డాక్టరేట్ అందుకుని బన్నీ కోసం బరిలోకి
తాజాగా అందిన సమాచారం మేరకు ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ కథానాయిక నజ్రియా నజీమ్ బన్నీకి సిస్టర్ పాత్రలో కనిపిస్తుందని తెలిసింది.;
మాస్ సినిమాలతో రచ్చ చేయడంలోనే కాదు, సైన్స్ ఫిక్షన్ కథాంశంలో మాఫియా డాన్ పాత్రను జొప్పించి ప్రయోగాలు చేయగలడు అట్లీ. అతడు తెరకెక్కిస్తున్న AA22 x A6 కోసం అతడు ఇలాంటి ప్రయోగం చేస్తున్నాడనేది ఇండస్ట్రీ టాక్. అల్లు అర్జున్ ని సూపర్ హీరోగా చూపించబోతున్న అట్లీ ఇటీవల నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పుడు అతడు సాధించిన మరో ఘనత చర్చగా మారింది. దర్శకుడు అట్లీకి సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(చెన్నై) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. అట్లీ ఫిలింమేకర్ కాక ముందు అతడు ఇదే విశ్వవిద్యాలయంలో స్టడీస్ కొనసాగించాడు. జూన్ 14న చెన్నైలో జరగనున్న ఈ వేడుకలో పూర్వవిద్యార్థుల సమ్మేళనంతో ఘనంగా జరగనుంది.
విద్యార్థిగా మొదలై భారతీయ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా అట్లీ ప్రయాణం ఒక స్ఫూర్తి. అతడు రాజా రాణి, తేరి, మెర్సల్, బిగిల్, జవాన్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. తమిళ పరిశ్రమలో అపజయమెరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. షారూఖ్'జవాన్' చిత్రంతో పాన్ ఇండియా హిట్టు కొట్టిన ఘనతను సాధించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ - సన్ పిక్చర్స్‌తో మరో భారీ పాన్ వరల్డ్ సినిమాకి సన్నాహకాల్లో ఉన్నాడు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ ఇప్పటికే ప్రారంభం కాగా, అతడు హైదరాబాద్ కి విచ్చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాను చదువుకున్న యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడం అతడి బాధ్యతను మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. మునుముందు అతడు కేవలం మాస్ యాక్షన్ చిత్రాలే కాకుండా, సామాజిక బాధ్యతతో కూడుకున్న సినిమాలను కూడా తీయాల్సి ఉంటుంది. అట్లీ ఆశయం, పట్టుదల, అపరిమితమైన కలల సాకారం వంటి అంశాలను సెలబ్రేట్ చేయడానికి తమ పూర్వ విద్యార్థులను ఓ చోట సమావేశ పరుస్తూ, విశ్వవిద్యాలయం పెద్ద ప్రణాళికతో ఉంది. ఇది అట్లీకి తన జీవితంలో అద్భుతమైన ఉద్విగ్న క్షణం.
మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా రెగ్యులర్ చిత్రీకరణ కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో కాస్టింగ్ ఎంపికల్ని కూడా చిత్రబృందం పూర్తి చేస్తోంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ కథానాయిక నజ్రియా నజీమ్ బన్నీకి సిస్టర్ పాత్రలో కనిపిస్తుందని తెలిసింది. ఈ పాత్ర సినిమాకి ఎమోషనల్ టచ్ ఇస్తుందని కథనాలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మాఫియా డాన్ గా నటిస్తాడని, మాఫియా నేపథ్యానికి ఫిక్షన్ జోడించి అట్లీ పూర్తిగా కొత్త పంథాలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపిక చేసుకున్న కథాంశం హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఊహాతీతంగా ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది.