సుక్కు టెన్ష‌న్‌..జ‌క్క‌న్న నో టెన్ష‌న్..అదెలా?

Update: 2021-12-29 06:36 GMT
మ‌న టాలీవుడ్ లో వున్న టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఎవ‌రి పంథా వారిది. ఎవ‌రి స్కూలు వారిది.. ఒక‌రి పంథాను మ‌రొక‌రు ఫాలో అవ్వ‌రు. ఎవ‌రికి వారే ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేస్తుంటారు. అయితే అలా ట్రెండ్ సెట్ చేస్తున్న ద‌ర్శ‌కుల్లో ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి. సుకుమార్ ముందు వ‌రుస‌లో నిలుస్తారు. వీరు చేసిన సినిమాలు అలాంటివి మ‌రి. ఈ ఇద్ద‌రూ తీసే సినిమాలు చాలా భిన్నంగా వుంటాయి. మాస్ ని మెస్మ‌రైజ్ చేయ‌డంలో జ‌క్కన్న‌ని మించిన ద‌ర్శ‌కుడు లేడ‌న్న‌ది అందిరికి తెలిసిందే.

ఆ పంథాకు పూర్తి భిన్నంగా వెళుతూ సినిమాల‌ని తీయ‌డంలో సుకుమార్ శైలి ప్ర‌త్యేకం. ఇప్పుడు ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచారు. వీరిద్ద‌రి సినిమాలు మూడు వారాల వ్య‌వ‌ధిలో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తున్నాయి. సుకుమార్ `రంగ‌స్థ‌లం` త‌రువాత అదే పంథాని అనుస‌రిస్తూ చేసిన చిత్రం `పుష్ప ది రైజ్‌`. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన ఈ చిత్రం గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందింది. ఈ నెల 17న ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా ఓపెనింగ్స్ ప‌రంగానూ హాట్ టాపిక్ గా నిలిచింది.

ఉత్త‌రాదిలోనూ ఈ సినిమా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుండ‌టం ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది. మ‌న తెలుగు సినిమాకు ఉత్త‌రాదిలోనూ మార్కెట్ పెర‌గ‌డం.. అది ఈ సినిమాతో మ‌రోసారి రుజువు కావ‌డంతో ట్రేడ్ వ‌ర్గాలు ఆనందాన్ని, ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు సుకుమార్ విచిత్ర‌మైన ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నారు. చాలా టెన్ష‌న్ ని ఎదుర్కొన్నారు. ఎంత‌లా అంటే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో పాల్గొన‌లేనంత‌. అంత‌గా సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో క్ష‌ణం తీరిక లేకుండా క్ష‌ణ క్ష‌ణం టెన్ష‌న్ ప‌డుతూ గ‌డ‌పాల్సి వ‌చ్చింది.

అయితే జ‌క్క‌న్న వ్య‌వ‌హారం ఇందుకు పూర్తి భిన్నంగా వుండ‌టం గ‌మ‌నార్హం. జ‌న‌వ‌రి 7న రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌` వ‌ర‌ల్డ్ వైడ్ గా దాదాపు 14 భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. పాన్ ఇండియా స్థాయి సినిమాగా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఈ సినిమా వుండ‌బోతోంది. అయితే ఈ సినిమా విడుద‌ల విష‌యంలో రాజ‌మౌళి మాత్రం సుకుమార్ త‌ర‌హాలో టెన్ష‌న్ ప‌డ‌టం లేదు. చాలా జాలీగా ప్ర‌చార ప‌ర్వాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంకా చెప్పుకోద‌గ్గ విష‌యం ఏంటంటే `ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌చార బాధ్య‌త‌ల్ని కూడా త‌నే తీసుకుని ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్స్‌ని ప్లాన్ చేయ‌డం.. ఆ ప్ర‌మోష‌న్స్ లో అంతే జాలీగా హీరోల‌తో పాటు పాల్గొని మీడియా వ్య‌క్తులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అంతే కూల్ గా స‌మాధానాలు చెబుతున్నాడు. ఇది చాలా వ‌ర‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఇంత పెద్ద స్టార్లు క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌. ద‌క్షిణాది నుంచి వ‌స్తున్న అతి పెద్ద సినిమా అయినా కూడా రాజ‌మౌళిలో కించిత్ కూడా టెన్ష‌న్ క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే అంటున్నారంతా.

అయితే జ‌క్క‌న్న టెన్ష‌న్ ఫ్రీగా వుండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం సినిమా రిలీజ్ కు నెల రోజుల ముందే అన్నీ కంప్లీట్ చేసుకుని ప్రచారానికి సిద్ధ‌మైన తీరు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్నాడు కాబ‌ట్టే జ‌క్క‌న్న ఎక్క‌డా టెన్ష‌న్ ప‌డ‌టం లేద‌ని, సినిమా ఫ‌లితంపై కూడా పూర్తి క్లారిటీతో వుండ‌టం కూడా ఓ కార‌ణంగా క‌నిపిస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. `ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో రాజ‌మౌళి ఎలాంటి టెన్ష‌న్ లేకుండా క‌నిపించ‌డాన్ని చూసిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ప్లానింగ్ లేకుంటే సుక్కులా టెన్ష‌న్‌.. ప్లానింగ్ ప‌ర్ఫెక్ట్‌గా వుంటే జ‌క్క‌న్న లా నో టెన్ష‌న్... అని స‌ర‌దాగా మాట్లాడుకుంటున్నారు. నిజ‌మే క‌దా..
Tags:    

Similar News