ఏ గొడవల్లేవ్! స్టార్ హీరో సూర్యపై అవన్నీ పుకార్లు!!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న `కరుప్పు` చిత్రం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న `కరుప్పు` చిత్రం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంతో సూర్య అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడికి, నిర్మాతకు మధ్య విభేదాలు తలెత్తాయని అందుకే సినిమా విడుదలలో జాప్యం జరుగుతోందనే వార్తలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్జే బాలాజీ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఆర్జే బాలాజీ తన ఇన్‌స్టా వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ, `కరుప్పు` చిత్రం ఎలాంటి చిక్కుల్లో లేదని స్పష్టం చేశారు. సినిమా ఆలస్యం కావడం వల్ల అభిమానులు పడుతున్న నిరాశ తనకు అర్థమవుతోందని, అయితే వారి నిరీక్షణకు తగిన ఫలితం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. గత రెండేళ్లుగా తాను ఈ ప్రాజెక్ట్ మీద నిరంతరం పని చేస్తున్నానని, త్వరలోనే సినిమా పనులను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రధానంగా ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కాబోతోందంటూ వస్తున్న వార్తలను బాలాజీ ఖండించారు. ``సినిమా ఏప్రిల్ 10న విడుదల కావడం లేదు. పది రోజుల్లో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం`` అని ఆయన స్పష్టం చేశారు. అలాగే నిర్మాతలతో లేదా సంగీత దర్శకుడితో గొడవలు జరిగాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, చిత్ర బృందం అంతా ఐక్యంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. అనవసరమైన పుకార్లను నమ్మవద్దని, సినిమా అవుట్‌పుట్ విషయంలో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష నటిస్తుండగా, ఇంద్రాన్స్, నట్టి, స్వాసిక, శివద వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య బర్త్‌డే సందర్భంగా విడుదలైన టీజర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
టీజర్‌లో సూర్య రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. వైట్ అండ్ వైట్ డ్రస్‌లో శరవణన్ అనే లాయర్‌గా ఒకవైపు, నలుపు రంగు దుస్తుల్లో చేతిలో కొడవలి పట్టుకుని అత్యంత వైలెంట్‌గా మరోవైపు కనిపిస్తూ ద్విపాత్రాభినయంతో అదరగొట్టారు. ముఖ్యంగా సూర్య పాత బ్లాక్ బస్టర్ `గజని' సినిమాలోని `ఓరు మాలై` సాంగ్ రిఫరెన్స్‌ను ఇందులో వాడటం అభిమానులకు పూరింతలు తెప్పించింది. సినిమా పేరుకు తగ్గట్టే 'కరుప్పు' (నలుపు) లుక్‌లో సూర్య ఊరమాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ సినిమాను థియేటర్లలోనే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య చేస్తున్న ఈ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఎట్టకేలకు దర్శకుడి వివరణతో సినిమా ఆగిపోయిందన్న రూమర్లకు తెరపడటంతో సూర్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే అధికారిక విడుదల తేదీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.