కంగన వ్యాఖ్యలు 'సిగ్గుచేటు'.. స్టార్లుగా మార్చేది యువతే.. సోనూసూద్ ఘాటు వ్యాఖ్యలు!
భాజపా ఎంపీ, నటి కంగనా రనౌత్ యువతను (జెన్ Z) ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
భాజపా ఎంపీ, నటి కంగనా రనౌత్ యువతను (జెన్ Z) ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. నీట్-యుజి -2026 పేపర్ లీక్ ఆందోళనల్లో యువత ప్రవర్తించిన తీరుపై కంగన చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తీవ్రంగా స్పందించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సోనూ సూద్.. కంగనా వ్యాఖ్యలను `సిగ్గుచేటు` అని అభివర్ణిస్తూ.. నటులను స్టార్లుగా మార్చేది యువతేనని... అటువంటి యువతను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు.
ఈ వివాదంపై కంగనా రనౌత్ గురు పౌర్ణమి సందర్భంగా ఒక సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోల నుండి ప్రేరణ పొంది ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్న కంగన సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో యువత ప్రదర్శించిన ప్రవర్తన సభ్యసమాజం ఆమోదించలేని విధంగా ఉందని ఆరోపించారు. బహిరంగ ప్రదేశాల్లో.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు.. వృద్ధుల ముందు అసభ్యకరమైన ప్రవర్తనను సాధారణ విషయంగా తీసుకోకూడదని వ్యాఖ్యానించారు.
తన వీడియోలో కంగనా మాట్లాడే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. సమాజంలో నివసించేటప్పుడు క్రమశిక్షణ... సామాజిక సరిహద్దులు పాటించడం ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఇతరుల హక్కులను లేదా భావాలను దెబ్బతీసేలా ఉండకూడదని తెలిపారు. అంతేకాకుండా, `ఫెమినిజం` పేరుతో కొంతమంది యువతను బాధ్యతారాహిత్యం వైపు ప్రోత్సహిస్తున్నారని విమర్శించిన కంగనా... గురు పౌర్ణమి రోజున మృగప్రవర్తనను, వ్యతిరేక ధోరణులను వీడి.. గురువుల బోధనలను అనుసరిస్తూ వ్యక్తిగత వికాసానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు తన వ్యాఖ్యలను మీడియా సగం మాత్రమే చూపిస్తోందని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో స్టార్టప్‌లు నడుపుతున్న యువతను, నీట్ పరీక్షల్లో సాధించిన విజేతలను తాను ఎల్లప్పుడూ ప్రశంసిస్తానని గుర్తుచేశారు. తన సొంత టీమ్‌లోనూ, కుటుంబంలోనూ ఉన్న జెన్ జెడ్ యువత ఎంతో బాధ్యతాయుతంగా.. కష్టపడి పనిచేస్తారని చెప్పుకొచ్చారు. అయితే చట్టబద్ధమైన , సామాజిక పరిమితులను దాటే ప్రవర్తనను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు.
అయితే ఈ విషయంలో సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ .. కంగనా రనౌత్ మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన మాటల యుద్ధం సాగుతోంది. కంగనా వ్యాఖ్యలపై సౌరవ్ దాస్ మండిపడగా..ఆమె కూడా ఆయనను ``ఉద్యోగం లేని పనికిరాని వ్యక్తి`` అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. నీట్-యుజి 2026 పరీక్షా విధానంలో జరిగిన పొరపాట్లపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు ముగిసినా... నటుడు సోనూ సూద్ ప్రవేశంతో కంగనా రనౌత్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్న వివాదం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో మరింత వేడెక్కిస్తోంది.