స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!
| ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా తన జీవితంలో కష్టకాలంలో అండగా నిలిచిన నలుగురు స్నేహితుల నిజ జీవిత అనుభవాల ఆధారంగా తెరకెక్కించినట్లు దర్శకుడు తరుణ్ భాస్కర్ వెల్లడించారు. వరుస వైఫల్యాల సమయంలో చాలామంది దూరమైనా, ఆ నలుగురు మాత్రం తనకు తోడుగా నిలిచారని తెలిపారు. వారి స్నేహం, సరదా గొడవలే సినిమా కథకు స్ఫూర్తిగా మారాయని చెప్పారు. థియేటర్లలో ఆశించిన వసూళ్లు రాకపోయినా, ఓటీటీలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నవంబర్ 19న విడుదలకు సిద్ధమవుతోంది.
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన యూత్ ఫుల్ కల్ట్ హిట్ మూవీ `ఈ నగరానికి ఏమైంది` వెనుక ఉన్న అసలు కథ తాజాగా బయటకొచ్చింది. ట్రెండింగ్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా కేవలం ఒక కల్పిత కథ కాదని, తన జీవితంలో అత్యంత కష్టకాలంలో తోడు నిలిచిన నలుగురు స్నేహితుల నిజ జీవిత అనుభవాల ఆధారంగానే రూపొందించానని వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు.
తొలి సినిమా `పెళ్లిచూపులు` బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించినా? ఆ సక్సెస్ ఇచ్చిన ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ కథను ఎంచుకున్నట్లు తరుణ్ తెలిపారు. అంతకుముందు ఎదుర్కొన్న వరుస వైఫల్యాల సమయంలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా ఏ మాత్రం లెక్కచేయకుండా వెన్నంటి నిలిచిన నలుగురు నిజమైన స్నేహితులే ఈ సినిమాకు అసలైన స్ఫూర్తి అని గుర్తు చేసుకున్నారు. ఆ నలుగురు స్నేహితుల మధ్య ఉండే స్వచ్ఛమైన బంధాన్ని, వారి మధ్య జరిగే సరదా గొడవలను సహజంగా తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తరుణ్ వివరించారు.
ఎవరి జీవితంలోనైనా స్నేహం అనేది ఎంతో పవిత్రమైనదని.. ఎలాంటి కష్టాల్లోనైనా అండగా నిలిచే ఆ బంధం తాలూకు అనుభవాలే `ఈ నగరానికి ఏమైంది` చిత్రంలో ప్రధాన పాత్రల రూపకల్పనకు పునాదిగా మారాయని తెలిపారు. సినిమా విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోయినా? యూత్ మాత్రం దీనికి పూర్తిగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు, ఫ్రెండ్స్ గ్యాంగ్స్‌కు ఈ సినిమా ఒక ఎమోషనల్ కనెక్ట్‌గా మారిపోయింది. ఓటీటీ లో కూడా చిత్రానికి కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడటం విశేషం. నేటితరం యూత్‌ను ఇన్‌స్పైర్ చేసిన మోస్ట్ రిలవెంట్ సినిమాల్లో ఇదొకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న `ఈ నగరానికి ఏమైంది రిపీట్` పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను తదితరులు నటిస్తున్న ప్రాజెక్ట్ నవంబర్ 19న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి భాగం అందించిన కల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మించి ఈ సీక్వెల్ ఉంటుందని.. ప్రేక్షకులకు పూర్తి స్థాయి నవ్వుల విందును అందిస్తామని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒక దర్శకుడిగా పడిన కష్టాలు.. ఆ సమయంలో వెన్నంటి ఉండి ధైర్యం చెప్పిన నలుగురు ఆప్తమిత్రుల నిజమైన బంధాన్ని వెండితెరకు అద్భుతంగా మలిచి తరుణ్ భాస్కర్ సృష్టించిన మ్యాజిక్ ఎప్పటికీ నిలిచిపోతుంది. వినోదాన్ని పంచడమే కాకుండా ప్రతి ఒక్కరి రియల్ లైఫ్ ఫ్రెండ్‌షిప్‌ను గుర్తుచేసేలా నిలవడం ఈ సినిమా ప్రత్యేకత.