ధర్మ-అధర్మాల పోరాటంలో కర్ణ-అశ్వత్థామల కలయిక!
మొదటి భాగం ముగింపులో సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) సుమతి (దీపికా పదుకోణే) నుంచి పొందిన సీరమ్ చుక్క ద్వారా యువకుడిగా మారి అమితమైన శక్తిని పొందడం హైలైట్ అయింది.
'కల్కి 2898 ఏడీ' మొదటి భాగం కథలో పాత్రలను, ఆ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ప్రాధాన్యతనిస్తే సీక్వెల్ (కల్కి 2) మాత్రం పూర్తిస్థాయి ధర్మ-అధర్మాల మహా సంగ్రామంగా సాగబోతోందన్నది కాదనలేని నిజం. మొదటి భాగం ముగింపులో సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) సుమతి (దీపికా పదుకోణే) నుంచి పొందిన సీరమ్ చుక్క ద్వారా యువకుడిగా మారి అమితమైన శక్తిని పొందడం హైలైట్ అయింది. అతడు గాండీవాన్ని చేతిలోకి తీసుకోవడంతోనే పార్ట్-2 కథ, శక్తుల ఘర్షణ నేరుగా ప్రారంభమవుతుంది.
రెండో భాగంలో సుప్రీమ్ యాస్కిన్ పాత్ర మరింత భయానకంగా, శక్తివంతంగా మారనుంది. ఇప్పటివరకు కాంప్లెక్స్ లోపలే ఉంటూ ప్రణాళికలు రచించిన యాస్కిన్ ఇప్పుడు స్వయంగా రణరంగంలోకి దిగుతాడు. భూమిపై మిగిలిన చివరి ఆశాకిరణమైన 'శంభాలా'ను పూర్తిగా నాశనం చేయడం, సుమతి గర్భంలో పెరుగుతున్న కల్కి భగవానుడి జన్మాన్ని అడ్డుకోవడమే అతని ప్రధాన లక్ష్యం. గాండీవం పట్టిన అత్యంత శక్తివంతమైన యాస్కిన్‌ను ఎదుర్కోవడం సాధారణ వీరులకు సాధ్యంకాని పని. కాబట్టి ఈ పోరాటం అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
ఈ సీక్వెల్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం భైరవ (ప్రభాస్) పాత్ర పరిణామక్రమం. కేవలం 'యూనిట్స్' సంపాదించి కాంప్లెక్స్‌కు వెళ్లడమే ధ్యేయంగా బతికే స్వార్థపరుడైన భైరవ, తానెవరో (కర్ణుడి పునర్జన్మ) పూర్తిగా గ్రహించే ప్రయాణం ఇందులో కీలక ఘట్టం. మొదటి భాగం క్లైమాక్స్‌లో కొన్ని నిమిషాల పాటు కనిపించిన కర్ణుడి విశ్వరూపం, రెండో భాగంలో పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం ఉంది. తన గత జన్మ జ్ఞాపకాలు, ధర్మం వైపు నిలబడాల్సిన అవసరం భైరవను స్వార్థపరుడి నుండి గొప్ప పోరాటయోధుడిగా మారుస్తాయి.
అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) , భైరవల మధ్య అనుబంధం, వారి కలయిక ఈ చిత్రానికి ప్రధాన బలం. ద్వాపర యుగంలో స్నేహితులుగా ఉన్నా? విధి వశాత్తు ఒకరికొకరు దూరమైన కర్ణ-అశ్వత్థామలు కలియుగాంతంలో ధర్మాన్ని, రాబోయే కల్కిని రక్షించడానికి చేతులు కలపడం కథలో అతిపెద్ద మలుపు. సుమతిని కాపాడే బాధ్యతను అశ్వత్థామ భుజాలపై వేసుకోగా.. అతనికి భైరవుడు ఏ విధంగా తోడుగా నిలిచి యాస్కిన్ సైన్యాన్నిఎలా తిప్పికొడతాడనేది విజువల్ వండర్‌గా ఉండబోతోంది.
సాంకేతికంగా , విజువల్ గా పార్ట్-2 మొదటి భాగాన్ని మించి హైలైట్ అవుతుంది. పురాణాల్లోని దివ్యాస్త్రాలు, భవిష్యత్ కాలపు అధునాతన లేజర్ ఆయుధాలు , రోబోటిక్ సైన్యాల కలయికతో శంభాలా వేదికగా జరిగే యుద్ధం ప్రేక్షకులకు మైండ్-బ్లోయింగ్ అనుభూతినిస్తుంది. కాంప్లెక్స్ బలగాలు శంభాలాపై దాడి చేయడం.. అక్కడ ఉండే రెబెల్స్, అశ్వత్థామ-భైరవలు వారిని అడ్డుకునే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
అంతిమంగా సీక్వెల్ కల్కి అవతార ఆవిర్భావంతో కలియుగ ముగింపు సూచనలతో ముగిసే అవకాశం ఉంది. యాస్కిన్ అధర్మాన్ని అంతమొందించి.. నూతన యుగానికి (కృత యుగం) పునాది వేసే ఘట్టాలు కథను పరాకాష్ఠకు చేరుస్తాయి. భైరవుడు తన కర్మను నెరవేర్చి కర్ణుడిగా తన నిందలను తుడిచేసుకోవడం, అశ్వత్థామ చిరకాల శాపం నుండి విముక్తి పొందడం వంటి ఆధ్యాత్మిక, భావోద్వేగ అంశాలతో `కల్కి 2` గొప్ప కావ్యసదృశ ముగింపును అందుకోనుంది.