రజనీ-శంకర్.. ఒక బయోపిక్

Update: 2018-06-12 10:32 GMT
గత పుష్కర కాలంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ను తెరమీద అద్భుతంగా ప్రెజెంట్ చేసిన ఏకైక దర్శకుడు శంకర్. రజనీ ఇమేజ్ ను సరిగ్గా ఉపయోగించుకుని ఆయన మాత్రమే సూపర్ స్టార్ అభిమానుల్ని అలరించేలా సినిమాలు తీయగలిగారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన శివాజీ.. రోబో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. వీరి కలయికలో రాబోతున్న మూడో సినిమా ‘రోబో-2’ కూడా విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐతే దీని తర్వాత కూడా రజనీతో ఓ సినిమా ప్లాన్ చేశాడట శంకర్. ఐతే ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాల స్టయిల్లో సాగే సినిమా కాదట అది. తమిళనాడుకు చెందిన ట్రాఫిక్ రామస్వామి అనే వ్యక్తి జీవిత కథతో రజనీ కథానాయకుడిగా సినిమా చేయాలనుకున్నాడట శంకర్. కమర్షియల్ స్టయిల్లో కాకుండా వాస్తవిక కోణంలో ఈ సినిమా చేయాలని తాను భావించినట్లు శంకర్ వెల్లడించాడు.

తమిళనాటే కాక దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడం కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి రామస్వామి. కొన్ని దశాబ్దాలుగా దీనిపై ఆయన పని చేస్తున్నారు. జనాల్లో అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వంలోనూ కదలిక తెచ్చారు. ఆయన గురించి పత్రికల్లో చదివి చాలా స్ఫూర్తి పొందానని.. మనసులోనే అభినందనలు తెలిపానని.. కొన్నేళ్ల కిందట ఆయన కథతో సినిమా చేద్దామన్న ఆలోచన వచ్చిందని.. ఆయన పాత్రకు రజనీ చక్కగా సరిపోతారనిపించిందని శంకర్ వెల్లడించాడు. కానీ ఇంతలోనే ఎస్.ఎ.చంద్రశేఖర్ (హీరో విజయ్ తండ్రి) తన స్వీయ దర్శకత్వంలో రామస్వామి బయోపిక్ లో నటించబోతున్నట్లు అనౌన్స్ చేశారని.. అది తెలిసి ఒకింత నిరాశ చెందానని.. కానీ తర్వాత రామస్వామి పాత్రకు చంద్రశేఖర్ చక్కగా సరిపోతారని భావించి సంతృప్తి చెందానని శంకర్ వెల్లడించాడు.

Tags:    

Similar News