ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించని స్థితిలో!
| ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన ఇలియానా, కాజల్, నయనతార, త్రిష, అనుష్కల కెరీర్లు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. ఇలియానా కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకు దూరంగా ఉండగా, కాజల్ ప్రయోగాత్మక కథలపై దృష్టి పెడుతున్నారు. నయనతార లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్రిష ఎంపిక చేసిన ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. మరోవైపు అనుష్క సినిమాల వేగం తగ్గించి, మలయాళ చిత్రం ‘కథనార్’తో కొత్త భాషలో అడుగుపెడుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన ఈ భామలు ఇప్పుడు తమ కెరీర్‌ను విభిన్నంగా మలుచుకోవడం ఆసక్తికరంగా మారింది.
తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమలలో దశాబ్దానికి పైగా తమ ఏకచ్ఛత్రాధిపత్యాన్ని చెలాయించిన అగ్ర కథానాయికలు నేడు ఎక్కడున్నారు? తమ గ్లామర్, అభినయంతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో కొలువుదీరిన సీనియర్ హీరోయిన్లు ఇప్పుడు వెండితెరపై ఎందుకు తక్కువగా కనిపిస్తున్నారు? ఇలియానా, కాజల్ అగర్వాల్, నయనతార, త్రిష, అనుష్కల ప్రస్తుత సినిమా లైనప్ - వారి వ్యక్తిగత జీవిత విశేషాలను పరిశీలిస్తే సినీ గ్లామర్ ప్రపంచంలో కాలానుగుణంగా వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.
దేవదాసు, పోకిరి చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన గోవా సుందరి ఇలియానా డిక్రూజ్ గత కొంతకాలంగా వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. తన నుంచి చివరిగా వచ్చిన ప్రాజెక్ట్‌లను పరిశీలిస్తే బాలీవుడ్ చిత్రం `దో ఔర్ దో ప్యార్` (2024) కాగా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఓటీటీ మూవీ `తేరా క్యా హోగా లవ్లీ` లలో మెరిసారు. ఆ తర్వాత నుంచి కొత్త సినిమాలకు కమిట్ కాకుండా.. తన వ్యక్తిగత జీవితానికి .. పిల్లల పెంపకానికే ఇల్లీ ప్రాధాన్యతనిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం కుటుంబంతో గడిపే మధుర జ్ఞాపకాలనే ఎక్కువగా షేర్ చేస్తున్న ఈ భామ ప్రస్తుతానికి సినిమాలకు దూరంగానే గడుపుతున్నారు.
చందమామ కాజల్ అగర్వాల్ వివాహానంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` , నందమూరి బాలకృష్ణతో `భగవంత్ కేసరి` వరకు వరుస ప్రాజెక్ట్‌లు చేశారు. ఇటీవలే పంటలు, క్రిమిసంహారకాల నేపథ్యంతో కూడిన `సత్యభామ` వంటి ప్రయోగాత్మక చిత్రంలోనూ కథానాయికగా మెరిసారు. అయితే ప్రస్తుతం అగ్ర హీరోల సరసన పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించడంతో పాటు, కుమారుడి పెంపకానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. గ్లామర్ పాత్రల కంటే ప్రయోగాత్మకమైన, లేడీ ఓరియంటెడ్ కథల వైపు మాత్రమే కాజల్ ప్రస్తుతం మొగ్గు చూపుతున్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార కమర్షియల్ విక్టరీలతో దూసుకుపోతున్నా గతంలో లాగా అగ్ర హీరోలతో వరుస ప్రాజెక్ట్‌లు కనిపించడం లేదు. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో `జవాన్`, తెలుగులో చిరంజీవితో చేసిన సినిమా తర్వాత, ఇటీవలే కన్నడ స్టార్ యష్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` లోనూ ఓ కీలక పాత్రలో నటించారు. అయితే మునుముందు లైనప్‌లో అగ్ర కథానాయకుల సినిమాలు తక్కువగానే ఉన్నాయి. నయన్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ రొమాంటిక్ కామెడీ `మన్నాంగట్టి సిన్స్ 1986` .. మలయాళ చిత్రం `డియర్ స్టూడెంట్స్` విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడున్న టాప్ 10 హీరోలతో నయనతార సినిమాలేవీ చేయడం లేదు.
త్రిష కృష్ణన్ గత ఏడాది (2025)లో కమల్ హాసన్ `థగ్ లైఫ్`, అజిత్ `విడాముయర్చి`, గుడ్ బ్యాడ్ అగ్లీ, మలయాళంలో ఐడెంటిటీ వంటి నాలుగు పెద్ద చిత్రాలతో సత్తా చాటి జోరు ప్రదర్శించారు. కానీ 2026కి వచ్చేసరికి తమిళ స్టార్ సూర్యతో కలిసి ఆర్జే బాలాజీ దర్శకత్వంలో `కరుప్పు` (మే 14, 2026న విడుదలైన ఫాంటసీ యాక్షన్ మూవీ) మినహా పెద్దగా సందడి లేదు. ప్రస్తుతం తమిళనాడులో త్రిష పేరు నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌తో ముడిపడి రాజకీయాల్లోకి వస్తోందంటూ విస్తృత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో త్రిష కొత్త సినిమాల సంతకాల విషయంలో కొంత వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
జేజమ్మ అనుష్క ఇటీవలి కాలంలో అస్సలు తెరపై కనిపించడం లేదు. ఈ అగ్ర హీరోయిన్ నటించిన సినిమాలేవీ ఇటీవల ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఓవైపు పెళ్లి ప్రయత్నాలు అంటూ పుకార్ల నడుమ తన స్టార్ హీరోయిన్ స్టాటస్ నుంచి కొంత పక్కకు జరిగినట్టు అనిపిస్తోంది. అనుష్క నటిస్తున్న తదుపరి చిత్రాలేవీ? అంటే వెంటనే అభిమానులు చెప్పలేరు. ప్రభాస్, మహేష్, నాగార్జున, గోపిచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించిన అనుష్క ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడం నిరాశపరుస్తోంది. తెలుగులో ఘాటి తర్వాత మలయాళంలో కథనార్ - ది వైల్డ్ సోర్సెరర్ అనే చిత్రంలో నటించారు. జయసూర్యతో కలిసి చేస్తున్న భారీ విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) ఆధారిత మైథలాజికల్ ఫాంటసీ చిత్రం ద్వారా అనుష్క మలయాళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. జనవరి 2027లో ఈ చిత్రం విడుదలవుతుందని సమాచారం.