'కపుల్ ఫ్రెండ్లీ' జోరు.. బ్రేక్ ఈవెన్ కోసం స్పీడ్ పెంచారుగా..
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది.;
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు థియేటర్ల వద్ద మంచి సౌండ్ చేస్తోంది. ముఖ్యంగా యూత్ నుండి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. వీకెండ్ కావడంతో పాటు సోషల్ మీడియాలో వినిపిస్తున్న మౌత్ టాక్ సినిమా వసూళ్లపై గట్టి ప్రభావం చూపుతోంది.
రెగ్యులర్ గా చిన్న సినిమాలకు ప్రమోషన్లు ఎంత ముఖ్యం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమా విషయంలో కంటెంట్ మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ‘లివ్ ఇన్’ రిలేషన్‌షిప్ నేపథ్యంలో సాగే ఈ కథకు ఓ వర్గం ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది.
ఇక తొలిరోజున 1.89 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం, రెండో రోజు ఆదివారం కూడా అదే జోరును కొనసాగించి రెండు రోజుల్లో మొత్తం 3.96 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంటే మొదటి రోజు కంటే రెండో రోజే కలెక్షన్స్ లో మంచి గ్రోత్ కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు ఆదివారం నాటి షోలన్నీ హౌస్‌ఫుల్ కావడం విశేషం. దీనివల్ల కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుకు చాలా దగ్గరగా వచ్చేసింది.
ఈ సినిమా సక్సెస్ లో ప్రభాస్ సపోర్ట్ కూడా చాలా కీలకంగా మారింది. ప్రభాస్ స్వయంగా సినిమాపై పాజిటివ్ గా సోషల్ మీడియాలో రియాక్ట్ కావడంతో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ప్రభాస్ ఇచ్చిన థంబ్స్ అప్ తో ఆదివారం నాటి ఆక్యుపెన్సీ పెరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు సంతోష్ శోభన్, మానస వారణాసి కూడా తమకు తోచిన విధంగా చేసిన సింపుల్ రీల్స్ కి యూత్ నుండి మంచి క్రేజ్ వచ్చింది.
సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా వసూళ్లపై అది పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపలేదు. టైటిల్ వల్ల వచ్చిన ఆ సర్టిఫికేట్ ని పక్కన పెడితే, సినిమాలోని స్వచ్ఛమైన ప్రేమకథ పెద్దలను కూడా ఆకట్టుకుంటోంది. డీసెంట్ టాక్ ఉండటంతో సోమవారం నుండి కూడా కలెక్షన్స్ స్టడీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒక రకంగా యూవీ క్రియేషన్స్, సంతోష్ శోభన్ ఇద్దరికీ కావాల్సిన హిట్ ఈ రూపంలో దొరికినట్లే. ఏదేమైనా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. తక్కువ బడ్జెట్‌తో తీసినా, కంటెంట్ ఉంటే ఆడియన్స్ కచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపిస్తోంది.