సామాన్యుడు తెగిస్తే ఏకే 47.. గురూజీ రివీల్ చేసిన అసలు కథ!
త్రివిక్రమ్ సినిమా వేదికలపై మాట్లాడితే అందులో ప్రమోషన్ కంటే జీవిత పాఠాలే ఎక్కువగా కనిపిస్తాయి.
త్రివిక్రమ్ సినిమా వేదికలపై మాట్లాడితే అందులో ప్రమోషన్ కంటే జీవిత పాఠాలే ఎక్కువగా కనిపిస్తాయి. 'ఆదర్శ కుటుంబం' ఈవెంట్ లో ఆయన పంచుకున్న ఆలోచనలు వింటుంటే ఇది రెగ్యులర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా కాదని అర్థమవుతోంది. కలహప్రియత్వం, పద్మవ్యూహం లాంటి లోతైన విషయాలను ప్రస్తావిస్తూ నేటి సమాజ పోకడలను ఆయన విశ్లేషించిన తీరు ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
శ్రీకృష్ణుడు యాదవులు అంతమయ్యే సమయంలో చెప్పిన ఉద్ధవ గీతను ప్రస్తావిస్తూ త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. కలికాలంలో మనుషుల్లో కోరికలు పెరిగి, గొడవలు పెట్టుకోవడాన్ని ఎంజాయ్ చేసే కలహప్రియత్వం ఎక్కువవుతుందని కృష్ణుడు ఎప్పుడో చెప్పినట్లు అర్థమయ్యేలా వివరించారు. నేటి సోషల్ మీడియాలో రెండు మంచి కామెంట్లకు ఇరవై నెగెటివ్ ట్రోల్స్ ఎందుకు కనిపిస్తున్నాయో చెప్పడానికి ఈ పాయింట్ ను లింక్ చేశారు. కథలో అసలైన సంఘర్షణ బయట శత్రువుల కంటే మనుషుల మైండ్సెట్ చుట్టూనే తిరుగుతుందనే హింట్ ఇక్కడ దొరుకుతోంది.
ఈ క్రమంలోనే కుటుంబం అనే వ్యవస్థను ఆయన ఒక పద్మవ్యూహంతో పోల్చారు. స్నేహితులను ఎంచుకోవచ్చు, ప్రేమను కోరుకోవచ్చు గానీ కుటుంబం అనేది మన ప్రమేయం లేకుండా దక్కే ఒక బంధం. అలాంటి బంధాన్ని కాపాడుకోవడానికి చిట్టిబాబు, స్వర్ణ లాంటి సాధారణ వ్యక్తులు ఎంత దూరం ప్రయాణించారనేదే అసలైన కథ అని త్రివిక్రమ్ రివిల్ చేశారు. ఇంటికి ముప్పు వచ్చినప్పుడు ఒక సామాన్యుడు తెగిస్తే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో దర్శకుడు చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేశారు.
పద్మవ్యూహంలోకి దిగినప్పుడు అందులోనే చిక్కుకుని అభిమన్యుడిలా మిగిలిపోతామా లేక పోరాడి అర్జునుడిలా గెలిచి వస్తామా అన్నదే కథలోని అసలైన సవాల్ అని గురూజీ హైలెట్ చేశారు. ఇంటి రక్షణ కోసం ఒక సాధారణ గృహస్థు చేసే పోరాటాన్ని మహాభారత యుద్దంతో పోల్చడం త్రివిక్రమ్ పెన్ పవర్ కు నిలువెత్తు రూపం. క్లాస్ ఫ్యామిలీ కథకు 'ఏకే 47' అనే గన్ పేరును ఎందుకు జత చేశారో ఈ విశ్లేషణతో ఒక క్లారిటీ వచ్చేసింది.
ఇక వెంకటేష్ ఇమేజ్ గురించి త్రివిక్రమ్ చెప్పిన నిర్వచనం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రక్తం చిందించే కత్తులు, సుమోలు గాల్లో లేపకుండా కుటుంబ కథలతోనే దశాబ్దాలుగా తిరుగులేని సూపర్ స్టార్ గా కొనసాగుతున్న ఏకైక నటుడు వెంకీ. కుటుంబమే ఆయన అసలైన మాస్, కుటుంబమే ఆయన మజిల్ అంటూ ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది.
'నువ్వు నాకు నచ్చావ్' నాటి వెంకీ నమ్మకంతో మొదలైన వీరి ప్రయాణం, ఇన్నాళ్లకు మరో స్థాయికి చేరింది. ఆ రోజు ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేననీ త్రివిక్రమ్ అన్నారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. చివరగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర ప్రజలు క్షేమంగా ఉండాలని, ఈ తుపాను వాళ్లకు కన్నీళ్లు కాకుండా కేవలం నీళ్లనే ఇవ్వాలని కోరుకున్నారు.