విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!
| చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కాకా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు రూ.70 కోట్లు కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా 2027 జనవరి 13న విడుదల కావాల్సి ఉండగా, విశ్వంభర కూడా సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశంతో విడుదల తేదీపై సందిగ్ధం నెలకొంది. అవసరమైతే కాకాను పాన్ ఇండియా స్థాయిలో వాయిదా వేసి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న కాకా సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందే జరుగుతున్న బిజినెస్ హాట్ టాపిక్‌గా మారాయి.
చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న కాకాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలో కాకా సినిమాకు సంబంధించి తాజాగా వినిపిస్తున్న బిజినెస్ వార్తలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు ఏకంగా రూ.70 కోట్లు కోట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి ఉన్న క్రేజ్, బాబీకి ఉన్న హిట్ ట్రాక్ రికార్డు కారణంగానే ఈ స్థాయిలో బిజినెస్ అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ భారీ మొత్తాన్ని పెట్టి తెలుగు రాష్ట్రాల హక్కులను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో మలయాళ నటి అనస్వర రాజన్ చిరంజీవి కుమార్తె అమ్ములు పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, నివేదా పేతురాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకా సినిమా 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే చిరంజీవి మరో సినిమా విశ్వంభర కూడా సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ అలా జరిగితే కాకాను కాస్త ఆలస్యంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయితే ఈ సినిమా బిజినెస్ మరింత జరగచ్చేమో వేచి చూడాలి.