీనిపై విచారించిన సుప్రీం హైకోర్టు చర్యను తప్పు పట్టింది. అభిమాని రేణుకస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీపకు బెయిల్ మంజూరు చేసేటప్పుడు కర్ణాటక హైకోర్టు ``తన విచక్షణను సరిగ్గా ఉపయోగించలేదు`` అని సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసులో దర్శన్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిబల్‌ను ప్రశ్నిస్తూ, దీనిపై సుప్రీం ఎందుకు ప్రశ్నించకూడదో సమాధానం ఇవ్వాల్సిందిగా కోరింది.
2024 జూన్ లో దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపినందుకు అభిమాని రేణుకను దర్శన్ కొందరు గూండాల సాయంతో హింసించారని, అదే క్రమంలో అతడు మరణించగా, కాలువలో పడేసారని కథనాలొచ్చాయి. ఈ కేసులో దర్శన్ సహా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కొన్ని నెలల పాటు దర్శన్ జైలు శిక్షను అనుభవించాడు. డిసెంబర్‌లో కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జెబి పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం నటుడు దర్శన్ న్యాయవాది, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించింది. అతడిని సమాధానం రెడీ చేసుకోవాల్సిందిగా సమయం ఇచ్చింది. కేసును తదుపరి విచారణకు వాయిదా వేసింది.