ఆంధ్రప్రదేశ్‌లో టాలీవుడ్ అభివృద్ధిపై ఏపీ ఎఫ్‌డీసీ కసరత్తు
ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త టాలీవుడ్ అభివృద్ధి గురించి రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు? సినిమా-టీవీ రంగ అభివృద్ధి కోసం ఎలాంటి కార్యాచరణ జరుగుతోంది? ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటి? ఎఫ్‌డిసి ఏం చేస్తోంది? .. తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాలి.
ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త టాలీవుడ్ అభివృద్ధి గురించి రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు? సినిమా-టీవీ రంగ అభివృద్ధి కోసం ఎలాంటి కార్యాచరణ జరుగుతోంది? ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటి? ఎఫ్‌డిసి ఏం చేస్తోంది? .. తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాలి.
గడిచిన కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ (టాలీవుడ్) అభివృద్ధికి సంబంధించి నాయకుల నుండి ఎన్నో ప్రకటనలు వెలువడుతున్నా... క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తోంది, ఎఫ్‌డీసీ (FDC) పాత్ర ఏమిటనేది ప్రజల్లో నిరంతరం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఏపీలో సినీ రంగాన్ని పునర్నిర్మించేందుకు, విస్తరించేందుకు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎఫ్‌డీసీ కీలక సమీక్ష నిర్వహించడం పరిశ్రమ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
ఈ తాజా సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్‌తో APSFTVTDC ఛైర్మన్ భరత్ భూషణ్, ఏపీ ఎఫ్‌డీసీ ఎండి విశ్వనాథన్ , పలు శాఖల కీలక అధికారులు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో సినిమా రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడం , రాష్ట్రంలో సినీ వాతావరణాన్ని మెరుగుపరచడం ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. రాజధాని సహా విశాఖపట్నం లేదా ఇతర ప్రాంతాల్లో ఇండస్ట్రీ సెటప్‌కు కావలసిన మౌలిక వసతులు, షూటింగ్‌ల నిర్వహణకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు.
సమావేశం అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లు ఎక్కడా ఆలస్యం కాకుండా వేగవంతంగా జరగడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. షూటింగ్ అనుమతుల కోసం నిర్మాతలు ఇబ్బంది పడకుండా `సింగిల్ విండో` విధానంలో... ఫాస్ట్ ట్రాక్ పద్ధతి ద్వారా త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏపీలో అనేక సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నా.. ఈ కొత్త విధానంతో మరింత వేగంగా, పారదర్శకంగా అనుమతులు లభిస్తాయని పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు.
ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వానికి చెందిన పలు శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్, పిసిసిఎఫ్ చలపతి రావు, సీఎఫ్ఎఫ్ ఎన్ ఎన్ రావులతో పాటు శశి భూషణ్ కుమార్, కాంతిలాల్ దండే, సురేష్ కుమార్, సంపత్ కుమార్, యువరాజ్, కన్నబాబు, ఆమ్రపాలి, ప్రవీణ్ ఆదిత్య, శుభం బన్సాల్, భరణి, పద్మావతి, వెంకటరమణ తదితరులు ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ హాజరై తమ అమూల్యమైన సూచనలను అందించారు. అన్ని శాఖల నుంచి సానుకూల స్పందన రావడం ఏపీ సినీ భవిష్యత్తుకు శుభసూచకమని అధికారులు భావిస్తున్నారు.
మొత్తానికి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పరిపాలనాపరంగా వేగంగా అడుగులు వేస్తూ... వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకోవడం ఏపీ ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోంది. ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, సింగిల్ విండో విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చిత్ర పరిశ్రమ ఏపీ వైపు మొగ్గు చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తద్వారా రాష్ట్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీ సెటప్‌కు బలమైన పునాది పడటంతో పాటు.. స్థానిక కళాకారులకు , ఉపాధి రంగానికి పెద్దపీట వేసినట్లవుతుంది.