'దురంధ‌ర్' మూవీ చూసి ఇండియాకు ఫిన్‌లాండ్ ప్రెసిడెంట్

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గ్లోబల్ స్థాయిలో ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇది.;

Update: 2026-03-10 15:00 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గ్లోబల్ స్థాయిలో ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇది. ఒక దేశాధ్యక్షుడు స్వయంగా ఒక భారతీయ సినిమాను చూసి, దానిపై ప్రశంసలు కురిపిస్తూ తన పర్యటనను ప్రారంభించడం అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాకి పెరిగిన ఇమేజ్‌ను చాటుతోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని `నాటు నాటు` పాటతో తొలి ఆస్కార్‌ను ముద్దాడిన భారత్, ఇప్పుడు వినోద రంగంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరంగంలా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఖ్యాతిని ఇప్పుడు రణవీర్ సింగ్ నటించిన `దురంధర్` చిత్రం కొనసాగిస్తోంది.

ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఇటీవల తన భారత పర్యటనకు బయల్దేరే ముందు `దురంధర్` సినిమాను వీక్షించాన‌ని ప్ర‌క‌టించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కుమారుడి సూచన మేరకు ఈ చిత్రాన్ని చూశానని ఆయన స్వయంగా వెల్లడించడం విశేషం. సినిమాలో ఉగ్రవాదంపై పోరాడే కథాంశం తనకు బాగా నచ్చిందని.. అటువంటి పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం సినిమాను చూడటమే కాకుండా.. మార్చి 19న విడుదల కానున్న సీక్వెల్ `దురంధర్: ది రివెంజ్` కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు స్టబ్ ప్రకటించడం సంచ‌ల‌నంగా మారింది. నిజానికి ఈ ప్ర‌క‌ట‌న నిజంగా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.

మొదటి భాగం `దురంధర్` గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పాకిస్థాన్, గల్ఫ్ దేశాలలో ఈ సినిమాపై నిషేధం ఉన్నప్పటికీ పైరసీ మార్కెట్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసి చూసిన సినిమాగా ఇది రికార్డులు తిరగరాసింది. అంటే ఆయా దేశాల ప్రజలతో పాటు అక్కడి పాలకులలో కూడా ఈ సినిమాపై ఎంతటి కుతూహలం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకే భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడు రెండో భాగంతో అంతర్జాతీయ మార్కెట్‌ను శాసించేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్, గ‌ల్ఫ్ లోను అత్య‌ధికంగా డౌన్ లోడ్ చేసుకుని చూసిన సినిమాగాను దురంధ‌ర్ రికార్డులు తిర‌గ‌రాసింది.

మార్చి 19న విడుదల కానున్న `దురంధర్: ది రివెంజ్` అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శనివారం ప్రారంభమైన బుకింగ్స్ ద్వారా భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి సుమారు 12.29 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఇక బ్లాక్ బుకింగ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం 18.1 కోట్ల రూపాయలకు చేరిందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా ఉత్తర అమెరికా వంటి ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమా ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా ప్రీమియర్స్ కోసం ఇప్పటికే 557 ప్రాంతాల్లో 38,500 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా దాదాపు 5.15 కోట్ల రూపాయల (6,18,911 డాల‌ర్లు) వసూళ్లు నమోదయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ హైప్‌ను మరింత పెంచింది. రణవీర్ సింగ్ ఇందులో జస్కీరత్, హంజా అనే రెండు విభిన్న అవతారాలలో అత్యంత క్రూరమైన, ప్రతీకారేచ్ఛతో ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. హై-వోల్టేజ్ యాక్షన్, వైలెంట్ సీన్స్‌తో ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

ఈ భారీ యాక్షన్ డ్రామాలో రణవీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులు తమ పాత్రలలో తిరిగి న‌టించారు. ఒక దేశాధ్యక్షుడు స్వయంగా భారతీయ సినిమా కథాంశాన్ని మెచ్చుకోవడంతో `దురంధర్2` క్రేజ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. మార్చి 19న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాక్సాఫీస్ వద్ద మరెన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందో అని సినీ ప్రపంచం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News