తొందరపడితే సుకుమార్ ఎందుకవుతాడు?
రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత ఉంటుందో 'రంగస్థలం' చూసిన ఎవరికైనా తెలుసు.
రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత ఉంటుందో 'రంగస్థలం' చూసిన ఎవరికైనా తెలుసు. ఆ క్రేజీ కాంబో RC17 పూజా కార్యక్రమాలు నవంబర్ 1న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగబోతున్నాయి. అయితే ఓపెనింగ్ రోజునే కొబ్బరికాయ కొట్టేసి, వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లే రకం కాదు సుకుమార్. డిసెంబర్లోనే మొదలవ్వాల్సిన రెగ్యులర్ షూటింగ్‌ను 2027 ఆరంభానికి వాయిదా వేసే అవకాశమున్నట్లు సమాచారం.
సుకుమార్ వర్కింగ్ స్టైల్ తెలిసిన వాళ్లకు ఈ ఆలస్యం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ప్రతి ఫ్రేమ్‌లో పర్ఫెక్షన్ వెతికే సుక్కు.. ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాగైతే తన కథలను తీర్చిదిద్దుకున్నారో, పుష్ప తర్వాత సుకుమార్ కూడా అదే స్థాయిలో హోమ్‌వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తొందరపడి సెట్స్ పైకి వెళ్లి రీషూట్లు పెట్టుకోవడం కంటే, పేపర్ మీదే కథను పక్కాగా లాక్ చేయాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు రామ్ చరణ్ కూడా ఈ గ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇటీవల తగిలిన గాయం నుంచి కోలుకుంటున్న మెగా పవర్ స్టార్, ప్రస్తుతం బాడీ మేకోవర్ మీద దృష్టి పెట్టారు. బుచ్చిబాబు పెద్ది సినిమాలోని అథ్లెట్ పాత్ర కోసం పెంచిన బరువును తగ్గించుకుంటూ, సుకుమార్ రాసుకున్న సరికొత్త క్యారెక్టర్ కోసం స్లిమ్ లుక్‌ను రెడీ చేసుకుంటున్నారు. హీరో సరైన షేప్‌లోకి రావడానికి కూడా ఈ విరామం బాగా ఉపయోగపడనుంది.
నవంబర్ 1న జరగబోయే గ్రాండ్ లాంచ్‌తో ప్రాజెక్ట్‌పై ఉన్న సగం సస్పెన్స్‌కు తెరపడనుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇప్పటికే రకరకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ముహూర్తం రోజే ఆ లక్కీ బ్యూటీ ఎవరన్నది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తోంది.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో అనిరుధ్ రవిచందర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారనే వార్తలు ప్రాజెక్ట్‌పై మరింత బజ్ ను పెంచుతున్నాయి. రంగస్థలంలో దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. ఇప్పుడు అనిరుధ్ పేరు వినిపిస్తుండటంతో మ్యూజిక్‌పై ఫ్యాన్స్‌లో అంచనాలు పెరుగుతున్నాయి. సుకుమార్ రా నేటివిటీకి అనిరుధ్ బీట్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు ఖాయం.
షూటింగ్ 2027 ఆరంభంలో మొదలైతే, సినిమా థియేటర్లలోకి వచ్చేసరికి 2028 పడొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంటే చిట్టిబాబు మ్యాజిక్ మళ్లీ స్క్రీన్ మీద చూడటానికి అభిమానులు మరో రెండేళ్లు నిరీక్షించాల్సి రావొచ్చు. కాకపోతే సుకుమార్ లాంటి డైరెక్టర్ ఇంత టైమ్ తీసుకుంటున్నాడంటే, బాక్సాఫీస్ వద్ద మరోసారి చరిత్ర సృష్టించే సాలిడ్ కంటెంట్‌తోనే దిగుతాడనే ధీమాతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు.