30 కోట్ల‌తో 23రోజుల్లో 300 కోట్లు.. 10రెట్లు లాభం తెచ్చిన సినిమా!

మలయాళ చిత్ర పరిశ్రమలో ఈసారి ఓనం పండుగ రేసులో ఎంతోమంది స్టార్ హీరోలు, దిగ్గజాలు పోటీపడినా బాక్సాఫీస్ వద్ద అందరినీ వెనక్కి నెట్టి నివిన్ పౌలీ ఒక సంచలన విజయాన్ని నమోదు చేశారు.

Update: 2026-09-13 09:32 GMT

మలయాళ చిత్ర పరిశ్రమలో ఈసారి ఓనం పండుగ రేసులో ఎంతోమంది స్టార్ హీరోలు, దిగ్గజాలు పోటీపడినా బాక్సాఫీస్ వద్ద అందరినీ వెనక్కి నెట్టి నివిన్ పౌలీ ఒక సంచలన విజయాన్ని నమోదు చేశారు. దుల్కర్ సల్మాన్ నటించిన `ఇమ్ గేమ్` సినిమాతో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన `ఖలీఫా` వంటి భారీ చిత్రాలు బరిలో ఉన్నప్పటికీ నివిన్ పౌలీ హీరోగా నటించిన `బెత్లహేమ్ కుటుంబ యూనిట్` చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం 23 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఈ సినిమాలో ఇటీవల సూర్య సరసన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న లక్కీ గాళ్ మమితా బైజు కథానాయికగా నటించడం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయింది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మలయాళంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో అత్యంత సాధారణంగా తెరకెక్కిన ఈ చిత్రం.. మౌత్ టాక్‌తో పుంజుకుని ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయికి చేరువ కావడం విశేషం. సెప్టెంబర్ 4న తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ అద్భుతమైన ఆదరణను దక్కించుకుంది.

ఈ భారీ విజయం ద్వారా సినీ పరిశ్రమకు ఒక స్పష్టమైన సందేశం లభించిందని చెప్పవచ్చు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు.. భారీ మార్కెట్ ఉన్న ఇమేజ్ కంటే బలమైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఏ రేంజ్‌లో నెత్తిన పెట్టుకుంటారనేదానికి `బెత్లహేమ్ కుటుంబ యూనిట్` విజయమే నిదర్శనం. కథలో దమ్ముంటే చిన్న బడ్జెట్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సునామీ సృష్టించగలదో ఈ చిత్రం నిరూపించింది. సినిమా విడుదలై ఇన్ని రోజులు గడిచినా నైట్ షోలలో ఏకంగా 73.17 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం దీనికి నిలువెత్తు సాక్ష్యం.

ఇదే సమయంలో దుల్కర్ సల్మాన్ నటించిన `ఇమ్ గేమ్` చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. సెప్టెంబర్ 3న విడుదలైన ఈ యాక్షన్ చిత్రం పది రోజుల్లో దేశీయంగా రూ. 24.39 కోట్ల నెట్ రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 46.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో మలయాళ వెర్షన్ హవా ఎక్కువగా ఉండగా... తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లు కూడా తమ వంతు కలెక్షన్లను రాబట్టాయి. అయితే పెద్ద స్టార్ల సినిమాలు పోటీలో ఉన్నా నివిన్ పౌళీ చిత్రం సాధించిన వసూళ్ల జోరు ముందు ఇవి కొంత వెనుకబడ్డాయి.

మొత్తంగా చూస్తే.. మలయాళ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రెండు భిన్నమైన ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ చిత్రం స్థిరమైన వసూళ్లతో ముందుకు సాగుతుండగా... నివిన్ పౌలీ `బెత్లహేమ్ కుటుంబ యూనిట్` మాత్రం కేవలం రూ. 30 కోట్ల పెట్టుబడితో రూ. 300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఓనం రేసులో స్టార్ల హవాను తట్టుకుని కంటెంట్ బలంతో ఈ చిత్రం సాధించిన విజయం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News