కుమార్తెలకు భయం లేని ప్రపంచాన్ని కానుకగా ఇద్దాం!
ఈ ప్రత్యేక దినాన శుభాకాంక్షలు చెప్పడానికే పరిమితం కాకుండా ఆడపిల్లల రక్షణపై సమాజాన్ని ప్రశ్నించడమే ముఖ్యమని స్పష్టం చేశారు.
డాటర్స్ డే సందర్భంగా బాలీవుడ్ నటి కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ భావోద్వేగ పోస్ట్ నెట్టింట ఆలోచింపజేస్తోంది. దేశంలో మహిళలు, బాలికలపై వరుసగా జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడుల ఘటనల నేపథ్యంలో స్పందించారు. మహిళల జీవితాల్లో భయం అనేది ఎందుకు? సాధారణ భాగమైపోయింది? అని నిలదీశారు. ఈ ప్రత్యేక దినాన శుభాకాంక్షలు చెప్పడానికే పరిమితం కాకుండా ఆడపిల్లల రక్షణపై సమాజాన్ని ప్రశ్నించడమే ముఖ్యమని స్పష్టం చేశారు.
ఆడపిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ స్వేచ్ఛగా జీవించాల్సిన వాతావరణం పోయి ప్రతి అడుగులోనూ భయంతో బతకాల్సి రావడం పట్ల కృతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంధ్యా సమయం దాటితే బయటకు వెళ్లాలన్నా? ఒంటరిగా ప్రయాణించాలన్నా నగరాల్లో భయం గుప్పెట్లో బతకాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. డాటర్స్ డే నాడు సమాజం ఆడపిల్లలను ప్రేమించడం మాత్రమే కాదు. వారికి భయం లేని సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందనే సందేశాన్ని ఇచ్చారు.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో మైనర్ బాలికలు, మహిళలపై జరిగిన దారుణ లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. విద్యార్థినులు, మహిళా సంఘాలు రోడ్లపైకి వచ్చి భద్రత కోసం నిరసనలు తెలుపుతున్న తరుణంలో కృతి సనన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరిం చుకున్నాయి. కఠిన చట్టాలు తీసుకురావడమే కాకుండా, సమాజంలో స్త్రీల పట్ల ఉన్న దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మగపిల్లల పెంపకం విషయంలో సమాజం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ సందర్భంగా కృతి ఎత్తిచూపారు. ఆడపిల్లలకు ఎల్లప్పుడూ జాగ్రత్తలు, పరిమితులు నేర్పించడం కంటే మగపిల్లలకు చిన్నతనం నుంచే మహిళలను గౌరవించడం, వారి భద్రత పట్ల బాధ్యతగా ఉండటం నేర్పించడం అంతకంటే ముఖ్యమని నొక్కిచెప్పారు. భయం అనేది ఆడపిల్లల హక్కులను, ఆశయాలను కాలరాసేలా మారకూడదని ఆకాంక్షించారు.
కృతి సనన్ నటిగానే కాకుండా మహిళల హక్కులు, భద్రతపై నిరంతరం గళం విప్పుతున్నారు. ఇటీవల ఓ పండుగ ప్రకటనలో దుస్తుల వివాదంపై వచ్చిన విమర్శలను ఖండిస్తూ సమాజం మహిళల దుస్తులపై చూపే ఆగ్రహాన్ని వారిపై జరుగుతున్న నిజమైన దాడులపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా డాటర్స్ డే సందర్భంగా కూడా అదే ఆవేదనను వ్యక్తం చేసారు. సమాజపు ద్వంద్వ ప్రమాణాలను మరోసారి ఎండగట్టారు. తాజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ నెటిజన్లు, సినీ ప్రముఖుల మద్దతును పొందుతోంది. `మన కుమార్తెలకు భయం లేని ప్రపంచాన్ని కానుకగా ఇద్దాం అని కృతి ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఆడపిల్లల భద్రత అనేది పండుగలకో? ప్రత్యేక రోజులకో పరిమితం కాకుండా వారి రోజువారీ జీవితంలో నిజమైన మార్పుగా మారినప్పుడే డాటర్స్ డే జరుపుకోవడానికి అసలైన సార్థకత లభిస్తుంది.