గీతా సపోర్ట్ తో హర్షిత్ దీవాన.. టీజర్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో హర్షిత్ రెడ్డి ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.;

Update: 2026-03-10 14:28 GMT

టాలీవుడ్ యంగ్ హీరో హర్షిత్ రెడ్డి ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. శుభం సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆయన.. ఇప్పుడు లీడ్ రోల్ లో దీవాన మూవీ చేస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఆ సినిమాను సమ్మర్ సీజన్‌ లో గ్రాండ్‌ గా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.

అయితే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజా ప్రకటించింది. ఆ సినిమాను అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రేమకథా చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా భావోద్వేగాలతో నిండిన కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇటీవల విడుదలైన దీవాన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన స్టోరీ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంది.

పోస్టర్‌ లో కనిపించిన విజువల్స్, లవ్ స్టోరీకి సంబంధించిన ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. హర్షిత్ రెడ్డి సినిమాలో కొత్త తరహా పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇంటెన్స్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగనున్న ఆ సినిమా ఆయన కెరీర్‌లో మరో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని టాక్.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సమ్మర్ సీజన్‌ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమాను గ్రాండ్ గా రిలీజ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో తాజాగా టీజర్ అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. మార్చి 12న ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పింది. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన 'గుండె చాలా గలిజ్ది రా భయ్! మనల్ని దేకనోళ్ల కోసమే కొట్టుకుంటుంది' డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక మూవీ విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ బాధ్యతలను వంశీ పచ్చిపులుసు నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను హృషికేశ్ పాస్పల్ చేపట్టగా, సంగీతాన్ని ఈశ్వర్ చంద్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌ గా ఝాన్సీ గోజల పనిచేస్తున్నారు. కాస్ట్యూమ్స్ బాధ్యతలను మానస నిర్వహిస్తున్నారు. ఏదేమైనా శుభం తర్వాత హర్షిత్ రెడ్డి నటిస్తున్న దీవాన సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఆ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.



Tags:    

Similar News