మంచు మ‌నోజ్ రియ‌ల్ స్టంట్స్ మోడ్

మంచు మనోజ్ సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.;

Update: 2026-03-10 18:17 GMT

మంచు మనోజ్ సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. `మిరాయ్` చిత్రంతో పవర్‌ఫుల్ కంబ్యాక్ ఇచ్చిన అత‌డు ఇప్పుడు తన కెరీర్‌ను మునుపటి కంటే మెరుగ్గా తీర్చిదిద్దుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం అత‌డు నటిస్తున్న `డేవిడ్ రెడ్డి` చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మనోజ్ మేకోవర్ .. పడుతున్న శ్రమ చూస్తుంటే అత‌డు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమా కోసం మంచు మనోజ్ తనను తాను పూర్తిగా మార్చుకుంటున్నారు. గత మూడు వారాలుగా ఆయన తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపై కంఫర్ట్ జోన్‌కు చోటు లేదు..సాకులు అంతకన్నా లేవు.. కేవలం కష్టపడటమే నా లక్ష్యం! అంటూ తన అంకితభావాన్ని చాటుకున్నారు. యాక్షన్ సినిమాల్లో ఎవరూ మన కోసం నటించలేరని, ప్రతి పంచ్, ప్రతి కిక్ మనమే చేయాలని, కెమెరా అబద్ధం చెప్పదని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే కేవలం బాడీ బిల్డింగ్ కోసం కాకుండా.. దెబ్బలు తిన్నా తట్టుకునేంత దృఢమైన శరీరం కోసం అత‌డు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.

`డేవిడ్ రెడ్డి` చిత్రం 1897 నుండి 1922 మధ్య కాలంలో సాగే ఒక రా- ఇంటెన్సిప్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి ఢిల్లీలో పెరిగి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక విప్లవ వీరుడి కథగా ఇది తెరకెక్కుతోంది. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం మనోజ్ రియల్ స్టంట్స్ మోడ్ లోకి వెళ్లారు. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాలో మనోజ్ చేసే విన్యాసాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రంలో కథానాయికగా ఉక్రెయిన్ మోడల్ నటి మరియా రియాబోషప్కా ఎంపికయ్యారు. ఈ బ్యూటీ ఇందులో `క్లారా విట్మోర్` అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర గురించి దర్శకుడు చెబుతూ, ``ఆమె ప్రేమ మెత్తగా ఉండదు.. అత్యంత క్రూరంగా ఉంటుంది! అని వ్యాఖ్యానించడం కథలోని గాఢతను తెలియజేస్తోంది.

మంచు మనోజ్ చిత్ర పరిశ్రమలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించడం విశేషం. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ 21వ చిత్రం తన కెరీర్‌లో అత్యంత స్పెషల్ అని మ‌నోజ్ భావిస్తున్నారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఈ సినిమా ద్వారా ఒక అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగే ఈ తిరుగుబాటు గాథలో మనోజ్ వీరత్వాన్ని చూడటానికి ఫ్యాన్స్ వెయిటింగ్..

మొత్తానికి `డేవిడ్ రెడ్డి` కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. మంచు మనోజ్ తనను తాను ఒక యాక్షన్ హీరోగా కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు. 21 రోజుల కఠిన శిక్షణ తర్వాత తనలో ఎంతో మార్పు వచ్చిందని.. ఇంకా ప్రయాణం సుదీర్ఘంగా ఉందని చెప్పడం త‌న‌లోని వినయాన్ని, పట్టుదలను సూచిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ మూవీ మనోజ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం.



Tags:    

Similar News