800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!
| కెరీర్‌లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో ఓర్పు, నమ్మకం అవసరమన్నారు. `స్త్రీ 2` తర్వాత ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటారు. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన `స్త్రీ 2` చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత అమ్మడికి భారీ ఆఫర్లు, కోట్లలో రెమ్యునరేషన్లు క్యూ కట్టాయన్నది కాదనలేని నిజం. తాజాగా ఇదే విషయాన్ని అమ్మడు మరోసారి రివీల్ చేసింది. మంచి కథ కోసం సుదీర్ఘంగా వేచి చూసేందుకు సిద్ధపడ్డానే తప్ప ఏ సినిమాకు వెంటనే సంతకం చేయలేదని శ్రద్ధా కపూర్ స్వయంగా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన క్యూ అండ్ ఏ సెషన్‌లో యువతకు, అభిమానులకు కెరీర్ మార్గదర్శకాలపై సలహాలు ఇస్తూ ఈ విషయాన్ని రివీల్ చేసారు.
కెరీర్‌లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో ఓర్పు, నమ్మకం అవసరమన్నారు. `స్త్రీ 2` తర్వాత ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. భారీ మొత్తంలో డబ్బుతో ఆఫర్లు వచ్చినా? మనసుకు నచ్చే పర్‌ఫెక్ట్ స్టోరీ దొరికే వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని ముందుగానే నిశ్చయించుకున్నట్లు తెలిపారు. సినిమా పరిశ్రమలో ఓ పెద్ద విజయం అందుకున్న తర్వాత తదుపరి ప్రాజెక్టును ఎంచుకోవడంలో చాలా ఒత్తిడి ఉంటుందని ..కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా? మనసు చెప్పిన మాటకు విలువ ఇవ్వాలని శ్రద్ధా అభిప్రాయపడ్డారు.
వచ్చిన ఆఫర్లను పక్కన పెట్టి సరైన కథ కోసం ఓపిక పట్టడం కష్టంగా అనిపించినా? ఆ వెయిటింగ్ వల్ల ఇప్పుడు తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. డబ్బు కన్నా కంటెంట్ ప్రధానమని నమ్మే శ్రద్ద దృక్పథం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్‌గా మారింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన `స్త్రీ 2` చిత్రం 2024లో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా 857 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన హర్రర్-కామెడీ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
ఈ సక్సెస్ తర్వాత శ్రద్ధా క్రేజ్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. దీంతో నిర్మాతలు ఆమెతో వెంటనే సినిమాలు చేయడానికి పోటీ పడ్డారు. అయితే తొందరపడి ఏ ప్రాజెక్ట్‌ను అంగీకరించని శ్రద్ధా కపూర్ ప్రస్తుతం లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఈత` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాడాక్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రంలో ప్రముఖ కళాకారిణి విఠాబాయి భావు మంగ్ నారాయణ్‌గాంకర్ పాత్రలో కనిపించనున్నారు.
మహిళా కళాకారిణి ధైర్యసాహసాలు.. ఆమె జీవిత ప్రయాణాన్ని కళ్లకు కట్టే ఈ కథ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. డబ్బు, స్టార్‌డమ్ వెనుక పరుగెత్తకుండా బలమైన కథలకే ప్రాధాన్యత ఇస్తానని శ్రద్ధా కపూర్ మరోసారి నిరూపించారు. `స్త్రీ 2` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కూడా శ్రద్ద చూపిన సంయమనం, నటనపై ఆమెకున్న అంకితభావం తోటి నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. శ్రద్దా కపూర్ కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు మరింత పకడ్బందీగా మారుతోందని తెలుస్తోంది.