కార్మికుడి మృతికి డైరెక్టర్ లక్షల పరిహారం!
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న `లవ్ అండ్ వార్` సినిమా సెట్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న `లవ్ అండ్ వార్` సినిమా సెట్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముంబైలోని గోరెగావ్ తూర్పు ప్రాంతంలో గల రాయల్ పంప్ స్టూడియోలో ఏర్పాటు చేసిన షూటింగ్ సెట్‌లో చంద్రధారి యాదవ్ (42) అనే కార్పెంటర్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. సెట్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల విద్యుత్ ఘాతానికి గురై మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచేందుకు చిత్ర నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది.
ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్ (FWICE)- ఫిల్మ్ స్టూడియో సెట్టింగ్ అండ్ అలైడ్ మజ్దూర్ యూనియన్ (FSSAMU) ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సంజయ్ లీలా భన్సాలీ ప్రొడక్షన్ హౌస్ బాధితుడి కుటుంబానికి 40 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. చంద్రధారి యాదవ్ కు భార్య, ఇద్దరు కుమార్తెలకు ఈ పరిహారం కొంతమేర ఉపశమనాన్ని ఇస్తుందని యూనియన్లు భావిస్తున్నాయి. ఈ ప్రమాదం వెనుక సినీ పరిశ్రమలో నెలకొన్న తీవ్రమైన పని ఒత్తిడి కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరణించిన చంద్రధారి యాదవ్ గత మూడు రోజులుగా సెట్‌లో నిరంతరాయంగా పనిచేస్తున్నాడని, ప్రమాదం జరిగిన రోజున ఉదయం 7 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు (దాదాపు 20 గంటలు) విధుల్లోనే ఉన్నాడని సమాచారం.
ఇంత సుదీర్ఘ కాలం పాటు విశ్రాంతి లేకుండా శారీరక శ్రమకు గురికావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఫైస్ (FWICE) అధ్యక్షుడు బి.ఎన్. తివారీ, గౌరవ ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే కేవలం నగదు పరిహారానికే పరిమితం కాకుండా మరికొన్ని డిమాండ్లను నిర్మాత ముందు ఉంచారు. కార్మికుడి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చులను భన్సాలీ ప్రొడక్షన్స్ భరించాలని కోరారు. అలాగే ఆ కుటుంబానికి శాశ్వత ఆర్థిక భరోసా కల్పించేందుకు చంద్రధారి భార్యకు అదే ప్రొడక్షన్ హౌస్‌లో తగిన ఉద్యోగం కల్పించాలని లేఖ ద్వారా అభ్యర్థించారు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ సెట్ల నిర్మాణాల సమయంలో వందలాది మంది కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో విద్యుత్ వైరింగ్, కేబుల్స్ , మౌలిక వసతులపై క్రమబద్ధమైన భద్రతా ఆడిట్‌లు నిర్వహించడం ఎంతో అవసరమని సంఘాలు నొక్కిచెబుతున్నాయి. ఫైస్ ముఖ్య సలహాదారు అశోక్ పండిట్ మాట్లాడుతూ తాము ఎప్పటినుంచో ఇలాంటి ప్రమాదాల నివారణకు కఠినమైన నియమ నిబంధనలు.. ఫైర్ సేఫ్టీ ఆడిట్‌లు తప్పనిసరి చేయాలని కోరుతున్నప్పటికీ అధికార యంత్రాంగం నుండి సరైన స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా బడ్జెట్ ఎంత పెద్దదైనా? నిర్మాతలు ఎంతటి ప్రముఖులైనా? కార్మికుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం 8 గంటల పని వేళల తర్వాత ఓవర్‌టైమ్ చెల్లించాల్సి ఉన్నా? చాలా చోట్ల అది అమలు కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ భద్రతా లోపాలు ..పని వేళల నియంత్రణపై మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షేలార్‌కు లేఖ రాయడంతో పాటు, దేశ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) , ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి న్యాయం కోసం పోరాడతామని కార్మిక సంఘాలు ప్రకటించాయి.