మదర్స్ డే 2026: అమ్మగా తొలి వేడుక!
ఈ ఏడాది కత్రినా కైఫ్, కియారా అద్వానీ , పత్రలేఖ వంటి అగ్ర నటీమణులు తమ జీవితంలో అత్యంత మధురమైన అమ్మ హోదాను పొందిన తర్వాత జరుపుకుంటున్న తొలి మదర్స్ డే ఇదే కావడం విశేషం;
2026 మదర్స్ డే( మే10) వేళ భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన సందడి కనిపిస్తోంది. ఈ ఏడాది కత్రినా కైఫ్, కియారా అద్వానీ , పత్రలేఖ వంటి అగ్ర నటీమణులు తమ జీవితంలో అత్యంత మధురమైన అమ్మ హోదాను పొందిన తర్వాత జరుపుకుంటున్న తొలి మదర్స్ డే ఇదే కావడం విశేషం. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన తారలు నిజజీవితంలో చిన్నారులతో కలిసి అపురూపమైన రోజును అత్యంత వేడుకగా జరుపుకుంటున్నారు. కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్ దంపతులు తమ చిన్నారితో గడుపుతున్న మొదటి మదర్స్ డే వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాతృత్వపు అనుభూతి తన జీవిత దృక్పథాన్నే మార్చివేసిందని కత్రినా భావాలను పంచుకున్నారు. కెరీర్ పట్ల ఎంతో నిబద్ధతతో ఉండే క్యాట్ ఇప్పుడు ప్రాధాన్యతలను మార్చుకుని బిడ్డ సంరక్షణలో నిమగ్నమవ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది. కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా కూడా మాతృత్వ ప్రయాణంలోని తొలి మదర్స్ డేను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. తమ బిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణం నుండి నేటి వరకు ప్రతి రోజూ ఓ కొత్త పాఠమేనని కియారా పేర్కొన్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా? తన బిడ్డతో గడిపే ప్రతి క్షణం వెలకట్టలేనిదని భావిస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్ వేదికగా బిడ్డ పట్ల ఉన్న ప్రేమను చాటుతూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. అలాగే నటి పత్రలేఖ - రాజ్‌కుమార్ రావు కూడా ఇదే ఏడాది మొదటి మదర్స్ డే వేడుకల్లో మునిగిపోయారు. అమ్మగా మారడం అనేది బాధ్యత మాత్రమే కాదు. అదొక గొప్ప వరం అని పత్రలేఖ తన అనుభూతిని వ్యక్తం చేశారు. ఆధునిక కాలంలో కెరీర్ -కుటుంబం మధ్య సమతుల్యం పాటిస్తూనే మాతృత్వాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించొచ్చని దంపతులు నిరూపిస్తున్నారు.ఈ సెలబ్రిటీల మాతృత్వపు వేడుకలు వ్యక్తిగత సంతోషానికే పరిమితం కాకుండా సమాజంలోని తల్లులందరి త్యాగాలను ,నిస్వార్థ ప్రేమని గౌరవించే వేదికగా మారాయి.
గ్లామర్ ప్రపంచంలో బిజీగా ఉంటూనే తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న న్యూ మామ్స్ నేటి తరం మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వెండితెరపై వారు చేసే అద్భుతాల కంటే? నిజజీవితంలో అమ్మగా వారు పొందుతున్న ఆనందం మిన్న అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ రకంగా 2026 మదర్స్ డే బాలీవుడ్ సుందరీమణుల జీవితాల్లో ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. బిడ్డల రాకతో వారి జీవితాల్లో కొత్త కాంతి వచ్చిందని ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఈ రోజు ఓ అద్భుతమైన వేదికని నెటిజనులు ఆకాంక్షిస్తున్నారు.