రంభ.. రాశి యాడ్స్ ను ఆపేయమన్న కోర్టు!

Update: 2019-02-22 17:20 GMT
మోడరన్ జనరేషన్లో ఎక్కువమంది ఇబ్బంది పడుతున్న విషయం అధిక బరువు.  అందరూ అనుష్కలాగా ఆస్ట్రియా పోలేరు కాబట్టి.. కొంతమంది వాకింగ్ అంటారు.. కొంతమంది జిమ్మంటారు.. కొంతమంది కడుపుకు - నోటికి జాయింట్ గా శిక్ష విధిస్తారు. ఎదోలా తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తారు.  కానీ మెజారిటీ జనాలు ఒక్క మిల్లీ గ్రామ్ కూడా తగ్గరు. ఎలాంటి వారికోసం వెయిట్ లాస్ క్లినిక్స్ చాలా ఉన్నాయి.  అలాంటి వాటిలో ఒకటి కలర్స్ వెయిట్ లాస్ క్లినిక్.

ఈ కలర్స్ వారు ఇచ్చే కలర్ఫుల్ యాడ్స్ లో రంభ.. రాశి కన్పిస్తారు. అప్పట్లో ఎంత బొద్దుగా ఉన్నాము .. ఇప్పుడు ఎంత నాజూగ్గా ఉన్నామో చెప్తూ 'మీరు చేరండి..నాజూగ్గా మారండి' అంటూ ఉంటారు.  ఈ ముద్దుగుమ్మల మాటలు విని చాలామంది ఆ క్లినిక్ లో చేరతారు. అలానే విజయవాడకు చెందన ఒక వ్యక్తి దాదాపుగా రూ. 75000 కట్టి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకున్నాడట. కానీ ఫలితం లేకపోవడంతో కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించి కలర్స్ క్లీనిక్ పై కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా టీవీ చానల్స్ లో తప్పుదారి పట్టించేలా ఉన్న కలర్స్ వారి ప్రకటనలను ఆపాలని కోర్టువారిని కోరారు.  

కంప్లైంట్ లో నిజానిజాలు పరిశీలించిన కోర్టువారు ఆయన కట్టిన ఫీజు మొత్తాన్ని తిరిగివ్వాలని.. దానితో పాటు 9 % వడ్డీని కూడా కలర్స్ వారు చెల్లించాలని తీర్పునిచ్చారు.   ఈ మొత్తమే కాదు కంప్లైంట్ చేసిన అతనికి అదనంగా రెండు లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు. మరోవైపు కలర్స్ వారి ప్రకటనలను ఏ చానల్స్ వారు ప్రసారం చేయకూడదని కూడా ఆర్డర్ పాస్ చేశారు.  భవిష్యత్తులో ఇలాంటి నకిలీ సేవలను ప్రోత్సహిస్తూ ఎవరైనా సెలబ్రిటీలు కనుక నటిస్తే వారికి కూడా జరిమానా విధించాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
    

Tags:    

Similar News