స్టార్ హీరోల కథల ఎంపికలో అసలు పవర్ ఎవరిది? ఫిలింనగర్‌లో హాట్ డిస్కషన్

తాజాగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఒక స‌రికొత్త‌ సైకలాజికల్ డ్రామా చిత్రం ప్ర‌మోష‌న్స్ లో కొన్ని క‌ఠిన‌మైన నిజాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి.

Update: 2026-06-28 08:30 GMT

సాధార‌ణంగా స్టార్ హీరోల‌కు త‌మ‌వైపు వ‌చ్చే ప్ర‌తి 10 పేజీల సంక్షిప్త‌ క‌థ‌ను లేదా రెండున్న‌ర గంట‌ల స్క్రిప్టును వినేంత స‌మ‌యం ఉండ‌క‌పోవ‌చ్చు. అరుదుగా లేదా సెల‌క్టివ్ గా మాత్ర‌మే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు వినిపించే క‌థ‌ల్ని వింటారు. అయితే స్టార్ హీరోలు తాము క‌థ వినేకంటే ముందే భార్య‌లు వింటార‌నే నిజం ఎంద‌రికి తెలుసు? తెలుగు చిత్ర‌సీమ‌లో అంద‌రు స్టార్ హీరోల భార్య‌లు క‌థ‌లు వినే మూడ్ లో లేరు కానీ... ఓ ఇద్ద‌రు స్టార్ హీరోల భార్య‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లాకే కొన్నిసార్లు క‌థ‌లు- స్క్రిప్టులు ఫైన‌లైజ్ అవుతాయ‌ని గుస‌గుస ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

తాజాగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఒక స‌రికొత్త‌ సైకలాజికల్ డ్రామా చిత్రం ప్ర‌మోష‌న్స్ లో కొన్ని క‌ఠిన‌మైన నిజాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ఆ సినిమా ద‌ర్శ‌కుడు అనుకోకుండా స్టార్ హీరో వైఫ్ గురించిన‌ కొన్ని లీకులు ఇవ్వ‌డంతో అవి ఆ నోటా ఈనోటా ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లుగా మారాయి. ఆ స్టార్ హీరో హోమ్ బ్యానర్‌లో క‌థ ఓకే కావాలంటే ముందు భార్య క‌థ వినాల‌ట‌. త‌న‌ సినిమా కథను ఓకే చేయించుకోవడానికి దర్శకుడు దాదాపు 60-70 మందికి పైగా కథ వినిపించాల్సి వచ్చిందట. ఎక్కడా వర్కవుట్ అవ్వని ఈ ప్రాజెక్ట్.. చివరకు ఆ స్టార్ హీరో భార్య దగ్గరకు వెళ్లాకే ఊపందుకుంది. ఆమె కథను పూర్తిగా విని, స్క్రిప్ట్ లోని లోతుపాతులను విశ్లేషించి ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని దర్శకుడు వెల్లడించారు.

ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే... సదరు స్టార్ హీరో అసలు ఈ సినిమా కథను నేరుగా విననే లేదట. ఆయన భార్యే స్వయంగా కథను, దర్శకుడి విజన్‌ను పూర్తిగా అర్థం చేసుకుని... ఆ తర్వాత తన భర్తతో చర్చించి ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. దీనితో ఆ స్టార్ హీరో నిర్మాణ సంస్థలో కేవలం మేనేజ్‌మెంట్ పనులు మాత్రమే కాకుండా, కథల ఎంపికలోనూ ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారో స్పష్టమైంది.

చిత్ర పరిశ్రమలో మొదటి నుంచీ వినిపిస్తున్న గుసగుసల ప్రకారం... ఆ స్టార్ హీరో సినిమా ఎంపికలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపార నిర్ణయాల వెనుక అర్థ‌నారి అయిన భార్య‌ ఒక బలమైన శక్తిగా నిలుస్తున్నారు. స్టార్ హీరో తన షూటింగ్‌లు, బ్రాండ్ కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటం వల్ల.. స్క్రిప్టుల విష‌యంలోను ఆమె జడ్జిమెంట్‌పైనే పూర్తిగా ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే స‌మ‌యంలో ఫిలింన‌గ‌ర్ గుస‌గుస‌ల ప్ర‌కారం.. .కేవ‌లం ఆ ఒక్క స్టార్ హీరోనే కాదు.. ఇండ‌స్ట్రీలో పేరున్న మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ కూడా ఇటీవ‌లి కాలంలో త‌న స్క్రిప్టుల ఎంపిక కోసం భార్య మొద‌ట క‌థ వింటున్నార‌ని కూడా గుస‌గుసలాడుకోవ‌డం చ‌ర్చ‌గా మారింది. అలాగే మ‌రో స్టార్ హీరో స్క్రిప్టు మ్యాట‌ర్ లో తండ్రి స‌ల‌హాలు తీసుకుంటున్నార‌ని, తాను విన్నా కానీ త‌న‌ తండ్రిని కూడా స్క్రిప్టుతో ద‌ర్శ‌కుడు ఒప్పించాల్సి ఉంటుంద‌నే గుస‌గుస కూడా ఉంది.

Tags:    

Similar News